సాక్షి ప్రతినిధి, ఒంగోలు, చీరాల,దర్శి : ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు తర్వాత మాట మార్చారు. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని అబద్ధ్దాలాడడమే కాకుండా రూ.50 వేలలోపు రుణాలన్నీ మాఫీ అయిపోయినట్లేనని ఆర్భాటంగా ప్రకటించారు. తాజాగా రుణమాఫీలు రైతు ఖాతాల్లో పడ్డాయి. 50 వేలలోపు రుణాలు మాఫీ అయ్యాయని భావించిన రైతులకు చంద్రబాబు షాకిచ్చారు. వీరి ఖాతాల్లో కేవలం మూడు నుంచి నాలుగు వేలు మాత్రమే మాఫీ కింద చూపించడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. రుణమాఫీ పేరుతో రైతులను దా‘రుణ’ంగా మోసగించింది. బాసటగా ఉండాల్సింది రుణమాఫీ శాపంగా మారింది.
బంగారం వేలం వేస్తామంటే పొలం అమ్మకం
బుర్లవారిపాలేనికి చెందిన బుర్ల శ్రీనివాసరావు అనే రైతు వ్యవసాయ రుణాల కింద బంగారాన్ని తనఖా పెట్టి 2012లో 1,30,000 రుణాన్ని తీసుకున్నాడు. బ్యాంకు అధికారులు బంగారాన్ని వేలం వేస్తామని హెచ్చరించడంతో తనకున్న స్థలాన్ని తాకట్టు పెట్టి బంగారు నగలను విడిపించేందుకు సిద్ధమయ్యాడు.
రూ.50 వేలు లోపున్నా...సున్నాయే
చీరాల మండలం బోయినవారిపాలేనికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు 2012లో ఈపూరుపాలెం ఎస్.బి.ఐ.లో తనకున్న పదెకరాల పొలాన్ని తనఖా పెట్టి రూ.80 వేలు రుణాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం అది వడ్డీతో కలిపి రూ.1,18,500 అయింది. జాబితాను చూసుకోగా కేవలం రూ.40 వేలు మాత్రమే మాఫీ అయినట్లు బ్యాంకు అధికారులు చెప్పడంతో లబోదిబోమన్నాడు.
బోయినవారిపాలేనికిు చెందిన రైతు బి.రామకృష్ణ తనకున్న రెండున్న ఎకరం పొలాన్ని 2012లో తనఖా పెట్టి రూ.24,500 రుణాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం అది వడ్డీతో కలిపి రూ.38 వేలు అయింది. రూ.50 వేలులోపు రుణం తీసుకున్నవారికి మాఫీ అవుతుందని చెప్పడంతో ఎంతో ఆశగా ఎదురు చూశారు. రూ.18,500 మాత్రమే మాఫీ అయింది. మిగిలిన మొత్తం చెల్లించి పాసు పుస్తకాలు తీసుకెళ్లాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆ రైతు కుటుంబం గొల్లుమంది.
పెట్టిన వాతలు చాలవా?
ఉన్న కొర్రీలతో పెట్టిన వాతలు చాలక ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పేరుతో మరో వంచనకు బాబు ప్రభుత్వం దిగింది. అది కుడా బ్యాంకర్ల విధించిన మొత్తంకంటే తక్కువగా నిర్ణయించి అన్యాయానికి పాల్పడిందని రైతులు వాపోతున్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ కింద బ్యాంకర్లు ఎకరా వరికి పంట రుణం కింద రూ.25 వేలు, పత్తికి రూ.35 వేలు, పొగాకుకు రూ.55 వేలు, మిర్చికి రూ.55 వేలు, శనగకు రూ.16 వేలు చొప్పున రుణం మంజూరు చేస్తారు.
కానీ ప్రభుత్వం మాత్రం అన్ని పంటలకు సగానికి సగం చొప్పున రుణ పరిమితికి కోత పెట్టింది. ఎకరా వరికి రూ.12 వేలు, పొగాకుకు రూ.32 వేలు మాత్రమే రుణమాఫీకి వర్తింపచేసింది. అంటే వరి సాగుచేసే రైతు పంట రుణం కోసం రెండెకరాలకు బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నట్లయితే ఆ రైతుకు రెండెకరాలకు కలిపి రూ.24 వేలు మాత్రమే రుణమాఫీ అయ్యింది. మిగిలిన రూ.26 వేలు, అపరాధ వడ్డీ బ్యాంకులకు రైతు కట్టాల్సిందే.
37 రూపాయలూ రుణమాఫీనే
దర్శి మండలం రాజంపల్లికి చెందిన కందుకూరి అరుణాచలానికి 3.01 ఎకరాలు భూమి ఉండగా రుణమాఫీ జాబితాలో 0.01 సెంటు భూమి ఉన్నట్లుగా జాబితాలో ఉంది. ఆ రైతుకు 189.81 రూపాయలు రుణమాఫీ జాబితాలోకి రాగా రూ. 37.96 తొలివిడత మాఫీలోకి వచ్చింది. తప్పుడు రాతల మూలంగా మాఫీ కావాల్సిన రూ.70 వేలు కాకుండా పోయింది.
కొమరోలులో...
ఒక రేషన్ కార్డు పరిధిలో మరో కుటుంబం చేరిపోవడంతో ఇరువురికీ నష్టం వాటిల్లింది. కొమరోలు మండలంలోని మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన వర్రా వీరనారాయణ తండ్రి వీరయ్య స్టేట్‌బ్యాంకులో బంగారం రుణాన్ని లక్ష రూపాయలు మిరప పంటను సాగుచేసుకునేందుకు వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ఈ రైతుకు 2.43 ఎకరాల పట్టాదారు పాసు పుస్తకం ఉంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో వీరనారాయణ రేషన్‌కార్డు నంబరు కింద ఇదే గ్రామానికి చెందిన వర్రా పెద్ద వీరయ్య తండ్రి బాలయ్య ఆధార్ నంబరుకు జతచేసి ఉంది. స్థానిక ఆంధ్రాబ్యాంకులో వర్రా పెద్ద వీరయ్య తండ్రి బాలయ్య అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం ద్వారా రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. దీంతో వీరనారాయణకు సంబంధించిన ఖాతాకు మరో వ్యక్తి జతచేయడం, పట్టాదారు పాసుపుస్తకంలో 2.43 ఎకరాలుండగా కేవలం ఒక ఎకరాకు రూ.20 వేలు మాత్రమే వర్తించడంతో ఇదేమి లెక్కంటూ తల పట్టుకుంటున్నాడీ రైతు.
‘పచ్చ’ అబద్ధం
Published Wed, Dec 10 2014 2:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement