కొండంత బకాయి ...గోరంత మాఫీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో రైతులు తీసుకున్న రుణానికి, జరిగిన మాఫీకి పొంతనలేకుండా పోయింది. ఇప్పుడిస్తున్న మాఫీ మొత్తం రుణాలకయ్యే వడ్డీకి కూడా సరిపోవడం లేదు. ప్రభుత్వం చూపించిన లెక్కలే అందుకు సాక్ష్యం. జిల్లాలో మూడు లక్షల 20వేల మంది రైతులు రూ.1,391కోట్ల మేరకు రుణాలు తీసుకున్నారు. అయితే వారిలో రెండు లక్షల 79వేల 125 మందిని మాత్రమే రుణమాఫీకి అప్‌లోడ్ చేశారు. వేర్వేరు కారణాలు చూపించి 40,875 మందిని ముందే పక్కన పెట్టేశారు. పోనీ అప్‌లోడ్ చేసిన రెండు లక్షల 79 వేల 125మందికైనా రుణ మాఫీ చేశారా అంటే, అదీలేదు. అందులో లక్షా 44వేల 621మందికి మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. పోనీ వీరికైనా తీసుకున్న రుణమం తా మాఫీ అయిందా అంటే అదీ జరగలేదు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పండించిన పంటకు ఇచ్చే రుణంలోనూ పరిమితులు విధించి, రుణమాఫీ మొత్తానికి భారీ స్థాయిలో కత్తెర వేశారు. లక్షా 44వేల 621మందికి గాను రూ.390.39 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుందని, అందులో ఫస్ట్ ఫేజ్ కింద రూ.184.61కోట్లును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అంటే రైతులు తీసుకున్న రుణమొత్తం మాఫీ చేయకపోగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిర్ధేశించిన మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మొదటి విడత పోను మిగతా మొత్తాన్ని దశల వారీగా ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, మాఫీ జాబితాల్లో ఉన్న వారు పోనూ ఇంకా లక్షా 34 వేల 504 మంది అనర్హులుగా మిగిలిపోయారు. వీరందర్నీ అభ్యంతరాల జాబితాలో చేర్చారు. అభ్యంతరాల ను సరిచేసుకుని జన్మభూమి కమిటీల ద్వారా పంపిస్తే పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో లక్షా 34వేల 504మంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇదంతా చూస్తుంటే జిల్లాకు రూ.నాలుగైదు వందల కోట్ల ఇచ్చి చేతులు దులుపేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పరోక్షంగా చెప్పుకొస్తున్నాయి. ఇక, మాఫీ వివరాలను తెలుసుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెట్ సెంటర్లవద్ద పడిగాపులు కాస్తున్నారు. అనర్హత జాబితాల్లో ఉన్న వారైతే మరింత ఇబ్బందులు పడుతున్నారు. అభ్యంతరాలను ఎలా సరిచేసుకోవాలో తెలియక, ఎక్కడెళ్లి సరిచేయాలో అవగాహన లేక నానా బాధలు పడుతున్నారు.