rabi cultivated
-
‘మినుము’తో రైతుకు బలము
బాల్కొండ : సాధారణంగా రబీలో నవంబర్ మూడోవారం వరకే మినుములు సాగు చేస్తారు. మాగాణుల్లో అయితే డిసెంబర్ 15 వరకు ఈ పంట సాగు చేయవచ్చు. ఈసారి వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో పంటలసాగు ఆలస్యమైంది. దాని ప్రభావం రబీపైనా పడింది. దీంతో ప్రస్తుతం పలువురు రైతులు మినుముల సాగుకు సన్నద్ధమవుతున్నారు. విత్తన శుద్ధి పంట తొలి దశలో రసం పీల్చు పురుగులు, ఇతర తెగుళ్లు ఆశించే అవకాశముంది. విత్తనశుద్ధితో వీటిని నివారించవచ్చు. కిలో విత్తనాలకు 40 గ్రాముల కార్బోసల్ఫాన్, 2.5 గ్రాముల థైరమ్‌తో విత్తనశుద్ధి చేయాలి. మొదటిసారి ఈ పంట సాగు చేసే భూముల్లో.. 200 గ్రాముల రైజోబియం, పీఎస్బీ 200 గ్రాముల కల్చర్ ను కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల నత్రజని, భాస్వరం అవసరం 50 శాతం తగ్గుతుంది. విత్తనం ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు విత్తనం అవసరం. రైతులకు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందిస్తోంది. నేల తయారీ, విత్తేవిధానం తేమను నిలుపుకోగలిగే భూములు పంట సాగుకు అనుకూలం. ముందుగా భూమిని బాగా దుక్కిదున్ని, విత్తడానికి ముందు ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి గొర్రుకొట్టాలి. వరి మాగాణుల్లో అయితే ఎరువుల అవసరం ఉండదు. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య పది సెంటీ మీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. మాగాణుల్లో విత్తనాలను వెదజల్లినా సరిపోతుంది. నీటి తడులు ఒకటి రెండు నీటి తడులతో పంట చేతికి వస్తుంది. విత్తనాలు మొలిచిన తర్వాత 30 రోజుల దశలో మొదటిసారి, 55 రోజుల తర్వాత రెండోసారి నీరు అందించాలి. రెండున్నర నెలల్లో పంట చేతికి వస్తుంది. కలుపుంటే.. పంటను మొదటి 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. ఇందు కోసం 20 నుంచి 30 రోజుల దశలో గొర్రు లేదా దంతి ద్వారా అంతర కృషి చేయాలి. ఇలా చేయడం వల్ల కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలు పు బెడద ఎక్కువగా ఉంటే విత్తిన వెంటనే 24 గంటలలోపు ఎకరాకు 1.25 నుంచి 1.50 లీటర్ల పెండి మిథాలిన్ లేదా అలాక్లోర్ కలుపు మందు ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. చీడపీడల నివారణకు.. రెండాకుల దశ నుంచే పురుగులు ఆశించే అవకా శం ఉంటుంది. పచ్చ రబ్బరు పురుగు రెండాకుల దశ నుంచి ఆశిస్తుంది. ఆకుల మధ్యలో ఇది గూ డు అల్లుకుంటుంది. గూడులో ఉండి తొడిమెల దగ్గర నుంచి పత్రహరితాన్ని తింటుంది. దీంతో ఆకులు ఎండి, రాలి పోతాయి. లద్దె పురుగులు రాత్రి వేళల్లో ఆకులను తినడం వల్ల మోడుల్లా మారుతాయి. వీటి నివారణకు విషపు ఎరలను వాడాలి. 5 కిలోల తవుడు, కిలో బెల్లంలో లీటరు మోనోక్రొటోపాస్ లేదా కిలో కార్బారిల్ లేదా 250 గ్రాముల థయోడికార్ట్ నీటిలో కలిపి ఉండలుగా చేసి సాయంత్రం వేళలో పొలం అంతటా సమానంగా వేయాలి. ఇంకా ఇతర చీడపీడలు సోకితే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. -
అనగనగా శనగ..
ఒంగోలు టూటౌన్ : శనగ సాగును రైతులు దాదాపు పక్కన పెట్టేశారు. పంట వేసేందుకు ఏ రైతూ ధైర్యం చేయడం లేదు. వ్యవసాయ శాఖ విత్తనాలు సరఫరా చేస్తున్నా.. రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. కారణం.. మూడేళ్లుగా గిట్టుబాటు ధర దక్కక.. పండించిన శనగలన్నీ గోడౌన్లలో పేరుకుపోవడమే. దాదాపు 17.50 లక్షల క్వింటాళ్ల నిల్వలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పి.. 4 నెలలు కావస్తోంది. ఇంత వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో శనగ పంట అంటేనే రైతులు బెంబేలెత్తుతున్నారు. గతంలో రబీ సీజన్లో శనగ పంటను ఇబ్బడిముబ్బడిగా సాగు చేశారు. 2013-14 రబీలో కూడా 69,465 హెక్టార్లలో శనగ సాగయింది. ప్రస్తుత రబీ సీజన్లో 88,817 హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 2,349 హెక్టార్లకే పరిమితమైంది. అంటే మూడు శాతం మాత్రమే పంట సాగయింది. 62 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టగా.. 25 వేల క్వింటాళ్లు మాత్రమే పొజిషన్లో ఉంచారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 2,500 క్వింటాళ్ల శనగ విత్తనాలనే రైతులు రాయితీపై కొన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో వ్యవసాయశాఖ ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్నా శనగలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని వ్యవసాయ శాఖ జేడీ జే మురళీకృష్ణ తెలిపారు. రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారని జేడీఏ పేర్కొన్నారు. ఎక్కువగా యూకలిప్టస్, మిర్చి, మినుము, అలసంద, మొక్కజొన్న, జొన్న లాంటి పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు. జిల్లాలో పంటల సాగు 32 శాతం ‘జిల్లాలో ఇప్పటి వరకు మిరప 7,914 హెక్టార్లు, అలసంద 5,356 హెక్టార్లు, జొన్న 5,865 హెక్టార్లు, మొక్కజొన్న 2,145 హెక్టార్లలో సాగు చేశారు. వీటితో పాటు వరి 28,080 హెక్టార్లు, రాగి 42 హెక్టార్లు, వేరుశనగ 74 హెక్టార్లు, నువ్వులు 2,853 హెక్టార్లలో వేశారు. పత్తి రబీలో 1352 హెక్టార్లకు గాను 50 హెక్టార్లు, పొగాకు 36,983 హెక్టార్లలో సాగయింది. ఇంకా ఉల్లి, పసుపు, చెరకు, పెసర, చిరుధాన్యపు పంటలతో కలిపి మొత్తం ఇప్పటి వరకు 1,10,004 హెక్టార్లలో పంటలు వేశారు. రబీ సాగు సాధారణ విస్తీర్ణం 3,44,321 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 32 శాతం పంటలు వేశారని’ జేడీఏ వెల్లడించారు. ప్రస్తుత సీజన్లో పొద్దుతిరుగుడు విత్తనాలు 870 క్వింటాళ్లు, మొక్కజొన్న 1,648 క్వింటాళ్లు, జొన్న 500 క్వింటాళ్లు, ఆముదం 200 క్వింటాళ్లు, నువ్వుల విత్తనాలు 95 క్వింటాళ్లను రైతులకు అందుబాటులో ఉంచామని, ఇంకా రైతులకు రాయితీపై విత్తనాలు అందజేస్తామని స్పష్టం చేశారు. విత్తనాల ధరను బట్టి కిలోకు రూ.25 రాయితీ ఇస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో భూములు పదునెక్కాయని, సాగు విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని జేడీఏ తెలిపారు. -
ఆయకట్టులో ఆనందం
హాలియా, న్యూస్‌లైన్: నీటి విడుదల ప్రకటనతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వల నుంచి రబీ సాగుకు నీటిని వదిలేందుకు రాష్ట్ర భారీ, నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిన్నమొన్నటి దాకా నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. నిండా ముంచిన ఖరీఫ్ ఈ ఖరీఫ్ ఆయకట్టు రైతులను నిండా ముంచింది. ఓవైపు వరుస తుపాన్లు, మరోవైపు దోమకాటుతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 20 నుంచి 30 బస్తాల లోపే ధాన్యం దిగుబడి వచ్చింది. రైతులకు పెట్టుబడి కూడా వెళ్లలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వ కింద 4,31,300 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ మిగిల్చిన అప్పును తీర్చేందుకు సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న రైతులు వరిసాగుకు సమాయత్తమవుతున్నారు. 4.31 లక్షల ఎకరాలకే సాగునీరు ... సాగర్ ఎడమ కాల్వ కింద 10.33 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. అందులో నల్లగొండ జిల్లాలో 3,80,000, ఖమ్మం జిల్లా పరిధిలోని 2,77,000, కృష్ణాజిల్లాలో 3,75,000 ఎకరాల సాగుభూమి ఉంది. ఈ రబీలో ప్రభుత్వం మాత్రం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 4,31,000ఎకరాలకే సాగునీరు ఇచ్చేందుకు నిర్ణయించింది. 150 టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం : సీఈ ఎల్లారెడ్డి ఈ ఏడాది రబీలో వరి సాగుకు కుడి, ఎడమ కాల్వలతో పాటు డెల్టాకు 50 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేసేందుకు వీలున్నట్లు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నాగార్జునసాగర్ జలాశయంలో నీరుండడంతో పాటు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రబీలో వరిసాగుకు నీటి విడుదలకు నిర్ణయం తీసుకుంది. -
ధరాభారం తగ్గించరేం?
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. రైతుబజార్లలోనే ప్రతి కూరగాయా కిలో రూ.25పైగా పలుకుతుండడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరాభారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయమార్గాలు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన కూరగాయల పంటలు గత నెల 22 నుంచి 27 వరకు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. రబీలో సాగు చేసినవి ఇంకా మార్కెట్లోకి రాలేదు. అంతంతమాత్రం పండే కూరగాయలను సైతం రైతులు దూరప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. స్థానికంగా కొరత ఏర్పడడంతో ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ ఏడీ ఎం.వెంకటేశ్వరరెడ్డి దాదాపు మూడు నెలలుగా సెలవుల్లో ఉన్నారు. దీంతో వినియోగదారుల కష్టాలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఇలా చేయాలి..: ధరలు నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ వద్ద రివాల్వింగ్ ఫండ్ ఉంటుంది. వివిధ స్కీమ్‌లకు సంబంధించిన ఇంట్రెస్ట్ నిధులు ఉంటాయి. ఈ నిధులతో రైతుల నుంచి హోల్‌సేల్‌గా కూరగాయలు కొని నోలాస్, నో ప్రాఫిట్ కింద రైతుబజార్లలో అమ్మించవచ్చు. మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయవచ్చు. ఉద్యాన శాఖ సబ్సిడీపై కూరగాయల రైతులకు వెండింగ్ వ్యాన్లను ఇస్తోంది. రైతు తాము పండించిన కూరగాయలను రద్దీ ప్రదేశాలకు, కీలకమైన ప్రాంతాలు, అపార్ట్మెంట్ల వద్దకు తీసుకుని వెళ్లి అమ్మేలా చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మార్కెటింగ్‌శాఖ ఉన్నా లేనట్లుగా తయారైంది. కర్నూలులోని సి.క్యాంప్ రైతుబజార్‌కు ప్రతినెలా సగటున రూ.1.50 లక్షల ఆదాయం వస్తోంది. ఈ నిధులతో సంచార రైతుబజార్‌ను నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఈ దిశగా చర్యలు తీసుకునే అధికారి లేకపోవడంతో వినియోగదారులు ధరల భారాన్ని భరించాల్సి వస్తోంది. ఎప్పుడో ఒకసారి హడావుడి..: ధరల నియంత్రణ విషయంలో అప్పుడప్పుడు హడావుడి చేసే అధికారులు కొద్ది రోజులకే దాన్ని పక్కన బెడుతున్నారు. కొద్ది నెలల క్రితం కూరగాయల ధరలు పెరిగినప్పుడు జేసీ కన్నబాబు ఆదేశాల మేరకు రూ.99కే 9 రకాల కూరగాయలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉల్లిని హోల్‌సేల్ ధరకే అమ్మించే కార్యక్రమాన్ని మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టారు. అయితే ఇవన్నీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. మార్కెటింగ్‌శాఖ నోలాస్, నో ప్రాఫిట్ కింద నిరంతరం హోల్‌సేల్ ధరలకే కూరగాయలను సరఫరా చేసే అవకాశం ఉన్నా ఉలుకు, పలుకు లేకుండాపోయింది. దిగిరాని కూరగాయల ధరలు..: గత వారంతో పోలిస్తే కొన్ని కూరగాయల ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఏ కూరగాయా కిలో రూ.25 కంటే తక్కువకు లభించడం లేదు. రైతుబజార్లోనే టమాట కిలో రూ.26, వంకాయ రూ.30, కాకర రూ.28, బీర రూ.30, క్యాలీఫ్లవర్ రూ.36, క్యారెట్ రూ.30, క్యాబేజి రూ.25, బీన్స్ రూ.36, ఆలు రూ.28, చెవుల రూ.28, చిక్కుడు రూ.28, చామ రూ.40, కంద రూ.30 ప్రకారం విక్రయిస్తున్నారు. రైతుబజార్ బయట కిలో రూ.2 నుంచి రూ.6 వరకు, నగరంలో 10కి పైగా ధరలు అధికంగా ఉన్నాయి.