మాఫీ మాయ | The officials on the government's loan waiver | Sakshi
Sakshi News home page

మాఫీ మాయ

Published Wed, Dec 10 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

మాఫీ మాయ

మాఫీ మాయ

బ్యాంకర్ల చుట్టూ రైతుల ప్రదక్షిణ
మెజార్టీ బ్యాంకులకు చేరని జాబితాలు
అర్హులకు దక్కని చోటు
అన్నదాతల పరిస్థితి  అగమ్యగోచరం

దగా చేశారు..
 
రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటన అధికారులు.. బ్యాంకర్లు.. రైతులను గందరగోళంలోకి పడేసింది. ఎవరు అర్హులో.. ఎవరు అనర్హులో.. ఎవరికిమాఫీ అయిందో.. ఎవరికి కాలేదో.. తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. సీఎం ప్రకటించి ఆరురోజులు గడిచి పోయాయి. జాబితా విడుదలచేసి నాలుగురోజులైంది. ఏ బ్యాంకు వద్ద పూర్తి స్థాయిలో సమాచారం లేదు . కొన్నిశాఖలలో జాబితాలు  ప్రకటించినా వాటిలో అర్హులకుచోటు దక్కని దుస్థితి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సాక్షి బృందం మండలాల వారీగా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణమాఫీపై పరిశీలన జరపగా అంతటా గందరగోళమే నెలకొంది.
 
విశాఖపట్నం:  జిల్లాలో 3.87లక్షల ఖాతాలుంటే రూ.50వేల రుణమాఫీ సీలింగ్ పేరుతో కేవలం లక్ష 30వేల 979 ఖాతాలకు మాత్రమే పరిమితమైంది. మిగిలిన 2.83,021 ఖాతాల్లో మరో లక్షమంది వరకు అర్హులున్నప్పటికీ వారికి  మొండిచేయే మిగిలింది. వీటిలో 50వేలకుపై బడి రూ.500ల నుంచి ఐదువేల లోపు ఉందనే సాకుతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ జాబితాలోకి చేర్చినట్టు చెబుతున్నప్పటికీ 70 శాతం మందికి అర్హుల జాబితాలో చోటు దక్కలేదు. సాధారణంగా ఏజెన్సీలోని గిరిజన రైతులంతా 50వేల లోపు రుణం తీసుకున్న వారే. కానీ జాబితాలో చోటు దక్కింది మాత్రం 35 శాతం లోపే. ఉదాహరణకు వి.మాడుగలలో పదివేల మందికి పైగా రైతులుంటే కేవలం 4వేల మందికే జాబితాలో చోటు దక్కింది. కోటపాడులో 8వేలమందిరైతులుంటే కేవలం 3వేల మందికే మాఫీ వర్తించింది. భీమిలి నియోజకవర్గంలో ఏకంగా 6వేల మంది రైతులకు రూ.12.5కోట్ల రుణాలుంటే అర్హుల జాబితాలో ఏ ఒక్కరికి చోటు దక్కలేదు. ఇక్కడ పీఎస్‌సీఎస్ పరిధిలో రూ.50వేల లోపు రుణాలున్న రైతులు 720మంది ఉంటే కేవలం 62 మందికి మాత్రమే జాబితాలో చోటు దక్కింది.
 ఏజెన్సీలో ఒక్కమండలానికే: ఏజెన్సీలో కేవలం కొయ్యూరు మండల పరిధిలోని రైతులకు మాత్రమే మాఫీ వర్తించింది. మిగిలిన మండలాల్లోని సోసైటీల్లో   ఎక్కడా జాబితాలనే ప్రదర్శించలేదు. మైదానంలో కేవలం పది మండలాల్లో మాత్రమే అదీ కూడా కొన్ని బ్యాంకుల్లోనే మంగళవారం  జాబితాలను ప్రదర్శించారు. 50వేల లోపు రుణాలు తీసుకున్నవారు ఎక్కువ మంది సహకార సంఘాల పరిధిలోనే ఉంటారు. సొసైటీల పరిధిలో రూ.250కోట్లకు పైగా రుణాలున్నాయి. వీటిలో కనీసం 80 శాతం రుణాలు తొలి జాబితాలోనే చోటు దక్కాల్సి ఉన్నప్పటికీ కనీసం 40శాతం రుణాలు కూడా మాఫీకాని పరిస్థితి నెలకొంది.

రేపటి నుంచి మాఫీ సర్టిఫికెట్ల జారీ: ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు క్షేత్ర స్థాయి లో రైతుసాధికారత సదస్సుల పేరిట స మావేశాలు నిర్వహించి అర్హులైన రైతులకు మాఫీ సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు  బ్యాంకర్లు, జిల్లా అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు జారీకాలేదు. కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే గడువు ఉండడంతో ఏం చేయాలో పాలుపోనిస్థితిలో ఉ న్నామని డీఆర్వో నాగేశ్వరరావు సాక్షికి తెలిపా రు. బుధవారం నాటికి క్లారిటీ వస్తుందన్నారు.
 
 మోసపోయాం..

ప్రభుత్వం మోసం చేసింది.  నాకు పాడేరు డీసీసీబీ బ్యాంకులో 40వేల రుణం ఉంది. వడ్డీతో 50వేల లోపే ఉంది. కానీ జాబితాలో నా పేరు లేదు. అడిగితే మీకు రాలేదంటున్నారు. ఎందుకురాలేదని అడిగితే సమాధానం చెప్పే వారే కరువయ్యారు. పైగా కసురుకుంటున్నారు.ఎందుకు మాఫీ కాలేదో కూడా చెప్పే పరిస్థితిలేదు.
 -మువ్వల సత్యనారాయణ, గిరిజన రైతు
 
 ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు


రెండు రోజులుగా రుణ మాఫీ జాబితా గురించి బ్యాంకు చుట్టూ తిరుతున్నా జాబితా రాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చీడిగుమ్మల సొసైటీలో రూ.30 వేలు, నర్సీపట్నం ఏడీబీ బ్యాంకు నుంచి రూ.30 వేలు తీసుకున్నారు. సొసైటీలో రుణమాఫీ గురించి అడిగితే రాలేదంటున్నారు. ఏబీడీ బ్యాంక్ వస్తే అసలు రుణ జాబితా రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం పూటకో ప్రకటనతో రైతులను ఇబ్బంది పెడుతున్నది.           

   -గండి శ్రీను, చీడిగుమ్మల
 
 
నాది ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు.ఖరీఫ్ కోసం గతేడాది ఎస్.రాయవరం మండలం గుడివాడ ఎస్‌బీఐలో రూ.40వేల రుణం తీసుకున్నారు. పుస్తెలతాడుతో సహా బంగారు ఆభరణాలు కుదువపెట్టి మరో పాతికవేల తీసుకున్నాను.  పంట కలిసిరాలేదు. చంద్రబాబు హామీతో అప్పు మాఫీ అవుతుందని ఆశపడ్డాను.  మాఫీ జాబితాలో నా పేరు లేదు. ఇంతకంటే దగా ఇంకేముంటుంది.  -కె.సత్యలక్ష్మి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement