ఏపీ మోడల్‌ తరహాలో దేశవ్యాప్తంగా ఈ–క్రాప్‌ | E-Crop national level implementation as Andhra Pradesh model | Sakshi
Sakshi News home page

ఏపీ మోడల్‌ తరహాలో దేశవ్యాప్తంగా ఈ–క్రాప్‌

Published Sun, Aug 28 2022 3:25 AM | Last Updated on Sun, Aug 28 2022 8:43 AM

E-Crop national level implementation as Andhra Pradesh model - Sakshi

ఈ–క్రాప్‌ నమోదు ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ పథకాల అమలు, నష్టపరిహారం పంపిణీ సులువుగా మారింది. ఏ ఊళ్లో.. ఎన్ని ఎకరాల్లో.. ఏయే పంటలు వేశారన్న కచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తోంది. తద్వారా దిగుబడిపై ముందస్తుగా ఓ అంచనాకు రావచ్చు.. ఆయా పంటలకు మార్కెటింగ్‌ కల్పించే విషయమై సరికొత్త ఆలోచనలతో అడుగులు ముందుకు వేయొచ్చు. ఈ–క్రాప్‌ వల్ల ఇన్ని సౌలభ్యాలుండటం గమనించిన కేంద్రం.. ‘ఏపీ మోడల్‌ భేష్‌’ అంటూ జాతీయ స్థాయిలో అమలుకు శ్రీకారం చుడుతోంది. 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ–క్రాప్‌ నమోదు వల్ల రైతాంగానికి ఒనగూరుతున్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్రం.. ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఏపీని మోడల్‌గా తీసుకొని.. అగ్రిస్టాక్‌ డిజిటల్‌ అగ్రికల్చర్‌ (ఏడీఎ) పేరిట అన్ని రాష్ట్రాల్లో ఈ– క్రాప్‌ నమోదు చేయాలని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా విజయవంతంగా అమలవుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది.

ఈ–క్రాప్‌ నమోదు ప్రామాణికంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు, రూ.లక్ష లోపు పంట రుణాలు ఏడాది లోపు చెల్లించిన వారికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీజన్‌ ముగియకుండానే పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాలనందిస్తున్నారు.

భూ యజమానులకే కాకుండా, సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు కూడా ఈ క్రాప్‌ నమోదే అర్హతగా వైఎస్సార్‌ రైతు భరోసాతో సహా అన్ని రకాల పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్‌ అమలులోకి వచ్చాక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాసం, ఆక్వా పంటలన్నీ కలిపి ఖరీఫ్‌ 2020లో 124.92 లక్షల ఎకరాలు, రబీ 2020–21లో 83.77 లక్షల ఎకరాలు, ఖరీఫ్‌ 2021లో 112.26 లక్షల ఎకరాలు, రబీ 2021–22లో 82.59 లక్షల ఎకరాల్లో ఈ–క్రాప్‌ బుకింగ్‌ జరిగింది.

ఏపీలో ఈ–పంట నమోదు ఇలా..
► నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన యాప్‌ ద్వారా జాయింట్‌ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు ఈ –పంట నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా వాస్తవ సాగుదారులు సీజన్‌ వారీగా ఏ సర్వే నంబర్‌లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్దతులు పాటిస్తూ సాగు చేస్తున్నారో ఆర్బీకేల్లో నమోదు చేస్తున్నారు. 
► ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోను అప్లోడ్‌ చేసి, చివరగా రైతుల సోషల్‌ స్టేటస్‌ తెలుసుకునేందుకు వీలుగా వారి వేలి ముద్రలు (ఈకేవైసీ – మీ పంట తెలుసుకోండి) తీసుకుని.. డిజిటల్‌ రసీదు వారి ఫోన్‌ నంబర్‌కు పంపిస్తున్నారు.
► ఈ పంట నమోదును వీఏఏ/వీహెచ్‌ఎ, వీఆర్‌ఏ ధ్రువీకరించగానే ఫిజికల్‌ రసీదు అందజేస్తారు. పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు ఆ కార్డుల్లేని రైతుల పంట వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. 
► ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 96.41 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 43.35 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతుంటే.. ఇప్పటి వరకు 35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు నమోదు చేశారు. సెప్టెంబర్‌ 15కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి, సోషల్‌ ఆడిట్‌ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రాల వారీగా స్టీరింగ్‌ కమిటీలు
► ఏపీలో ఈ–క్రాప్‌ను మోడల్‌గా తీసుకొని అగ్రి స్టాక్‌ డిజిటల్‌ అగ్రికల్చర్‌ (ఏడీఏ) అమలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఏడీఏ ద్వారా పంటల సాగు ఆధారంగా రైతుల డేటా బేస్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు వెబ్‌ ల్యాండ్‌ డేటానే అన్నింటికీ ఆధారం. దీన్ని బట్టే పీఎం కిసాన్‌తో సహా ఇతర పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. ఇక నుంచి సీజన్‌ వారీగా పంటల సాగు ఆధారంగా రైతుల డేటాను తయారు చేసి, ఆ మేరకు వారికి సంక్షేమ ఫలాలు అందించాలని సంకల్పించింది. 
► వెబ్‌ ల్యాండ్‌ డేటా ఆధారంగా జియో రిఫరెన్స్, విలేజ్‌ మ్యాప్, జీఐఎస్, ఆధార్‌ అథంటికేషన్, ఈ–కేవైసీలను అనుసంధానిస్తూ సీజన్‌ వారీగా రియల్‌ టైం క్రాప్‌ సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాల కోసం రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్‌ కమిటీలు, అమలు కోసం జిల్లా స్థాయిలో ఇంప్లిమెంటింగ్‌ కమిటీలు నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
► ఈ డేటాతో పీఎం కిసాన్‌తో పాటు పీఎంఎఫ్‌బీవై వంటి సంక్షేమ పథకాలను అనుసంధానించాలని భావిస్తోంది. ఇప్పటికే ఏపీని ఆదర్శంగా తీసుకొని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ– పంట నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇదే బాటలో జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేసింది. 
► ఇందుకోసం సోమవారం జాతీయ స్థాయిలో వ్యవసాయ శాఖ కార్యదర్శులు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతోంది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్‌ అహూజా ఆదేశాల మేరకు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌లు రాష్ట్రంలో అమలవుతున్న ఈ–పంట నమోదుపై అవగాహన కల్పించనున్నారు.
 
కేంద్రానికి ఏపీ ఆదర్శం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న ఆలోచనలకు దక్కిన అరుదైన గౌరవమిది. ఏపీని ఆదర్శంగా తీసుకుని అగ్రిస్టాక్‌ డిజిటల్‌ అగ్రికల్చర్‌ పేరిట జాతీయ స్థాయిలో ఈ పంట నమోదుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బాటలోనే వాస్తవ సాగుదారుల డేటాను రూపొందించి పీఎం కిసాన్‌తో సంక్షేమ ఫలాలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడం నిజంగా శుభ పరిణామం.
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, వ్యవసాయ శాఖ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement