వేరుశనగ చెట్లను పీకుతున్న రైతు కృష్ణమందడి కుమారుడు ధనంజయ
– వర్షాభావంతో ఎండిన వేరుశనగ పంట
– గ్రాసమైనా మిగులుతుందని పక్వానికి రాకనే చెట్లు పీకివేస్తున్న రైతులు
తీవ్ర వర్షాభావంతో వేరుశనగ పంట చేజారిపోయింది. ప్రభుత్వం రెయిన్‌గన్ల ద్వారా తడులు ఇచ్చేశాం.. అంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసింది గానీ ప్రయోజనం శూన్యమే. రైతుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. కనీసం ఉన్న కాస్త చెట్టు పశుగ్రాసానికైనా దక్కితే చాలని రైతులు భావిస్తున్నారు. పూర్తిగా ఎండిపోయే దశలో ఉన్న వేరుశనగ చెట్లను పక్వానికి రాకుండానే పీకేసేందుకు సిద్ధమయ్యారు.
చిత్తూరు (అగ్రికల్చర్):
వేరుశనగ రైతు ఆశలు ఎండిపోయాయి. ఎకరం పంటను కూడా ఎండనివ్వమని ముఖ్యమంత్రి, మంత్రులు హంగామా చేశారు. హడావుడిగా పర్యటించారు. కానీ ఫలితం శూన్యం. పంట పూర్తిగా ఎండిపోయింది. ఈ ఖరీఫ్ సీజను ప్రారంభంలో వర్షాలు బాగా కురవడంతో వేరుశనగ పంటపై రైతులకు ఆశలు చిగురించాయి. జిల్లాలోని 1.21 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేశారు. గత 40 రోజులుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం పది రోజుల క్రితం రెయిన్ గన్ల ద్వారా ఎండిన వేరుశనగ పంటను తడులు ఇచ్చి కాపాడేస్తామంటూ హామీలు గుప్పించింది. జిల్లావ్యాప్తంగా రెయిన్ గన్ల ద్వారా పంటలకు చాలీచాలని తడులు ఇచ్చేసి, మొత్తం పంటను తడిపేశామంటూ ప్రకటించేసింది. మొదట ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించారు. తర్వాత నలుగురు మంత్రులు జిల్లాలో తిష్టవేసి వేరుశనగ పంటకు తడులు ఇవ్వడాన్ని పర్యవేక్షించారు. ఎకరాకు 4 ట్యాంకర్ల మేరకు మాత్రమే నీటిని సరఫరా చేసి తడులు ఇచ్చారు. ఈ చాలీచాలని తడులు ఏమాత్రం సరిపోలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కనీసం ఉన్నకాస్త చెట్లయినా పశుగ్రాసంకు దక్కితే చాలని భావించి పంట మధ్య దశలోనే పీకేస్తున్నారు.
బంగారుపాళ్యం మండలం బేరుపల్లికి చెందిన రైతు కృష్ణమందడికి 2 ఎకరాల మామిడి తోటలో అంతర పంటగా వేరుశనగ పంట సాగు చేశాడు. 40 రోజులుగా నెలకొన్న తీవ్ర వర్షాభావంతో పంట ఎండిపోయింది. పంట ఎండుముఖం పట్టిన సమయంలోనే రెయిన్‌గన్లతో తడులు అందించాలని అధికారులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. ఎండిన చెట్లను పశుగ్రాసానికైనా ఉపయోగపడుతుందని ఆయన భావించాడు. గురువారం ఆయన కుమారుడు ధనంజయ, భార్య నవనీతమ్మ పంటకు బిందెలతో నీళ్లు పోసి తడిపి పంట పక్వానికి రాకనే చెట్లు పీకేశారు.
తీవ్రంగా నష్టపోయాం
వర్షాలు లేకపోవడంతో వేరుశనగ పంటలో తీవ్రంగా నష్టపోయాం. రెండెకరాల్లో వేరుశనగ పంట సాగుచేసేందుకు ఇప్పటికి రూ. 15 వేలు ఖర్చయింది. కనీసం పశువులకైనా తినేందుకు ఉపయోగపడుతుందని కాయలు కోసం ఎదురుచూడకుండా చెట్లు పెరుకుతున్నాం.
– నవనీతమ్మ , మహిళారైతు , బేరుపల్లి