= ఈసారీ తుడిచిపెట్టుకుపోయిన వేరుశనగ
= పంట కోత ప్రయోగాల ద్వారా వెల్లడవుతున్న వాస్తవాలు
= ప్రయోజనం లేని రక్షకతడులు
= పెట్టుబడులూ గల్లంతే
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా రైతులు ఎప్పటిలాగే ఈ ఖరీఫ్‌లోనూ కోటి ఆశలతో వేరుశనగ పంట సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 15.22 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో పంట వేశారు. ఇందులో అత్యధికంగా జూన్‌లో 7.56 లక్షల ఎకరాల్లో సాగైంది. మిగతాది జూలై, ఆగస్టులో వేశారు. వర్షాభావం వల్ల జూన్‌లో వేసిన పంట పూర్తిగా ఎండిపోయింది. తర్వాత వేసిన పంటదీ దాదాపు ఇదే పరిస్థితి.
ప్రణాళిక, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రస్తుతం జూన్‌లో వేసిన వేరుశనగకు సంబంధించి పంటకోత ప్రయోగాలు చేపడుతున్నారు. 63 మండలాల పరిధిలో 756 ప్రయోగాల ద్వారా పంట దిగుబడులను లెక్కించాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే 40–45 ప్రయోగాలు పూర్తి చేశారు. ఎకరాకు కాస్త అటూ ఇటుగా 50 కిలోల దిగుబడి దక్కే పరిస్థితి ఉంది. అంటే ఒక బస్తా లేదా కొంచెం ఎక్కువ రావచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల ఆధారంగా కచ్చితమైన దిగుబడులను చెప్పలే కపోయినా.. జిల్లా అంతటా పంట పరిస్థితి దాదాపు ఒకేలా ఉండటంతో ఒక అంచనాకు రావచ్చని అధికారులు అంటున్నారు.
గ్రాముల్లోనే దిగుబడులు
ఇప్పటివరకు రాయదుర్గంలో రెండు పంటకోత ప్రయోగాలు జరిగాయి. ఒక దాంట్లో 520 గ్రాములు, మరొక ప్రయోగంలో కేవలం 50 గ్రాముల దిగుబడి వచ్చింది. 50 గ్రాములంటే ఎకరాకు 10 కిలోల దిగుబడి కూడా లభించదు. అలాగే కనగానపల్లి మండలం వేపకుంటలో 170 గ్రాములు, 130 గ్రాములు, నెమలివరంలో 170 గ్రాములు, 180 గ్రాములు, సోమందేపల్లి 710, గుమ్మఘట్ట కేవలం 50, పుట్లూరు 285, తనకల్లు 150 గ్రాములు, 140 గ్రాములు, చెన్నేకొత్తపల్లి మండలంలో ఒక ప్రయోగంలో కేవలం 10 గ్రాములు, రెండో ప్రయోగంలో 30 గ్రాములు వచ్చాయి. ఇక అత్యధికంగా ఎన్‌పీ కుంటలో 2.050 కిలోలు, కదిరి 1.300, నల్లమాడ 1.240, సోమందేపల్లి 1.590 కిలోలు వచ్చాయి. ఇక్కడ ఎకరాకు 70 నుంచి 150 కిలోల వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
రూ.1,200 కోట్ల నష్టం !
పంట దిగుబడులను పక్కనపెడితే పెట్టిన పెట్టుబడులు కూడా రైతులు దక్కించుకునే పరిస్థితి లేదు. ఎకరాకు రూ.18 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన జూన్‌లో వేసిన పంటకు సంబంధించి 7.56 లక్షల ఎకరాలకు గాను రూ.1,450 కోట్ల వరకు వెచ్చించారు. ప్రస్తుత దిగుబడులు, ధరను పరిగణనలోకి తీసుకుంటే రూ.250 కోట్ల వరకు రైతులకు దక్కే అవకాశముంది. ఇక అంతో ఇంతో పశువుల మేత లభిస్తుంది. ఎంతలేదన్నా రూ.1,200 కోట్ల వరకు రైతులకు నష్టం వాటిల్లనుందని అంచనా వేస్తున్నారు. పంట కోత ప్రయోగాలు పూర్తయితే ఈ లెక్కల్లో స్పష్టత వస్తుంది. జూలై, ఆగస్టులో వేసిన పంట పరిస్థితి కూడా ఇలాగే ఉండటంతో ఈ సారి జిల్లా రైతులు భారీ నష్టాలు మూటగట్టుకునే దుస్థితి ఏర్పడింది.
సర్వనాశనం
Published Sat, Oct 8 2016 11:53 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement