తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంటనష్టం తద్వారా అప్పుల పాలైన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన రైతు నున్నా కృష్ణారావు (40) ఆత్మహత్య వార్త ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. సోంత గ్రామం నుంచి మంగళవారం ఉదయం సత్తుపలి వెళ్తున్నాని చెప్పి బయలుదేరిన కృష్ణారావు.. బుధవారం లంకపల్లి శివారులోని వైజంక్షన్ సమీపంలోని జామాయిల్‌తోటలో బుధవారం విగతజీవిగా కన్పించాడు.
మృతుడు.. తనకున్న ఎకరం పొలంతో పాటు మరో పదిఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. నాలుగు ఎకరాలలో వరి, మూడు ఎకరాలలో మిర్చి, మరో నాలుగు ఎకరాలలో చెరకు పంట సాగు చేశాడు. దిగుబడి సరిగా రాక ఈ ఏడాది పంటల్లో సుమారు రూ.5లక్షల నుంచి రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లింది. వారం పదిరోజుల నుంచి అప్పులు తీర్చటంపై మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అదీగాక పెళ్లికి ఎదిగిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితిపై మదన పడినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం వెళ్లిన కృష్ణారావు సత్తుపల్లిలోని కూతురు వద్దకు వెళ్లకపోవటంతో అనుమానం వచ్చిన బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలలో వెతుకులాట చేపట్టారు. వైజంక్షన్ సమీపంలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించటంతో కృష్ణారావు మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.