Pension troubles
-
ట్విటర్ దీపం
సమస్యలను పరిష్కరించడం, తోటివారికి సాయం చేసే గుణం ఉంటే అధికారం, పదవులు, డబ్బులు లేకపోయినప్పటికీ ట్వీట్స్‌తో సామాజిక సేవ చేయవచ్చని నిరూపించి చూపిస్తోంది ఒడిషా ట్విటర్ క్వీన్ దీపా బారీక్. ఒడిషాలోని బర్గఢ్ జిల్లా టెమ్రీ గ్రామానికి చెందిన దీపా బారీక్ తండ్రి వ్యవసాయదారు. తల్లి అంగన్వాడి వర్కర్. మూడేళ్ల క్రితం దీపకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా వాడాలో తెలుసుకునేందుకు పక్కింట్లో ఉంటోన్న సామాజిక కార్యకర్త దిబాస్ కుమార్ సాహుని కలిసింది. అతను స్మార్ట్ ఫోన్ వాడకం గురించి వివరిస్తూ వివిధ రకాల సోషల్ మీడియా యాప్‌లు దీప ఫోన్లో వేశాడు. వీటితోపాటు ట్విటర్ యాప్ వేస్తూ ‘‘నువ్వు చేసే ట్వీట్‌ను తప్పనిసరిగా ఫలానా వ్యక్తులు చూడాలనుకుంటే వారి అకౌంట్‌ను ట్యాగ్ చేసి పోస్టుచేస్తే వారికి నేరుగా చేరుతుంది’’ అని చెప్పాడు. దిబాస్ చెప్పిన ఈ విషయమే దీపను ఒడిషా ట్విటర్ క్వీన్‌గా మార్చింది. సౌకీలాల్‌తో తొలిసారి.. అది 2019 ఒడిషాలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి గ్రామాల్లో ఇళ్లు కొట్టుకు పోవడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. టెమ్రీ గ్రామానికి పక్కనే ఉన్న మరో గ్రామంలో ఇల్లు కొట్టుకుపోవడంతో పేద దంపతులు ఉండడానికి వసతి లేక ఇబ్బందులు పడుతుండడం కనిపించింది దీపకు. అది చూసి చలించిపోయి సౌకీలాల్ దంపతుల సమస్యను వివరిస్తూ.. ఒడిషా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఐదుగురు ఉన్నత స్థాయి అధికారులతోపాటు సోషల్ మీడియా గ్రీవెన్స్ సెల్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్ చేసిన 48 గంటల్లోనే గ్రామాభివృద్ధి అధికారి గ్రామాన్ని సందర్శించి, సౌకీలాల్ ఇల్లు కట్టుకునేందుకు రూ.98 వేల రూపాయలను ఇచ్చారు. ఈ సంఘటన దీపకు ముందుకు సాగడానికి ఉత్సాహాన్ని ఇవ్వడంతో..తరువాత మగదిక్కులేని వితంతువులకు పెన్షన్ కష్టాలు, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న వారి సమస్యలను రాష్ట్ర ఆశీర్వాద్ యోజన అధికారులకు చేర్చి వితంతువుల సమస్యను పరిష్కరించింది. వికలాంగులకు ప్రభుత్వం అందించే సదుపాయాలన్నింటిని వారి చెంతకు చేర్చడం, బిలాస్పూర్ గ్రామంలో డ్యామ్ మరమ్మతుల కారణంగా పంటపొలాలకు నీళ్లు అందకపోవడంతో.. ఆ సమస్యను నీటిపారుదల అధికారులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడంతో రైతులు పంటలు పండించేందుకు నీరు అందింది. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా దీప ఐదు వేలమందికి పైగా సాయం చేయడం విశేషం. దేశంలో ఎక్కడున్నా... నేనున్నానంటూ... వివిధ సమస్యల పరిష్కారానికి దీప ట్వీటర్ సాయంతో చేస్తున్న కృషి స్థానికంగా చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఎవరికి ఏ సమస్య ఉన్నా దీపను కలిసి వివరించడం, ట్విటర్ వేదికగా దీప ఆ సమస్యను సంబంధిత అధికారుల ముందు ఉంచడం, వారు దానిని పరిష్కరించడం చకచక జరిగిపోతున్నాయి. సొంతరాష్ట్రంలో ఇబ్బంది పడుతోన్న వారికేగాక, బతుకుదెరువుకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారికి సైతం దీప సాయం చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఒడిషాకు చెందిన 23 మంది తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ ఇటుకల తయారీ బట్టీలో పనిచేయడానికి చేరారు. బట్టీ యజమాని ఆహారం, నీరు ఇవ్వకుండా, ఎక్కువ గంటలు పనిచేయమంటూ హింసించేవాడు. రోజులు గడిచేకొద్ది వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అది తట్టుకోలేక అక్కడినుంచి ఎలా బయటపడాలా? అనుకుంటోన్న సమయంలో వారిలో ఒకతనికి దీప గురించి తెలియడంతో.. వెంటనే ఈ సమస్య గురించి దీపకు చెప్పారు. వెంటనే ఆమె తెలంగాణ పోలీసులకు ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి 23 మంది కూలీలను రక్షించి సొంతరాష్ట్రానికి పంపించారు. ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తోన్న వెయ్యిమంది ఒడిషా కూలీలకి సాయం చేసింది. సమస్యలను వెతుక్కుంటూ.. అడిగిన వారికేగాక, చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం, దినపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రజాసమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా అధికారులకు చేరవేయడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తోంది దీప. ప్రస్తుతం సైన్స్‌లో పీజీ చేస్తున్న దీప భవిష్యత్‌లో ప్రొఫెసర్ కావాలనుకుంటోంది. ‘‘ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నా లాంటి వారినెందరినో తయారు చేయవచ్చు. ఇలాంటివాళ్లు సమాజంలో మరెంతోమందికి సాయం చేస్తారు’’ అంటూ భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం విశేషం. తన ద్వారా సాయం అందిన వారితో దీప. -
కదిలిస్తే కన్నీరు..!!
కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద పడుకుని..లేవలేక ఇబ్బంది పడుతున్న ఈమె పేరు చెప్పలి సుబ్బమ్మ. దాదాపు 80 ఏళ్ల వయస్సు. చెన్నూరు గ్రామం. ఏళ్ల తరబడి అక్కడి రెవెన్యూ కార్యాలయంలో స్వీపర్‌గా నెలకు రూ. 500 జీతంతో కాలం వెల్లదీస్తోంది.దాదాపు నాలుగైదు నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకపోవడంతో అధికారులను కలవాలని వచ్చింది. భర్త పెద్ద యల్లయ్య, కుమారులు రామసుబ్బయ్య, చిన్న యల్లయ్యలు నాలుగేళ్ల క్రితం చనిపోయారు. ఎన్నిమార్లు చెన్నూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే వారు లేక పెద్ద సార్‌ను కలవాలని వచ్చింది. కలెక్టర్ సారూ లేరని తెలిసి..పాదరక్షలు కూడా లేని వృద్ధురాలు. బయటికి నడవలేక అక్కడే మెట్లపైనే కూర్చుంది. కడపకు ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమానికి ఎందరో ఇలాంటి సమస్యలతోనే వస్తున్నారు. కనీసం ఇలాంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి వెంటనే పరిష్కారానికి చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. – సాక్షి, కడప 50 సార్లు తిరిగా.. నా పేరు అంకాలమ్మ. మాది రాజంపేట సమీపంలోని బోయనపల్లె. నా బిడ్డ అంజిని ఎత్తుకుని ప్రతిసారి ఇక్కడికి వస్తున్నా. రానుపోను ఛార్జీలు రూ. 80 అవుతున్నాయి. గుడిసెల్లో ఉంటున్నాం. ఇల్లు కావాలని ఎన్నిమార్లు మొరపెట్టుకుంటున్నా మా బాధ వినే వారు లేరు. పప్పులు, ఎర్రగడ్డలు, ఇనుప, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుని ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికి కడపలోని కలెక్టర్ దగ్గరకు మూడుసార్లు వచ్చినా ఇంతవరకు ఇంటికి సంబంధించి ఏమీ చెప్పలేదు. ఎప్పుడు కలిసినా ఇస్తామంటున్నారు. కానీ ఇవ్వలేదు. రాజంపేట తహసీల్దార్ ఆఫీసుకు 50 సార్లకు పైగా పోయి బాధ చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పింఛన్ ఇప్పించండి మహాప్రభో... నా పేరు ఇమాంబీ. మాది రాయచోటి మాసాపేట. నాకు 70 ఏళ్లు. నేనొక్కదాన్ని రాలేక మా బంధువుల పాప హసీనాను వెంట బెట్టుకుని వచ్చాను. ఇటీవలె కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఫించన్ కోసం తిరుగుతూనే ఉన్నా. ఎప్పుడిస్తారో తెలియదుగానీ అవస్థలు మాత్రం పడుతూనే ఉన్నాం. పలుమార్లు ఎమ్మార్వో ఆఫీసులో ఇచ్చాం. ఇక్కడ కూడా ఇద్దామని కలెక్టరేట్‌కు ఇచ్చా. మామిడి చెట్లు ఎండిపోతున్నాయి... నాపేరు రామచంద్రయ్య. మాది చిట్వేల్ మండలం కేసీ ఆగ్రహారం. నాకు 4.99 ఎకరాల పొలం ఉంది. నాకు ఎస్సీ కార్పోరేషన్ తరుపును ప్రభుత్వం బోరు మోటారు మంజూరు చేసింది. కానీ అధికారులు వచ్చి సర్వే చేసి పక్క పొలంలో ఉన్న బోరుకు మీ బోరుకు తక్కువ దూరం ఉందని వెళ్లిపోయారు. దీంతో నా పంట పొలంలోని మామిడిచెట్లు ఎండిపోతున్నాయి. సంబంధిత విషయం గురించి అధికారుల దృష్టికి తెచ్చేందుకు వచ్చాను. సబ్సిడీ మంజూరు కాలేదని రుణానికి కొర్రీ.. నా పేరు ఎం. నరసింహులు. నాది రామాపురం మండలం. నేను జీవనాధారం కోసం అంగడి ఏర్పాటు చేసుకోవడానికి స్టేట్ బ్యాంకులో లక్ష రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాను. బీసీ కార్పొరేషన్ నుంచి సగం సబ్సిడీ వస్తుంది. మార్చి 29వ తేది బీసీ కార్పొరేషన్ అధికారులు సబ్సిడీ మొత్తాన్ని స్టేట్ బ్యాంకుకు పంపించారు. ఈ మేరకు నాకు సమాచారం వచ్చింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం సబ్సిడీ మొత్తం తమకు అందలేదని రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఇక్కడికి వచ్చాను. పెన్షన్ మంజూరు చేయాలి.. నాపేరు విజయలక్ష్మి. నాది సీకే దిన్నె మండలం. నా భర్త సంవత్సరం క్రితం మరణించాడు. నాకు ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారు. నేను కూలీనాలీ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. కుటుంబ యజమాని మరణించినప్పటికీ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఆర్థిక సహాయం రాలేదు. మాకు ఇంటి స్థలం కూడా లేదు. ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేస్తే మా కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటుంది. నా స్థలం అమ్ముకున్నారు.. నాపేరు రామక్రిష్ణయ్య. మాది మాధవరం మండలం ఉప్పరపల్లె గ్రామం. నాకు ప్రభుత్వం 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చింది. దానిని వేరే వాళ్లు అమ్ముకున్నారు. దానిని గురించి అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాను. అడంగల్‌లో పేరున్నా అడ్డుకుంటున్నారు.. నాపేరు సి. ఈశ్వరయ్య. బి.మఠం మండలంలోని నరసన్నపల్లెలో 189 సర్వే నెంబర్లలో నాకు 17 సెంట్ల స్థలముంది. అందుకు సంబం ధించి నా పేరు మీద అడంగల్ కూడా అయితే, అక్కడ సర్వే జరగకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. 10 నుంచి 15 సార్లు ఇక్కడికి వచ్చాను. అయితే అధికారులు విచారణ చేయడం లేదు. ఎన్నిసార్లు తిరగాలి.. నా పేరు సిట్టేలుగాళ్ల గంగమ్మ. మాది మైదుకూరు మండల పరిధిలోని నంద్యాలంపేట పంచాయతీలోని కొత్త విపురాపురం. ప్రభుత్వం నాకు, నా చెల్లెలుకు మూడు ఎకరాల భూమిలో బోరు వేశారు. కానీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత ట్రాన్స్‌కో, ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వలేదు. ఇప్పటికి కలెక్టర్‌కు చెప్పడానికి పదిసార్లు వచ్చాను. భూమి కొనుగోలు చేసి అందించాలి... నా పేరు ఓబయ్య. నాది దువ్వూరు. మా మండలంలోని గొల్లపల్లెలో భూమి ఎస్సీలకు కేటాయించారు. అధికారికంగా కేటాయించాల్సి ఉంది. అందుకు అధికారులు ఈరోజు, రేపు వచ్చి పరిశీలిస్తామంటున్నారు. ఇంతవరకు రాలేదు. హద్దుల వద్ద జెండాలు కూడా నాటారు. కానీ ఇంతవరకు అధికారులు వచ్చి పరిశీలించకపోవడంతో ఎప్పుడు భూమి ఇస్తారో తెలియడం లేదు. సీఎం సహాయ నిధి ఇచ్చి ఆదుకోండి... నాపేరు ప్రకాశం. మాది కమలాపురం మండలం పైడికాల్వ గ్రామం. నేను ఇటీవలే తిరుపతిలోని స్విమ్స్‌లో ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయించుకున్నారు. దానికి అయిన ఖర్చుల గురించి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. సంబంధిత విషయం గురించి అ«ధికారులను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రజావాణికి వచ్చి అర్జీ ఇచ్చాను. సిమెంట్ ఇవ్వకపోవడం ఏమిటి... నాపేరు పెంచలయ్య. మాది రాజంపేట మండలం పోలీ పంచాయతీ చిండ్రిగాయపల్లె గ్రామం. నాకు ప్రభుత్వ ఎన్టీఆర్ గృహ పథకం కింద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. ప్రస్తుతం ఇంటికి స్లాబ్‌ను వేసుకునేందుకు 35 బస్తాల సిమెంట్‌ను మంజూరు అయ్యింది. సంబంధిత సిమెంట్‌ను గోడౌన్ ఇన్చార్జు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. స్లాబ్ నిలిచిపోయింది. ఇలా చాలామందికి సిమెంట్ ఇవ్వడం లేదు. పరిహారం ఎంత ఇస్తారో చెప్పడం లేదు.. నాపేరు వెంకటరమణారెడ్డి, వేంపల్లి మండలం ఆలిరెడ్డిపల్లె ఎంపీటీసీని. మాగ్రామ పొలాల్లో నుంచి కడప నుంచి బెంగుళూరుకి వెళ్లే రైల్వేట్రాక్ మంజూరైంది. కానీ మా పొలాలకు రైల్వేశాఖ ఎంతనష్టçపరిహారం ఇస్తుందో అర్థం కావడం లేదు. సర్వే కోసం వచ్చిన అధికారులు కూడా చెప్పడం లేదు. మా పంట పొలాలు మూడు కార్లు పండుతాయి. దీంతోపాటు మార్కెట్ విలువ కూడా ఎక్కువగా ఉంది. మరి రైల్వేశాఖ వారు నష్టపరిహారం కింద ఎంత డబ్బులిస్తారో అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వచ్చా. భూమి అభివృద్ధికి చేయూత ఇవ్వండి.. నాపేరు పెద్ద సుంకన్న. నాది మైలవరం మండలం. తొర్రివేముల గ్రామ పొలం సర్వే నెంబరు 679–2బిలో నాకు ప్రభుత్వం మూడు ఎకరాల వ్యవసాయ భూమి పట్టాగా మంజూరు చేసింది. ఆ భూమిని వ్యవసాయానికి యోగ్యంగా చదువును చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా తలమంచిపట్నం చెరువు నుంచి 500 ట్రిప్పుల మట్టి అవసరమవుతుంది. అధికారులు చెరువుమట్టిని ఉచితంగా నా భూమికి తోలించాలి. కంపచెట్లు తొలగించేందుకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. 500 ఎకరాల భూమి అంతా ఆక్రమణలే! నా పేరు బి.వెంకట సుబ్బారెడ్డి. బద్వేలు పరిధిలోని భాకరాపేట మా ఊరు. 1914లో సుమారు 547 ఎకరాల భూమి మా అబ్బబ్బ గారి పేరుమీద రిజిష్టర్లు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956లో చాలా భూమిని డీకేటీగా మార్చారు. తర్వాత అంతో ఇంతో మిగిలిందంతా కూడా ఆక్రమణలు అయిపోయింది. నా భూమి సర్వే చేయించాలని సీఎం చంద్రబాబుతోసహా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. 2000 నుంచి ఇప్పటివరకు నా పోరాటం ఆగలేదు. కనీసం ఒక ఎకరా అయినా చూపించాలని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో కనిపించడం లేదు.. మా పేర్లు వై.లక్ష్మి దేవి, సి.సునీత. మాది చెన్నూరు. మా అమ్మ పద్మావతి రుద్రభారతి పేటలో 1.14 సెంట్ల భూమిలో కూతుర్లు అయిన మా ఇద్దరికీ ఎకరా...మరో 14 సెంట్లు కుమారుడికి ఇచ్చింది. అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి. పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో చేర్చాలని ఎన్నిమార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. -
వయో భారం...పింఛన్ దూరం
వీరఘట్టం, న్యూస్‌లైన్: పండుటాకులకు పింఛను కష్టాలు ప్రతినెలా వేధిస్తున్నాయి. సామాజిక భద్రత అంటూ ప్రభుత్వం బొటనవేలి పరీక్ష పెట్టి పండుటాకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వయస్సు మీద పడి వంట్లో సత్తువ పోయి లేని వృద్ధులకు స్మార్ట్‌కార్డు విధానం అమలు చేయడం వల్ల ప్రతినెలా వచ్చే రూ.200 పింఛను కూడా రాకుండాపోతోంది. జీవిత చరమాంక దశలో శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధులు ప్రభుత్వం పెట్టిన విషమ పరీక్షలతో పస్తులుంటున్నారు. పింఛను కోసం నిత్యం పోస్టాఫీస్‌లు, మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో పింఛనుదారుల అవస్థలు వర్ణనాతీతం. పింఛను రాక, ఆసరా లేక కాలం వెల్లదీస్తున్నారు. సుమారు మొత్తం 2.90 లక్షలు మంది వృద్దాప్య, వికలాంగ, వితంతు పింఛను దారులున్నారు. వీరిలో వేలిముద్రలు సరిపోవడం లేదని దాదాపు 15 వేల మందికి ప్రభుత్వం పింఛను నిలిపివేసింది. ఏం జరిగిందో, పింఛను ఎందుకు రావడం లేదో తెలియక వృద్ధులు స్థానిక మండల కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఆపసోపాలు పడుతున్నారు. వీరిపై కనీసం దయగల వారు కరువయ్యారు. పింఛను పంపిణీలో అడ్డుకట్టలు వేసేందుకంటూ స్మార్ట్‌కార్డు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తె చ్చింది. పింఛనుదారుల బొటనవేలి ముద్రలు సేకరించి నమోదు చేశారు. ప్రతి నెలా పింఛనుదారుల బొటనవేలి ముద్రలను స్మార్ట్‌కార్డు తెరమీద తెలుసుకొని పాత వాటితో సరిపోతేనే ఆ నెల పింఛను ఇస్తారు. ఇలా నమోదు చేసిన వేలిముద్రలు మూడు నెలల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిపోతున్నాయి. ఆ తర్వాత నెల నుంచే అసలు సమస్యలు మొదలవుతున్నాయి. వృద్దుల్లో రక్తం లేక, నరాల బలహీనత వస్తుంది. సత్తువ లేకపోవడం, వణుకుతూ బలహీనంగా వేలు అద్దుతుండడంతో స్మార్ట్‌కార్డు మిషను వారి వేలిముద్రలను గుర్తించలేకపోతుంది. దీంతో వేలిముద్రలు సరిపోవడం లేదంటూ అధికారులు ఏకంగా పింఛన్లు నిలిపివేస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో జిల్లాలో దాదాపు 15 వేల మంది వృద్ధులకు పింఛన్లు నిలిపివేసినట్టు నివేధికలు చెబుతున్నాయి. ఇప్పటికైనా వృద్ధులకు వేలిముద్రల కష్టాలు తొలగించి సకాలంలో పింఛన్లు అందేలా చూడాలని పలువురు అధికారులను కోరుతున్నారు. వేలి ముద్రల కష్టాలను తొలగిస్తాం వృద్దాప్య పింఛన్లలో వేలిముద్రలు సరిపోకపోతే ఆ వ్యక్తి సరైన వ్యక్తా కాదానని నిర్ధారిస్తాం. సరైన వ్యక్తి అయితే ఆ వ్యక్తికే నేరుగా పింఛను ఇవ్వాలని మండల కో-ఆర్డినేటర్లకు సూచించినట్టు డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అలాగే మంచం దిగలేని, వేలిముద్రలు పడలేని కుష్టురోగుల బంధువుల వస్తే వారి దగ్గర నుంచి అగ్రిమెంట్ ఇస్తే పింఛను పంపిణీ చేయాలని కో-ఆర్డినేటర్లకు ఆదేశించామని ఆమె తెలిపారు.