అప్పుల బాధతో కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం గోవిందిన్నె గ్రామానికి చెందిన వెంకట కొండయ్య(60) ఆత్మహత్యకు పాల్పడి ఆరు నెలలైనా ఇంతవరకు అధికారులెవరూ ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునే వెంకట కొండయ్య 18 ఎకరాల సొంత పొలంతో మరో 10 ఎకరాలు కౌలుకు సాగు చేసేవారు. ఇతనికి భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, తండ్రి చిన్న కొండయ్య(88) ఉన్నారు. ముగ్గురు కుమార్తెలతో పాటు పెద్ద కుమారుడు రమేష్‌కు వివాహం చేశారు. ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్ల కోసం కొన్ని అప్పులు చేశారు.
దీనికి తోడు నాలుగేళ్లుగా వరుసగా అనావృష్టి పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు, వడ్డీలు పేరుకుపోయాయి. నాలుగెకరాల వ్యవసాయ భూమిలో గత సంవత్సరం వరి పంట వేయగా భూగర్భ జలాలు అడుగంటి బోరు ఎండిపోవడంతో మళ్లీ అప్పులు చేసి బోరు వేయించారు. కొద్దిగా నీరు పడినప్పటికీ వరి పంటకు చాలలేదు. పూర్తిగా ఎండిపోయింది. ఈ సంవత్సరం మళ్లీ కరువొచ్చింది. సొంత పొలంలో వేసిన జొన్న, ఆముదం, ప్రొద్దుతిరుగుడు పంటలు కూడా ఎండిపోయాయి. పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం ప్రై వేట్ వ్యక్తుల వద్ద సుమారు రూ. 5 లక్షలు అప్పు చేశారు. అలాగే పలుకూరు ఆంధ్రా బ్యాంక్‌లో రూ. లక్ష, బనగానపల్లె ఎస్‌బిఐలో రూ. 40 వేలు పంట రుణం తీసుకున్నారు.
కానీ నాలుగేండ్లుగా ఎదురు చూస్తే ప్రభుత్వం నుంచి రుణ మాఫీ జరిగింది కేవలం రూ. 60 వేలు మాత్రమే. అది అప్పుపై వడ్డీకి కూడా సరిపోలేదు. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందని వెంకటకొండయ్య పలువురి వద్ద ఆవేదన వ్యక్తపరిచే వారు. ఆ పరిస్థితుల్లో వెంకట కొండయ్య పరిస్థితి దుర్భరంగా తయారైంది. అప్పులు తీర్చే మార్గం కానరాక 2018 ఆగస్టు 5న ఇంటికి సమీపంలోని పశువుల పాకలో తెల్లవారుజామున ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగి చనిపోయాడు. కుటుంబ పెద్దను కోల్పోయిన అతని కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment