కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. రైతుబజార్లలోనే ప్రతి కూరగాయా కిలో రూ.25పైగా పలుకుతుండడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరాభారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయమార్గాలు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన కూరగాయల పంటలు గత నెల 22 నుంచి 27 వరకు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి.
రబీలో సాగు చేసినవి ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. అంతంతమాత్రం పండే కూరగాయలను సైతం రైతులు దూరప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. స్థానికంగా కొరత ఏర్పడడంతో ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ ఏడీ ఎం.వెంకటేశ్వరరెడ్డి దాదాపు మూడు నెలలుగా సెలవుల్లో ఉన్నారు. దీంతో వినియోగదారుల కష్టాలను పట్టించుకునే వారే లేకుండాపోయారు.
ఇలా చేయాలి..: ధరలు నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ వద్ద రివాల్వింగ్ ఫండ్ ఉంటుంది. వివిధ స్కీమ్‌లకు సంబంధించిన ఇంట్రెస్ట్ నిధులు ఉంటాయి. ఈ నిధులతో రైతుల నుంచి హోల్‌సేల్‌గా కూరగాయలు కొని నోలాస్, నో ప్రాఫిట్ కింద రైతుబజార్లలో అమ్మించవచ్చు. మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయవచ్చు. ఉద్యాన శాఖ సబ్సిడీపై కూరగాయల రైతులకు వెండింగ్ వ్యాన్‌లను ఇస్తోంది. రైతు తాము పండించిన కూరగాయలను రద్దీ ప్రదేశాలకు, కీలకమైన ప్రాంతాలు, అపార్ట్‌మెంట్ల వద్దకు తీసుకుని వెళ్లి అమ్మేలా చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మార్కెటింగ్‌శాఖ ఉన్నా లేనట్లుగా తయారైంది.
కర్నూలులోని సి.క్యాంప్ రైతుబజార్‌కు ప్రతినెలా సగటున రూ.1.50 లక్షల ఆదాయం వస్తోంది. ఈ నిధులతో సంచార రైతుబజార్‌ను నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఈ దిశగా చర్యలు తీసుకునే అధికారి లేకపోవడంతో వినియోగదారులు ధరల భారాన్ని భరించాల్సి వస్తోంది.
ఎప్పుడో ఒకసారి హడావుడి..: ధరల నియంత్రణ విషయంలో అప్పుడప్పుడు హడావుడి చేసే అధికారులు కొద్ది రోజులకే దాన్ని పక్కన బెడుతున్నారు. కొద్ది నెలల క్రితం కూరగాయల ధరలు పెరిగినప్పుడు జేసీ కన్నబాబు ఆదేశాల మేరకు రూ.99కే 9 రకాల కూరగాయలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉల్లిని హోల్‌సేల్ ధరకే అమ్మించే కార్యక్రమాన్ని మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టారు. అయితే ఇవన్నీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. మార్కెటింగ్‌శాఖ నోలాస్, నో ప్రాఫిట్ కింద నిరంతరం హోల్‌సేల్ ధరలకే కూరగాయలను సరఫరా చేసే అవకాశం ఉన్నా ఉలుకు, పలుకు లేకుండాపోయింది.
దిగిరాని కూరగాయల ధరలు..: గత వారంతో పోలిస్తే కొన్ని కూరగాయల ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఏ కూరగాయా కిలో రూ.25 కంటే తక్కువకు లభించడం లేదు. రైతుబజార్‌లోనే టమాట కిలో రూ.26, వంకాయ రూ.30, కాకర రూ.28, బీర రూ.30, క్యాలీఫ్లవర్ రూ.36, క్యారెట్ రూ.30, క్యాబేజి రూ.25, బీన్స్ రూ.36, ఆలు రూ.28, చెవుల రూ.28, చిక్కుడు రూ.28, చామ రూ.40, కంద రూ.30 ప్రకారం విక్రయిస్తున్నారు. రైతుబజార్ బయట కిలో రూ.2 నుంచి రూ.6 వరకు, నగరంలో 10కి పైగా ధరలు అధికంగా ఉన్నాయి.
ధరాభారం తగ్గించరేం?
Published Mon, Nov 25 2013 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement