వైఎస్ హయంలోనే రైతుకు సంక్షేమం
గాలివీడు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే రైతుల సంక్షేమానికి విశేష కృషి చేయడం జరిగిందని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రామాలయంలో వైసీపీ నాయకుడు మలసాని సుబ్బారెడ్డి కుమార్తె ప్రవళ్లిక, మల్‌రెడ్డి విహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరిగిన అరవీడు గ్రామ బీసీ నాయకుడు బాలయ్య కుమారుడు మల్లికార్జున, మానస వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి వేరుశనగ పంట సాగు చేసి నష్టాలకు గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. 2015–16 సంవత్సరానికి సంబంధించి ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటలబీమా ఇంత వరకు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఈ ప్రాంత సాగు రైతులను ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో పలు దఫాలుగా చర్చించి కుడికాలువకు నీటిని విడుదల చేయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకుడు యదు భూషణ్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, వైకాపా నాయకులు ధనుంజయరెడ్డి, రమణారెడ్డి, బిసీ నాయకులు ఉమామహేశ్వర్‌నాయుడు, శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.