అనంతపురం: వేరుశనగ అత్యధికంగా సాగయ్యే అనంతపురం జిల్లాలో ఈ ఏడు గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో 7 లక్షల హెక్టార్లలో వేరు శనగను సాగు చేయాల్సి ఉండగా... ఇప్పటికి కేవలం 2.2 లక్షల హెక్టార్లలోనే రైతులు పంటను వేసినట్టు వ్యవసాయ శాఖ కమిషనరేట్ జేడీఏ లక్ష్మణ్‌రాజు శుక్రవారం ప్రకటించారు. అందులోనూ వర్షాభావంతో 80 వేల హెక్టార్లలో వేసిన పంట ఎండిపోయినట్టు తెలిపారు.
శుక్రవారం అనంతపురం వచ్చిన లక్ష్మణ్‌రాజు శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై చర్చించారు. కాగా, వర్షాలు కురిస్తే ఆగస్ట్ 15లోపు వేరు శనగను సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.