క్యాష్‌ కొట్టు.. ఫిట్‌నెస్‌ పట్టు | Irregularities In Revenue Office In Vizianagaram | Sakshi
Sakshi News home page

క్యాష్‌ కొట్టు.. ఫిట్‌నెస్‌ పట్టు

Published Mon, Sep 9 2019 8:36 AM | Last Updated on Mon, Sep 9 2019 8:36 AM

Irregularities In Revenue Office In Vizianagaram - Sakshi

రవాణా శాఖ కార్యాలయం

పారదర్శకపాలన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పరితపిస్తున్నారు. అవినీతిలేని సమాజాన్ని సృష్టించాలని తపన పడుతున్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజలకు నీతివంతమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ ఇంకా రవాణాశాఖ కార్యాలయంలో మాత్రం ఆ జాఢ్యం వీడటం లేదు. ఆఫీసులోకి రాకున్నా... ఏజెంట్లు బయటినుంచే దందా నడిపిస్తున్నారు. నేరుగా వాహన యజమానులు వెళ్తే జరగని 
పనులు దళారుల ద్వారా చిటికెలో అయిపోతున్నాయన్న ప్రచారం సాగుతోంది.

సాక్షి, విజయనగరం : జిల్లాకేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఇంకా దళారీలే చక్రం తిప్పుతున్నారు. ప్రతి పనికీ వారిని ఆశ్రయించి... ఎంతోకొంత సొమ్ము ముట్టజెబితే చిటికెలో పనులు జరిగిపోతున్నాయి. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ నుంచి లైసెన్సులు వంటివి జారీ చేయడానికి చేతులు తడిపితే చాలు పనులు జరిగిపోతున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆటో, ట్రాక్టర్, లారీ, బస్సు, గూడ్సు వాహనాలకు ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఫిట్‌ నెస్‌ సర్టిఫికెట్‌(సామర్థ్య ధ్రువీకరణ పత్రం) జారీ చేస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయానికి పూర్తి స్థాయి కండిషన్‌తో తీసుకుని వెళ్లాలి. సీట్లు, టైర్లు, పెయింటింగ్, ఇంజిన్‌ అన్నీ కండిషన్‌లో ఉండాలి.

రవాణా శాఖ కార్యాలయంలో వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ వాహనానికి ఫొటో తీసి పూర్తి స్థాయి కండిషన్‌ ఉన్నట్టు గుర్తిస్తే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలి. అయితే ఈ సర్టిఫికెట్‌ కావాల్సిన వాహనయజమానులు నేరుగా వెళితే అధికారులు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెంట్‌ ద్వారా వెళితే వాహనం కండిషన్‌ కాస్త అటు, ఇటుగా ఉన్నా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌  ఇచ్చేస్తున్నారు. వాహనం కండిషన్‌గా ఉన్నప్పటికీ నేరుగా వెళ్తే ఏదో ఒక వంక పెట్టి తిప్పి పంపుతున్నట్టు ఆరోపిస్తున్నారు. 

వాట్సాప్‌ ద్వారానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌
విజయనగరంలో డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ కార్యాలయం ఉంది. సాలూరు, పార్వతీపురంలో వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాలు ఉన్నాయి. కొంతమంది అధికారులు వాహనం కార్యాలయానికి తీసుకుని రాకపోయినా వాట్సాప్‌ ద్వారా గానీ, దళారీ ద్వారా గానీ పత్రాలు పంపిస్తే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్‌ జారీ చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు దళారులను లోపలికి రానివ్వడం లేదని చెబుతున్నా... వారు కార్యాలయం బయటినుంచే దందా కొనసాగిస్తున్నారు. ప్రతీ ఎజెంట్‌కు ఒక కోడ్‌ పెట్టుకుని వాహనయజమాని దరఖాస్తుపై ఆ కోడ్‌ వేసి అధికారుల దగ్గరకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెంట్ల కోడ్‌ చూసి వాహనయజమానులకు ఎల్‌ఎల్‌ఆర్, ఫిట్‌ నెస్‌ సర్టిఫికెట్‌ , డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరు, ఇద్దరు ఏజెంట్లు మాత్రం కార్యాలయంలో తిరుగుతూ తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు.

వసూళ్లలోనూ రెట్టింపే...
రవాణా శాఖ కార్యాలయంలో ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్‌ లైసెన్సు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ వంటి వాటికోసం ప్రభుత్వానికి చెల్లించే ఫీజుల కంటే ఏజెంట్లు రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఎందు కంత ఇవ్వాలని వాహనయజమాని అడిగితే అధికారులకు ఇచ్చుకోవాలి కదా అంటూ దర్జాగా చెబుతున్నారు. ఆటోకు, ట్రాక్టర్‌కు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.760లే. కాని ఏజెంట్లు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. స్కూలు బస్సులు, లారీలు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.960లు ఏజెంట్లు  రూ.4 వేల నుంచి రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నారు. టూవీలర్‌ ఎల్‌ఎల్‌ఆర్‌కు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.260లు అయితే ఏజెంట్లు రూ.600ల నుంచి రూ.800లు వసూలు చేస్తున్నారు. ఫోర్‌ వీలర్‌ ఎల్‌ఎల్‌ఆర్‌ ఫీజు రూ. 310లు కాగా వసూలు చేస్తున్నది రూ.500 నుంచి రూ.900లు. టూ వీలర్‌ లైసెన్సు ఫీజు రూ. 960లు కాగా రూ. 1600 నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఫోర్‌ వీలర్‌ లైసెన్సుకు రూ.1260లు ఫీజు కాగా రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు వసూలు చేస్తున్నారు.హెవీ లైసెన్సుకు ఫీజు రూ.1260లు కాగా రూ. 4 వేలు వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మూడు రవాణా శాఖ కార్యాలయాలకు ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం 150 మంది, డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం 100 మంది వరకు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల కోసం 100 మంది, ఇతర పనులు నిమత్తం 100 నుంచి 120 మంది వరకు వస్తారు.

దళారులను కట్టడి చేశాం
ఏజెంట్లను కార్యాలయంలోకి రానివ్వకుండా కట్టడి చేశాం. వాహన యజమానుల కోసం హెల్ప్‌ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఏ పనికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నామో కరపత్రాల ద్వారా తెలియజేస్తున్నాం.  కార్యాలయానికి వాహనం రాకుండా వాట్సాప్‌ ద్వారా పేపర్లు తెప్పించి ఎఫ్‌సీలు జారీ చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. 
– సీహెచ్‌.శ్రీదేవి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement