నిండా మోసపోయాం
♦ రుణమాఫీ వర్తించక రైతుల గగ్గోలు
♦ రెండో జాబితాలోనూ వేలాది మందికి మొండిచేయి
ఈయన పేరు పీలా జగ్గారావు..అనకాపల్లిమండలం తుమ్మపాలలో ఇతనికి ఎకరా 50 సెంట్ల భూమి ఉంది. భూమి డాక్యుమెంట్లతో పాటు ఇంటిలోని బంగారమంతా కుదువపెట్టి 2013లో రూ.93వేల రుణం బ్యాంకులో తీసుకున్నాడు. ఇప్పుడు వడ్డీతో లక్షా 20వేలకుపైగా అయింది. గతేడాది డిసెంబర్‌లో విడుదల చేసిన రుణమాఫీ తొలి జాబితాలో ఇతని పేరు లేదు. ఇదేమిటని అడిగితే నీ వివరాలు సరిగ్గా నమోదు కాలేదు..మీసేవ కేంద్రానికి వెళ్లి పట్టాదారుపాసుపుస్తకం, టైటిల్ డీడ్, ఆధార్, రేషన్‌కార్డులన్నీ అప్‌లోడ్ చేసుకుంటే రెండో జాబితాలో రుణమాఫీ వర్తింస్తుందని అధికారులు చెప్పారు. చెప్పులరిగేలా తిరిగి చివరకు అన్నీ అప్‌లోడ్ చేయించుకున్నాడు. రెండో జాబితాలోనూ పేరు లేకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు.
సాక్షి, విశాఖపట్నం : ఇది ఒక్క జగ్గారావు ఆవేదనే కాదు..జిల్లా లో రుణమాఫీ జాబితాల్లో చో టు దక్కని అక్షరాలా లక్షా 54 వేల మంది రైతుల ఆర్తదానం. జిల్లాలో మూడు లక్షల 87వేల మంది రైతులకు రూ.1250 కోట్ల వరకు రుణాలున్నాయి. సకాలంలో వీటిని చెల్లించకపోవడంతో పావలా, జీరో పర్సంట్ వడ్డీ రాయితీలను రైతులు కోల్పోయారు. జిల్లాలో 3.87లక్షల ఖాతాలుంటే 3.45 ఖాతాల వివరాలను మాత్రమే అప్‌లోడ్ చేయగలిగారు. అయినప్పటికీ లక్షా 54వేల ఖాతాదారులు రుణమాఫీకి అర్హత కోల్పోయారు. ఇక జాబితాలో చోటు దక్కిన వారి పరిస్థితి కూడా ఏమాత్రం గొప్పగా లేదు.
ఉన్న అప్పు రూ.లక్షన్నర అయితే పడింది ఐదువేలు..పదివేలు. అడిగితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నీకున్న పొలం విస్తీర్ణాన్ని బట్టి రూ.24వేలే మాఫీ వర్తిస్తుంది. తొలి ఏడాది రూ.6వేలు పడింది. వచ్చే నాలుగేళ్లు ఇదే రీతిలో ఆరేసి వేలు చొప్పున జమవుతుంది. మిగిలిన మొత్తం వడ్డీతో సహా చెల్లించుకుంటే మేలు లేకపోతే వడ్డీతో తడిసిమోపెడవుతుంది అంటూ బ్యాంకర్ల బెదిరింపులు రైతులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 600కు పైగా బ్యాంకులశాఖల్లో కుదువపెట్టిన కిలోల కొద్దీ బంగారాన్ని సకాలంలో విడిపించుకోలేదనే సాకుతో వేలంవేస్తున్నారు.
ఇలా రుణమాఫీ పేరుతో దగాపడ్డ రైతన్నల పరిస్థితి దయనీయంగా తయారైంది.. చంద్రన్న రుణమాఫీహామీతో నిండామోసపోయాం. అప్పులఊబిలో కూరుకుపోయాం. మేమేం పాపం చేసుకున్నామో తెలియడం లేదు. మా పేర్లు ఎందుకు జాబితాలో లేవో అర్థం కావడం లేదంటూ వేలాదిమంది రైతులు జిల్లా వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారు. దీంతో బంగారం విడిపించుకోలేక బ్యాంకుల్లోనే వదిలేస్తున్న రైతులు కొందరైతే..ఉన్న ఇల్లు వాకిలి అమ్ముకుని అప్పులు తీర్చేందుకు మరికొందరు సిద్ధపడుతుంటే..ఇక వ్యవసాయం మా వల్ల కాదంటూ ఇంకొందరు కూలీలుగా అవతారమెత్తే దుస్థితి నెలకొంది.
రెండో జాబితాలోనూ నా పేరు లేదు
నేను కొండలఅగ్రహారంలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.38వేలు రుణం తీసుకున్నాను. మొదటి రుణమాఫీ జాబితాలో కౌలు రైతుగా పేరు నమోదై వచ్చింది. దీని వల్ల నాకు మాఫీ వర్తించలేదు. దీనిపై కౌలురైతును కానంటూ దరఖాస్తు చేశాను. మళ్లీ రెండో జాబితాలో కూడా కౌలు రైతుగానే పేరు రావడంతో ఈ సారి కూడా మాఫీ కాలేదు. నా సమస్యను ఎవరూ పట్టాంచుకోలేదు.
- అడిగర్ల లక్ష్మణమూర్తి, రైతు ,
కొండలఅగ్రహారం, మాకవరపాలెం మండలం