
అహ్మదాబాద్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ బహిరంగ సభలో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.ఈ సంఘటన గిర్ సోమ్‌నాథ్ జిల్లా ప్రాన్స్‌లీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మశ్రీ భాయ్ దోడియా అనే రైతు తన పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారని, దీన్ని తొలగించడంలో స్థానిక అధికారులు విఫలం చెందడంతో కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని గిర్ సోమ్‌నాథ్ ఎస్పీ రాహుల్ త్రిపాఠి వెల్లడించారు. ‘ఆ రైతు పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారు. ఆక్రమణను తొలగించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని తెలిపారు. దోడియాను వెంటనే వెరవల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.