విజయనగరం అర్బన్ : పంట రుణమాఫీ అమలు కోసం ఇన్నాళ్లూ సవా‘లక్ష’న్నర నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్యను భారీగా కుదించిన ప్రభుత్వం, తాజాగా ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ కొలమానం ప్రకారం పండించిన పంటకు ఇచ్చే రుణంలోనూ పరిమితులు విధించి, రుణమాఫీ మొత్తానికి భారీస్థాయిలో కతెక్తర వేసింది. ఆ మేరకు తొలి అర్హులజాబితాను తాజాగా విడుదల చేసింది. దీంతో చాలా మంది రైతులు నష్టపోతున్నారు.‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పట్టిక మేరకు నిర్ణయించిన రుణ మంజూరు పరిమితులను విస్మరించి,తమకు తోచినట్టుగా కుదించారు.
2012-13 వార్షిక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన మేరకు చెరుకు పంటకు ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేల (అగ్రికల్చర్ టెక్నికల్ కమిటీ అధికారికంగా నిర్ణయించిన పట్టిక ప్రకారం) వరకు రుణ అర్హత ఉంది. అయితే తొలి జాబితాలోని చెరుకు పంట రుణాలకు ఎకరాకు కేవలం రూ.15 వేలు మాత్రమే పరిధిని నిర్ణయించి రుణమాఫీ లెక్కలు కట్టారు. దీంతో దాదాపు మూడొంతులలో రెండొంతుల రుణాన్ని మాఫీకి దూరం చేశారు. ఆ సొమ్మును రైతులు కచ్చితంగా బ్యాంకులకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. రోజుకో ప్రకటన చేస్తూ రైతులను మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం తీరా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసే ముందు ఈ విధంగా కుట్రచేసింది.
రైతన్నలకు ఝలక్..
రుణాలు మాఫీ అవుతాయని కొండంత ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూపంలో ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. దీంతో అధికంగా రుణాలు వాడిన చెరుకు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా విడుదల చేసిన అర్హుల తొలి జాబితాను పరిశీలిస్తే అది స్పష్టం అవుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పరిధిలోని ఎస్.కోట శాఖలో పడాల వెంకట విశ్వనాథం అనే రైతు రుణమాఫీ ఖాతాను పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది. నాలుగు ఎకరాల్లో చెరకు పంట వేసేందుకు 2013 జూన్ 22న రుణం పొందే సమయానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పట్టిక ప్రకారం ఎకరాకు రూ. 40 వేల చొప్పున రూ. లక్షా 20 వేల రూపాయల వరకు అప్పుతీసుకునే అర్హత ఉంది.
అయితే ఆయన ఎకరాకు రూ.15 వేల చొప్పున నాలుగు ఎకరాలకు రణ పరిధిని నిర్ణయించినట్లు ఆన్‌లైన్ జాబితా పట్టికలో స్పష్టంగా తెలుస్తోంది. ఇదే తీరులో జిల్లాలోని 20 వేల మంది చెరకు రైతుల రుణపరిమితిని కుదించి మాఫీ అమలు చేయనున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కత్తెర వల్ల ఒక్క డీసీసీబీలోనే రూ. 14 కోట్ల మేరకు మాఫీ నిధిని కుదించారు. డీసీసీబీలో తొలిజాబితాలోని 39,259 మంది రైతులకు రూ.104 కోట్ల మేర రుణం ఉండగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పట్టిక మేరకు అమలు చేయడం వల్ల రూ.90.23 కోట్ల మేర మాత్రమే రుణమాఫీ కానుంది. రుణమాఫీ పరిధిని తగ్గించడంతో చెరకు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రూ.50 వేల లోపు రుణం తీసకున్న రైతుల ఖాతాల్లో రూ.47.23 కోట్లు జమ అయినట్టు డీసీసీబీ అధికారులు చెప్పారు.
అర్హుల తొలి జాబితాలో 1,43,808 మంది రైతులు
ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విడుదల చేసిన అర్హుల తొలి జాబితాలో 1,43,808 మంది రైతులున్నారని సమాచారం. రెండుమూడు అకౌంటులున్న రైతులను కలుపుకొంటూ ఈ జాబితా తయారయినట్టు అధికారులు ప్రకటించారు. అదే విధంగా ఖాతాదారుల జాబితాలను మండలాల వారీగా ఆయా మండలాల వ్యవసాయ శాఖలకు నేరుగా పంపారు. దీనిలో రూ.50 వేలు లోపు రుణం ఉన్న రైతులను విభజించకపోవడం వల్ల ఖాతాదారులకు వివరణ ఇవ్వలేని పరిస్థితిలో బ్యాంక్ అధికారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పలుప్రాంతాలలో రూ.50 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు పూర్తి స్థాయిలో నగదు జమ కాలేదు. బాడంగి, తెర్లాం, ఎస్.కోట, గంట్యాడ మండలాలల్లో రైతులకు ఇలా జరగడం వల్ల ఎవరిని అడిగి వివరాలు తెలుకోవాలో తెలియక ఆందోళనలో రైతులు పడ్డారు.
‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’లోనూ కత్తెర..!
Published Wed, Dec 10 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM
Advertisement
Advertisement