(బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) :వ్యవసాయంలో మిత్రపురుగుల ప్రాధాన్యం తెలియనిది కాదు. పంటలకు మేలు చేసే ఈ కీటకాల జాబితాలోకి సాలీడును కూడా చేర్చాలని అంటున్నారు డాక్టర్ అతుల్ భోడ్కే. మహారాష్ట్రలోని లోనార్ క్రేటర్ అభయారణ్యంలో సరికొత్త సాలీడు జాతిని గుర్తించిన అతుల్.. దశాబ్దానికిపైగా వీటిపై పరిశోధనలు చేశారు. ప్రభుత్వాలు పులుల సంరక్షణ కోసం ఎంతో సొమ్ము ఖర్చు పెడుతున్నాయని, సాలీడులను సంరక్షించుకోవడం ద్వారా పులుల సంతతిని పెంచడమూ సాధ్యమని గుర్తించడం లేదని అతుల్ ‘సాక్షి’కి తెలిపారు. ప్యూరోరిథిడీ జాతి సాలీడును పదేళ్ల క్రితం తాను గుర్తించానని, అప్పటివరకూ దేశంలో 60 సాలీడు కుటుంబాలు ఉండగా, 61వ కుటుంబాన్ని చేర్చామని ఆయన వివరించారు.
జీవావరణాన్ని కాపాడేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయని చెప్పారు. ‘‘గడ్డిలో పెరిగే ప్యూరోరిథిడీ సాలీడు గడ్డిలో దొరుకుతుంది. ఇది హానికారక సూక్ష్మజీవులను తింటూ బతుకుతుంది. ఫలితంగా ఈ సాలీళ్లు ఉన్న చోట గడ్డి ఏపుగా పెరుగుతుంది’’అని అతుల్ వివరించారు. సాలీళ్లలో గూడు అల్లేవి ఒక రకమైతే.. నేలపై తిరుగుతుండేవి రెండో రకమని చెప్పారు. ఈ రెండు రకాల సాలీళ్లూ కీటకాలను నాశనం చేస్తాయని తెలిపారు. దురదృష్టవశాత్తూ ప్రభుత్వాలు సాలీళ్ల ప్రాముఖ్యతను గుర్తించడం లేదని వాపోయారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సాలీడులను కీటక వర్గీకరణకు మినహా మరే ఇతరాలకు వాడుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంలో కీటక నాశినుల వాడకం ఎక్కువ అవుతుండటంతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు అధికం అవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సాలీడులను సహజసిద్ధ కీటక నాశినులుగా ఉపయోగించడం ఎంతో ప్రయోజనకరమని స్పష్టం చేశారు.
సాలీడుల పెంపు ఇలా..
రైతులు పొలంలో కనిపించే ఏదైనా సాలీడును గుర్తించి వాటికి ‘డ్రోసఫిలా’అనే లార్వేను అం దిస్తే చాలని, అవి బాగా పెరుగుతాయని అతుల్ తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాలీడు అవసరాన్ని గుర్తించారని, వారి పొలాల్లో సాలీడు గూళ్లను తొలగించడం మానేశారని చెప్పారు. ఇళ్లల్లో దోమల నియంత్రణకూ సాలీళ్లు బాగా పనిచేస్తాయన్నా రు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని సాలీడులపై విస్తృత పరిశోధనలను చేపట్టాలని సూచించారు. తద్వారా కీటక నాశినుల వాడకం తగ్గడంతోపాటు ఆహారంలోకి చేరుతున్న విషతుల్యకాలుష్యాలను నివారించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment