సీఎం వైఎస్‌ జగన్‌: చిట్టి గింజలకు పెద్ద సాయం | YS Jagan Held Meeting with horticulture Officials Over Loans Based on Scale of Finance - Sakshi
Sakshi News home page

చిట్టి గింజలకు పెద్ద సాయం

Published Fri, Nov 1 2019 5:27 AM | Last Updated on Fri, Nov 1 2019 11:23 AM

YS Jaganmohan Reddy Review Meeting On Agriculture And Horticulture - Sakshi

సాక్షి, అమరావతి :  చిరు ధాన్యాలకు పెద్దపీట వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. చిరుధాన్యాల సాగును పెంపొందించేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పారు. చిరు ధాన్యాల పంటలకూ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు ఇవ్వాలని, సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలన్నారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ, ఉద్యాన శాఖలపై సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షా కేంద్రాలు, వర్క్‌షాపులు, నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు అందుబాటులో ఉండాలన్నారు. త్వరలో చిరుధాన్యాల బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. సేంద్రీయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చూడాలని సూచించారు.

విత్తనాలు ఉత్పత్తి చేసే రైతుల నుంచి ఏపీ సీడ్స్‌ నేరుగా కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. దీని వల్ల రైతులకు అధిక ఆదాయంతో పాటు, విత్తనాల ఉత్పత్తిలో నాణ్యతకు, స్వయం సమృద్ధికి ఊతం ఇచి్చనట్టవుతుందని చెప్పారు. రైతులకు వివిధ పంటలపై అవగాహన, సాగులో మెళకువల కోసం వైఎస్సార్‌ పొలం బడి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని పంటలను ఇ–క్రాప్‌ విధానంలో నమోదు చేయాలన్నారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు ట్యాబ్‌లు లేదా సెల్‌ఫోన్లు ఇవ్వనున్నామని తెలిపారు. మరో 2 వేల గ్రామాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాలు, ప్రతి గ్రామంలో భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

వర్క్‌షాపులో రైతులకు సలహాలు, సూచనలు, శిక్షణ  
సీఎం వైఎస్‌ జగన్‌ వ్యవసాయాధికారులను జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతమే నమోదైందని అధికారులు వివరించారు. ప్రస్తుత రబీలో 25.84 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారని, రిజర్వాయర్లు నిండినందున వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయాల పక్కనే రైతుల కోసం పెడుతున్న వర్క్‌షాపులను మరింత పటిష్టం చేయాలన్నారు.

వర్క్‌షాపులో రైతులకు సలహాలు, సూచనలు, శిక్షణ ఇవ్వాలని సూచించారు. విత్తనాల కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం మొదలు రైతులకు అందించే వరకూ ప్రతి ప్రక్రియ పారదర్శకంగా, ఉత్తమ ప్రమాణాలతో జరగాలన్నారు. చంద్రబాబు లాంటి మనుషులు అదే పనిగా వేలెత్తి చూపించడానికి ప్రయతి్నస్తారని, ఏదైనా మంచి పని జరుగుతుందంటే చూసి ఓర్వలేరని అన్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతా అవినీతి అని, అంతా అన్యాయం జరిగిపోయిందని.. ఇలా నానా రకాలుగా మాట్లాడి విష ప్రచారం చేస్తారని, అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.  

రైతు భరోసా కేంద్రాలుగా వర్క్‌షాపులు..
పంట సమస్యలను నివేదించడానికి గ్రామ పరిధిలోనే ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామ సచివాలయంలోనే ఈ సమస్యలకు పరిష్కారం లభించేలా ఏర్పాటు ఉండాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాల పక్కన ఏర్పాటు చేసే వర్క్‌షాపులకు రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెట్టి రైతు సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు వివరించారు. సచివాలయాల్లో బ్లాక్‌ బోర్డులు పెట్టి, పంటలపై సూచనలు, పరిష్కారాలు సూచిస్తామని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఏమి చేసినా వ్యవసాయంలో ఉత్తమ విధానాలనే రైతులకు సూచించాలన్నారు. రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలను ధరల స్థిరీకరణ నిధికి, ప్రకృతి వైపరీత్యాల నిధికి లింక్‌ చేయండని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు.

అరటి చెట్లు పడిపోతే రైతులకు బీమా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి విషయాల్లో ప్రకృతి వైపరీత్యాల నిధితో అండగా నిలవాలన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలను వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు సీఎం తెలిపారు. తుపాన్లు, పెను గాలులను దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌ల డిజైన్లు రూపొందాలని సీఎం ఆదేశించారు. అంతకు ముందు భూసార పరీక్ష పరికరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అరుణ్‌ కుమార్, ఉద్యాన విభాగం కమిషనర్‌ చిరంజీవి ఛౌదురీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

పెదవేగి ఆయిల్‌ పామ్‌ రైతులకే : కన్నబాబు
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకే అప్పగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయ మంత్రి కన్నబాబు చెప్పారు. తెలంగాణతో సమానంగా ఏపీ ఆయిల్‌ పామ్‌ రైతులకూ న్యాయం చేస్తామని మీడియాతో అన్నారు. రాష్ట్ర పామాయిల్‌ రైతులకూ రూ.87 కోట్లు మంజూరు చేశామన్నారు.

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 2018లో 15.50 లక్షల మంది బీమా చేయించుకుంటే 2019 ఖరీఫ్‌లో ఆ సంఖ్య 21.5 లక్షల మందికి చేరిందన్నారు. పొగాకు రైతుల రుణాల రీషెడ్యూల్‌ సమస్యపై బ్యాంకు అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సీఎం ఆదేశించారన్నారు.గోదావరిలో మునిగిన పడవను వెలికి తీయడంలో శ్రమించిన ధర్మాడి సత్యానికి వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

 చిరు ధాన్యాలు అంటే..
చిరు ధాన్యాలను ఇటీవలి కాలం వరకు తృణ ధాన్యాలుగా పిలిచేవారు. ఎంతో పోషక విలువలున్న వీటిని ఇంగ్లిషులో మిల్లెట్స్‌ అని, స్మాల్‌ మిల్లెట్స్‌ అని రెండుగా విభజించారు. మనందరికీ తెలిసిన చిరు ధాన్యాలు.. సజ్జ, జొన్న, రాగి. కంకిని నూర్చితే నేరుగా విత్తనాలు వస్తాయి. పొట్టు ఉండదు కనుక వాటిని నేరుగా వండుకుని తినవచ్చు. మరీ చిన్నవిగా ఉండే ధాన్యాలు కొన్ని ఉన్నాయి. అవి.. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు, వరిగలు. వీటి కంకుల్ని నూర్చితే పొట్టున్న గింజలు వస్తాయి. వాటిని మళ్లీ మర పట్టించుకుని వండుకోవాలి. ఈ ప్రక్రియ కాస్త కష్టం కావడంతో కొంత కాలం క్రితం వరకు అవి మరుగున పడ్డాయి. వీటి విలువ తెలియడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి.

ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు. నాణ్యతకు ప్రభుత్వం తరఫున గ్యారెంటీ ఇస్తున్నామనే విషయాన్ని గుర్తించుకోవాలి. షాపులో పెట్టే ప్రతి ఉత్పత్తికీ శాంపిల్‌ కచ్చితంగా ఉండాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement