మళ్లీ ఎండుతున్న వేరుశనగ
→ రక్షకతడి కోసం రైతుల ఆరాటం
→ గోడౌన్లలోనే మగ్గుతున్న రెయిన్‌గన్లు
అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగ పంట ఎండుముఖం పడుతోంది. 15 రోజులుగా వరుణుడు మొహం చాటేయడంతో జిల్లా అంతటా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు మరోవైపు గాలులు కూడా జోరుగా వీస్తుండటంతో 5.90 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ పంటతో పాటు 1.10 లక్షల హెక్టార్లలో సాగైన కంది, ఆముదం, ప్రత్తి, మొక్కజొన్న, అలసంద, పెసర లాంటి మిగతా పంటలు కూడా వాడుముఖం పట్టాయి. వేరుశనగ ఎండిపోకుండా రక్షకతడులతో కాపాడుతామంటూ చెబుతున్న అధికారులు ఇప్పటివరకు ఆ దిశగా ఇప్పటివరకు కార్యాచరణకు దిగకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కీలకదశలో పంటలు
సాధారణంగా ఖరీఫ్ పంటలు ఆగస్టులో కీలకదశకు చేరుకుంటాయి. పూత, ఊడలు దిగడం, కాయ ఊరేదశలో ఉంటాయి. ఈ సమయంలో వేరుశనగ లాంటి పంటకు తప్పనిసరిగా నీటి తడులు అవసరం ఉంటుంది. కానీ... ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఎక్కడా ఒక్క వర్షం కూడా నమోదు కాలేదు. ఈ క్రమంలో చాలా మండలాల్లో వేరుశనగ వాడిపోగా మరికొన్ని చోట్ల ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇంకో వారం వర్షం పడకుండా ఇదే విధంగా కొనసాగితే పంటలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రెయిన్‌గన్లు వచ్చినా..
ఒక్క ఎకరా వేరుశనగ పంట ఎండిపోకుండా ఒకట్రెండు రక్షకతడులు (లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్) ఇచ్చి కాపాడుతామంటూ పాలక యంత్రాంగం ఘనంగా ప్రకటించినా కార్యాచరణకు దిగకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాకు 4,600 సెట్లు రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్‌యూనిట్లు, డీజిల్ ఇంజిన్లు, 1.30 లక్షల సంఖ్యలో హెచ్‌డీ పైపులు ఇందుకోసం కేటాయించగా ఇప్పటివరకు అందులో సగం వరకు జిల్లాకు చేరినట్లు ఏపీఎంఐపీ, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
అన్ని మండలాల్లోనూ వాటిని గోదాముల్లో నిల్వ చేశామంటున్నారు. కానీ... వేరుశనగ పంట ఎండుముఖం పట్టినా రెయిన్‌గన్లను గోదాముల నుంచి బయటకు తీయడం లేదు. రక్షకతడులు కోసం జిల్లా వ్యాప్తంగా 65 వేల మంది రైతులు తమ బోరు బావుల నుంచి పరిసర ప్రాంత పొలాలను నీళ్లు ఇచ్చేలా ఒప్పించామని చెబుతున్నారు. అలాగే పంట సంజీవిని కింద నిర్మించిన నీటికుంటల్లోకి నీళ్లు నింపి అక్కడి నుంచి నీటి తడులు ఇస్తామంటున్నారు. ప్రణాళికను ఆచరణలోకి పెట్టడంలో అధికారులు వెనుకాడుతున్నారు. రక్షకతడి ఇవాళ... రేపు అంటూ అధికారులు ఊరిస్తూ కాలయాపన చేస్తుండటంతో అంతలోగా వేరుశనగ పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది.