వయో భారం...పింఛన్ దూరం
వీరఘట్టం, న్యూస్‌లైన్: పండుటాకులకు పింఛను కష్టాలు ప్రతినెలా వేధిస్తున్నాయి. సామాజిక భద్రత అంటూ ప్రభుత్వం బొటనవేలి పరీక్ష పెట్టి పండుటాకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వయస్సు మీద పడి వంట్లో సత్తువ పోయి లేని వృద్ధులకు స్మార్ట్‌కార్డు విధానం అమలు చేయడం వల్ల ప్రతినెలా వచ్చే రూ.200 పింఛను కూడా రాకుండాపోతోంది. జీవిత చరమాంక దశలో శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధులు ప్రభుత్వం పెట్టిన విషమ పరీక్షలతో పస్తులుంటున్నారు. పింఛను కోసం నిత్యం పోస్టాఫీస్‌లు, మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు.
జిల్లాలో పింఛనుదారుల అవస్థలు వర్ణనాతీతం. పింఛను రాక, ఆసరా లేక కాలం వెల్లదీస్తున్నారు. సుమారు మొత్తం 2.90 లక్షలు మంది వృద్దాప్య, వికలాంగ, వితంతు పింఛను దారులున్నారు. వీరిలో వేలిముద్రలు సరిపోవడం లేదని దాదాపు 15 వేల మందికి ప్రభుత్వం పింఛను నిలిపివేసింది. ఏం జరిగిందో, పింఛను ఎందుకు రావడం లేదో తెలియక వృద్ధులు స్థానిక మండల కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఆపసోపాలు పడుతున్నారు. వీరిపై కనీసం దయగల వారు కరువయ్యారు. పింఛను పంపిణీలో అడ్డుకట్టలు వేసేందుకంటూ స్మార్ట్‌కార్డు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తె చ్చింది.
పింఛనుదారుల బొటనవేలి ముద్రలు సేకరించి నమోదు చేశారు. ప్రతి నెలా పింఛనుదారుల బొటనవేలి ముద్రలను స్మార్ట్‌కార్డు తెరమీద తెలుసుకొని పాత వాటితో సరిపోతేనే ఆ నెల పింఛను ఇస్తారు. ఇలా నమోదు చేసిన వేలిముద్రలు మూడు నెలల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిపోతున్నాయి. ఆ తర్వాత నెల నుంచే అసలు సమస్యలు మొదలవుతున్నాయి. వృద్దుల్లో రక్తం లేక, నరాల బలహీనత వస్తుంది. సత్తువ లేకపోవడం, వణుకుతూ బలహీనంగా వేలు అద్దుతుండడంతో స్మార్ట్‌కార్డు మిషను వారి వేలిముద్రలను గుర్తించలేకపోతుంది. దీంతో వేలిముద్రలు సరిపోవడం లేదంటూ అధికారులు ఏకంగా పింఛన్లు నిలిపివేస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో జిల్లాలో దాదాపు 15 వేల మంది వృద్ధులకు పింఛన్లు నిలిపివేసినట్టు నివేధికలు చెబుతున్నాయి. ఇప్పటికైనా వృద్ధులకు వేలిముద్రల కష్టాలు తొలగించి సకాలంలో పింఛన్లు అందేలా చూడాలని పలువురు అధికారులను కోరుతున్నారు.
వేలి ముద్రల కష్టాలను తొలగిస్తాం
వృద్దాప్య పింఛన్లలో వేలిముద్రలు సరిపోకపోతే ఆ వ్యక్తి సరైన వ్యక్తా కాదానని నిర్ధారిస్తాం. సరైన వ్యక్తి అయితే ఆ వ్యక్తికే నేరుగా పింఛను ఇవ్వాలని మండల కో-ఆర్డినేటర్లకు సూచించినట్టు డీఆర్‌డీఏ పీడీ ఎస్.తనూజారాణి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అలాగే మంచం దిగలేని, వేలిముద్రలు పడలేని కుష్టురోగుల బంధువుల వస్తే వారి దగ్గర నుంచి అగ్రిమెంట్ ఇస్తే పింఛను పంపిణీ చేయాలని కో-ఆర్డినేటర్లకు ఆదేశించామని ఆమె తెలిపారు.