
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం రాష్ట్రంలోనే రికార్డు స్థాయి కొనుగోళ్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. వనపర్తి మార్కెట్‌కు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒక్కరోజే 40 వేల బస్తాల వేరుశనగ విక్రయానికి వచ్చింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి వచ్చే కొనుగోలుదారులు వనపర్తి ప్రాంత వేరుశనగ పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు.
నెల రోజుల నుంచి వనపర్తి మార్కెట్‌కు వేరుశనగ పోటెత్తుతోంది. కాగా, సోమవారం క్వింటా వేరుశనగకు రూ.5,220 ధర నమోదైందని మార్కెట్ కార్యదర్శి లక్ష్మయ్య తెలిపారు. రాత్రి పొద్దుపోయే వరకు కాంటాలు కొనసాగాయి. అయి తే, జనవరిలో క్వింటాకు అత్యధికంగా రూ.6,181 ధర పలికిందని.. ఇప్పుడు పడిపోతుండటంతో తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.