ఎనిమిది ఎకరాలలో చీనీచెట్లు, ఏడు ఎకరాలలో వేరుశనగ పంట సాగుచేసుకుంటున్నాడు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
సాక్షి, అనంతపురం : రామగిరి మండలం నసనకోట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నారాయణరెడ్డిని ఆర్థికంగా దెబ్బతీసే ధ్యేయంతో టీడీపీ నేతలు అక్రమ కేసులకు పాల్పడుతున్నారు. గ్రామస్తులు, బాధితుడి కథనం మేరకు... గ్రామ సమీపంలో చెరువును ఆనుకుని నారాయణరెడ్డికి 22 ఎకరాల పొలం ఉంది. ఎనిమిది ఎకరాలలో చీనీచెట్లు, ఏడు ఎకరాలలో వేరుశనగ పంట సాగుచేసుకుంటున్నాడు. ఇటీవలి కాలంలో బోర్లు ఎండిపోవడంతో పొలం సరిహద్దులో కొత్త బోరు వేశాడు. ఈ నీటితోనే చీనీ చెట్లను బతికించుకుంటున్నాడు. నారాయణరెడ్డిని ఆర్థికంగా దెబ్బతీయాలన్న దురుద్దేశంతో గ్రామ టీడీపీ సర్పంచ్ ఆధ్వర్యంలో నారాయణరెడ్డి వేసుకున్న బోరు చెరువు పరిధిలో ఉందని ఫిర్యాదు చేశారు.
ఆ మేరకు సర్వేయర్లతో కొలతలు వేయించి బోరు చెరువు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చీనీ చెట్లను బతికించుకునేందుకు బోరు వేసుకున్నానని, రెండు వర్షాలు పడి పాత బోర్లలో నీరు చేరితే చెరువు పరిధిలో ఉన్న బోరును తొలగిస్తానని నారాయణరెడ్డి చెప్పినా టీడీపీ నాయకులు ససేమిరా అన్నారు. దీంతో నారాయణరెడ్డికి టీడీపీ వారికి మాటా మాటా పెరిగింది. ఇదే అదనుగా తీసుకుని సర్పంచ్ వెంకటలక్ష్మి భర్త చండ్రాయుడు ‘నన్ను నారాయణరెడ్డి కులం పేరుతో దూషించాడని’ పోలీసులకు ఫిర్యాదు చేసి ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ’ కేసు నమోదు చేయించాడు.
ఈ ఫిర్యాదు మేరకు ధర్మవరం ఏఎస్పీ అభివషేక్‌మహంతి, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌లు నసనకోట గ్రామంలో పర్యటించి ఆ గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీనీ చెట్లు బతికించుకునేందుకు బోరు వేసుకుంటే అభ్యంతరం తెలపడమే కాకుండా ‘ఎస్సీ, ఎస్టీ’ కేసు పెట్టడం వెనక నారాయణరెడ్డిని ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్ర ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.