కదిలిస్తే కన్నీరు..!! | Pension trouble in kadapa district people | Sakshi
Sakshi News home page

కదిలిస్తే కన్నీరు..!!

Published Tue, May 8 2018 10:28 AM | Last Updated on Tue, May 8 2018 10:28 AM

Pension trouble in kadapa district people - Sakshi

కలెక్టరేట్‌ ప్రవేశ ద్వారం వద్ద పడుకుని..లేవలేక ఇబ్బంది పడుతున్న ఈమె పేరు చెప్పలి సుబ్బమ్మ. దాదాపు 80 ఏళ్ల వయస్సు. చెన్నూరు గ్రామం. ఏళ్ల తరబడి అక్కడి రెవెన్యూ కార్యాలయంలో స్వీపర్‌గా నెలకు రూ. 500  జీతంతో కాలం వెల్లదీస్తోంది.దాదాపు నాలుగైదు నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకపోవడంతో అధికారులను కలవాలని వచ్చింది. భర్త పెద్ద యల్లయ్య, కుమారులు రామసుబ్బయ్య, చిన్న యల్లయ్యలు నాలుగేళ్ల క్రితం చనిపోయారు. ఎన్నిమార్లు చెన్నూరు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే వారు లేక పెద్ద సార్‌ను కలవాలని వచ్చింది. కలెక్టర్‌ సారూ లేరని తెలిసి..పాదరక్షలు కూడా లేని వృద్ధురాలు. బయటికి నడవలేక అక్కడే మెట్లపైనే కూర్చుంది. కడపకు ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమానికి ఎందరో ఇలాంటి సమస్యలతోనే వస్తున్నారు. కనీసం ఇలాంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి వెంటనే పరిష్కారానికి చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.  – సాక్షి, కడప    

50 సార్లు తిరిగా..
నా పేరు అంకాలమ్మ. మాది రాజంపేట సమీపంలోని బోయనపల్లె. నా బిడ్డ అంజిని ఎత్తుకుని ప్రతిసారి ఇక్కడికి వస్తున్నా. రానుపోను ఛార్జీలు రూ. 80 అవుతున్నాయి. గుడిసెల్లో ఉంటున్నాం. ఇల్లు కావాలని ఎన్నిమార్లు మొరపెట్టుకుంటున్నా మా బాధ వినే వారు లేరు. పప్పులు, ఎర్రగడ్డలు, ఇనుప, ప్లాస్టిక్‌ సామాన్లు అమ్ముకుని ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికి కడపలోని కలెక్టర్‌ దగ్గరకు మూడుసార్లు వచ్చినా ఇంతవరకు ఇంటికి సంబంధించి ఏమీ చెప్పలేదు. ఎప్పుడు కలిసినా ఇస్తామంటున్నారు. కానీ ఇవ్వలేదు. రాజంపేట తహసీల్దార్‌ ఆఫీసుకు 50 సార్లకు పైగా పోయి బాధ చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.

పింఛన్‌ ఇప్పించండి మహాప్రభో...
నా పేరు ఇమాంబీ. మాది రాయచోటి మాసాపేట. నాకు 70 ఏళ్లు. నేనొక్కదాన్ని రాలేక మా బంధువుల పాప హసీనాను వెంట బెట్టుకుని వచ్చాను. ఇటీవలె కంటి ఆపరేషన్‌ కూడా చేయించుకున్నాను. ఫించన్‌ కోసం తిరుగుతూనే ఉన్నా. ఎప్పుడిస్తారో తెలియదుగానీ అవస్థలు మాత్రం పడుతూనే ఉన్నాం. పలుమార్లు ఎమ్మార్వో ఆఫీసులో ఇచ్చాం. ఇక్కడ కూడా ఇద్దామని కలెక్టరేట్‌కు ఇచ్చా.

మామిడి చెట్లు ఎండిపోతున్నాయి...
నాపేరు రామచంద్రయ్య. మాది చిట్వేల్‌ మండలం కేసీ ఆగ్రహారం. నాకు 4.99 ఎకరాల పొలం ఉంది. నాకు ఎస్సీ కార్పోరేషన్‌ తరుపును ప్రభుత్వం బోరు మోటారు మంజూరు చేసింది. కానీ అధికారులు వచ్చి సర్వే చేసి పక్క పొలంలో ఉన్న బోరుకు మీ బోరుకు తక్కువ దూరం ఉందని వెళ్లిపోయారు. దీంతో నా పంట పొలంలోని మామిడిచెట్లు ఎండిపోతున్నాయి. సంబంధిత విషయం గురించి అధికారుల దృష్టికి తెచ్చేందుకు వచ్చాను.

సబ్సిడీ మంజూరు కాలేదని రుణానికి కొర్రీ..
నా పేరు ఎం. నరసింహులు. నాది రామాపురం మండలం. నేను జీవనాధారం కోసం అంగడి ఏర్పాటు చేసుకోవడానికి స్టేట్‌ బ్యాంకులో లక్ష రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాను. బీసీ కార్పొరేషన్‌ నుంచి సగం సబ్సిడీ వస్తుంది. మార్చి 29వ తేది బీసీ కార్పొరేషన్‌ అధికారులు సబ్సిడీ మొత్తాన్ని స్టేట్‌ బ్యాంకుకు పంపించారు. ఈ మేరకు నాకు సమాచారం వచ్చింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం సబ్సిడీ మొత్తం తమకు అందలేదని రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చేందుకు ఇక్కడికి వచ్చాను.

పెన్షన్‌ మంజూరు చేయాలి..
నాపేరు విజయలక్ష్మి. నాది సీకే దిన్నె మండలం. నా భర్త సంవత్సరం క్రితం మరణించాడు. నాకు ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారు. నేను కూలీనాలీ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. కుటుంబ యజమాని మరణించినప్పటికీ నేషనల్‌ ఫ్యామిలీ బెనిఫిట్‌ స్కీమ్‌ కింద ఆర్థిక సహాయం రాలేదు. మాకు ఇంటి స్థలం కూడా లేదు. ప్రభుత్వం వితంతు పింఛన్‌ మంజూరు చేస్తే మా కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటుంది.

నా స్థలం అమ్ముకున్నారు..
నాపేరు రామక్రిష్ణయ్య. మాది మాధవరం మండలం ఉప్పరపల్లె గ్రామం. నాకు ప్రభుత్వం 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చింది. దానిని వేరే వాళ్లు అమ్ముకున్నారు. దానిని గురించి అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాను.

అడంగల్‌లో పేరున్నా అడ్డుకుంటున్నారు..
నాపేరు సి. ఈశ్వరయ్య. బి.మఠం మండలంలోని నరసన్నపల్లెలో 189 సర్వే నెంబర్లలో నాకు 17 సెంట్ల స్థలముంది. అందుకు సంబం ధించి నా పేరు మీద అడంగల్‌ కూడా అయితే, అక్కడ సర్వే జరగకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. 10 నుంచి 15 సార్లు ఇక్కడికి వచ్చాను. అయితే అధికారులు విచారణ చేయడం లేదు.

ఎన్నిసార్లు తిరగాలి..
నా పేరు సిట్టేలుగాళ్ల గంగమ్మ. మాది మైదుకూరు మండల పరిధిలోని నంద్యాలంపేట పంచాయతీలోని కొత్త విపురాపురం. ప్రభుత్వం నాకు, నా చెల్లెలుకు మూడు ఎకరాల భూమిలో బోరు వేశారు. కానీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని సంబంధిత ట్రాన్స్‌కో, ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వలేదు. ఇప్పటికి కలెక్టర్‌కు చెప్పడానికి పదిసార్లు వచ్చాను.

భూమి కొనుగోలు చేసి అందించాలి...
నా పేరు ఓబయ్య. నాది దువ్వూరు. మా మండలంలోని గొల్లపల్లెలో భూమి ఎస్సీలకు కేటాయించారు. అధికారికంగా కేటాయించాల్సి ఉంది. అందుకు  అధికారులు ఈరోజు, రేపు వచ్చి పరిశీలిస్తామంటున్నారు. ఇంతవరకు రాలేదు. హద్దుల వద్ద జెండాలు కూడా నాటారు. కానీ ఇంతవరకు అధికారులు వచ్చి పరిశీలించకపోవడంతో ఎప్పుడు భూమి ఇస్తారో తెలియడం లేదు.  

సీఎం సహాయ నిధి ఇచ్చి ఆదుకోండి...
నాపేరు ప్రకాశం. మాది కమలాపురం మండలం పైడికాల్వ గ్రామం. నేను ఇటీవలే తిరుపతిలోని స్విమ్స్‌లో ఊపిరితిత్తుల ఆపరేషన్‌ చేయించుకున్నారు. దానికి అయిన ఖర్చుల గురించి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. సంబంధిత విషయం గురించి అ«ధికారులను పలుమార్లు అడిగినా  పట్టించుకోవడం లేదు.  దీనిపై ప్రజావాణికి వచ్చి అర్జీ ఇచ్చాను.

సిమెంట్‌ ఇవ్వకపోవడం ఏమిటి...
నాపేరు పెంచలయ్య. మాది రాజంపేట మండలం పోలీ పంచాయతీ చిండ్రిగాయపల్లె గ్రామం. నాకు ప్రభుత్వ ఎన్‌టీఆర్‌ గృహ పథకం కింద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. ప్రస్తుతం ఇంటికి స్లాబ్‌ను వేసుకునేందుకు 35 బస్తాల సిమెంట్‌ను మంజూరు అయ్యింది. సంబంధిత సిమెంట్‌ను గోడౌన్‌ ఇన్‌చార్జు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. స్లాబ్‌ నిలిచిపోయింది. ఇలా చాలామందికి సిమెంట్‌ ఇవ్వడం లేదు.

పరిహారం ఎంత ఇస్తారో చెప్పడం లేదు..
నాపేరు వెంకటరమణారెడ్డి, వేంపల్లి మండలం ఆలిరెడ్డిపల్లె ఎంపీటీసీని. మాగ్రామ  పొలాల్లో నుంచి కడప నుంచి బెంగుళూరుకి వెళ్లే రైల్వేట్రాక్‌ మంజూరైంది. కానీ మా పొలాలకు రైల్వేశాఖ ఎంతనష్టçపరిహారం ఇస్తుందో అర్థం కావడం లేదు. సర్వే కోసం వచ్చిన అధికారులు కూడా చెప్పడం లేదు. మా పంట పొలాలు మూడు కార్లు   పండుతాయి. దీంతోపాటు మార్కెట్‌ విలువ కూడా ఎక్కువగా ఉంది. మరి రైల్వేశాఖ వారు నష్టపరిహారం కింద ఎంత డబ్బులిస్తారో అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వచ్చా.

భూమి అభివృద్ధికి చేయూత ఇవ్వండి..
నాపేరు పెద్ద సుంకన్న. నాది మైలవరం మండలం. తొర్రివేముల గ్రామ పొలం సర్వే నెంబరు 679–2బిలో నాకు ప్రభుత్వం మూడు ఎకరాల వ్యవసాయ భూమి పట్టాగా మంజూరు చేసింది. ఆ భూమిని వ్యవసాయానికి యోగ్యంగా చదువును చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా తలమంచిపట్నం చెరువు నుంచి 500 ట్రిప్పుల మట్టి అవసరమవుతుంది. అధికారులు చెరువుమట్టిని ఉచితంగా నా భూమికి తోలించాలి. కంపచెట్లు తొలగించేందుకు ఆర్థికంగా చేయూతనివ్వాలి.

500 ఎకరాల భూమి అంతా ఆక్రమణలే!
నా పేరు బి.వెంకట సుబ్బారెడ్డి. బద్వేలు పరిధిలోని భాకరాపేట మా ఊరు. 1914లో సుమారు 547 ఎకరాల భూమి మా అబ్బబ్బ గారి పేరుమీద రిజిష్టర్లు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956లో చాలా భూమిని డీకేటీగా మార్చారు. తర్వాత అంతో ఇంతో మిగిలిందంతా కూడా ఆక్రమణలు అయిపోయింది. నా భూమి సర్వే చేయించాలని సీఎం చంద్రబాబుతోసహా కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నా. 2000 నుంచి ఇప్పటివరకు నా పోరాటం ఆగలేదు. కనీసం ఒక ఎకరా అయినా చూపించాలని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు..
మా పేర్లు వై.లక్ష్మి దేవి, సి.సునీత. మాది చెన్నూరు. మా అమ్మ పద్మావతి రుద్రభారతి పేటలో 1.14 సెంట్ల భూమిలో కూతుర్లు అయిన మా ఇద్దరికీ ఎకరా...మరో 14 సెంట్లు కుమారుడికి ఇచ్చింది. అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ పేపర్లు ఉన్నాయి. పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో చేర్చాలని ఎన్నిమార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement