అప్పుల ఉచ్చులో అన్నదాత | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

అప్పుల ఉచ్చులో అన్నదాత

Published Thu, Sep 11 2014 1:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

అప్పుల ఉచ్చులో అన్నదాత - Sakshi

అప్పుల ఉచ్చులో అన్నదాత

 ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఉచ్చులో అన్నదాత విలవిలలాడుతున్నాడు. సాగు మదుపు కోసం అడిగినంత వడ్డీకి అప్పు తీసుకుంటున్నాడు. దీనంతటికి కారణం ప్రభుత్వ నిర్వాకమే! ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ చేయకపోవడం, రీషెడ్యూల్ లేని కారణంగా బ్యాంకులు రుణం ఇవ్వకపోవడంతో పంటకు పెట్టుబడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇంట్లోని చిన్నా చితకా ఆభరణాలు తాకట్టుపెట్టి మరీ ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : అన్నం పెట్టే అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. కానీ సర్కార్ ఏమాత్రం కనికరించడం లేదు. అమలుకు నోచుకోని రుణమాఫీ ప్రకటనతో రైతులు  ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ చివరి దశకొచ్చేసినా సాగు చేసుకోవడానికి మదుపు లేక దిక్కులు చూస్తున్నాడు. కొన్నేళ్లుగా కరువుతో సతమతమవుతున్న రైతులకు ఎక్కడా పరపతి పుట్టని పరిస్థితి నెలకొంది. బ్యాంకులు తప్ప మరో ఆధారం లేదు. అయితే ఆ బ్యాంకులు ఇప్పుడు ముఖం చాటేశాయి. దాదాపు 3.5లక్షల మంది రైతులకు సంబంధించి రూ.1036కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిని తీర్చితేనే కొత్తగా రుణాలు ఇస్తామని బ్యాంకులు మొండికేస్తున్నాయి.
 
 సర్కార్ రుణమాఫీ చేసి ఉంటే బకాయిలన్నీ తీరిపోయి కొత్తగా ఇచ్చేవారమని, ఆ ప్రక్రియ ఇంతవరకు జరగకపోవడంతో తామేమి చేయలేమని, రీషెడ్యూల్ కూడా చేయలేమంటూ చెప్పడమే కాకుండా గతంలో తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ నోటీసులిస్తున్నాయి. దీంతో రైతుల పరిస్థితి  పుండుపై కారం చల్లినట్టుగా తయారైంది. బ్యాంకులకు వెళ్తే వాళ్లిచ్చే నోటీసులు అందుకోవడం తప్ప రుణం వచ్చేది లేదని వాటి జోలికే పోవడం లేదు. దీంతో గత ఏడాది ఖరీఫ్‌లో దాదాపు లక్షా 11వేల 856 మందికి సుమారు రూ.850 కోట్లు రుణమిచ్చిన బ్యాంకులు ఈ ఏడాది రూ. 160కోట్లకే పరిమితమయ్యాయి.దాదాపు 18 వేల మందికి మాత్రమే రుణాలందాయి. వీరంతా దాదాపు కొత్తవారే.
 
 మిగతా లక్ష మంది  రైతులు దిక్కులేని పరిస్థితిలో వడ్డీ వ్యాపారస్తులను, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు.  రూ.3 నుంచి 10 వరకు వడ్డీ కింద రుణాలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి మునుపెన్నడూ లేని విధంగా ప్రైవేటు వ్యక్తుల బారిన పడి అప్పుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇంత చేసినా పంట దక్కుతుందా అంటే అదీ లేదు. ప్రకృతి దయ చూపితే తిండి గింజలు ఇంటికొస్తాయి. లేదంటే పరిస్థితి దయనీయమే. ప్రస్తుతం ఎకరాకు రూ.20 వేల వరకు అప్పులు చేసి మదుపు పెడుతున్నారు.  ఆలస్యంగా వర్షాలు కురవడం, ఎరువుల కొరత ఉండటం, పట్టి పీడిస్తున్న తెగుళ్లతో దిగుబడిని అంచనా వేయలేని పరిస్థితి కన్పిస్తోంది. ఎదొకలా నెట్టుకొచ్చినా చివరిలో ప్రకృతి కనికరించకపోతే అసలకే నష్టపోవాల్సి వస్తోంది. కానీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మాఫీ పేరుతో కాలయాపన చేస్తూ రైతులను ఆదుకోకుండా రకరకాల కబుర్లు చెబుతూ తప్పించుకుంటోంది.  
 
 వడ్డీ వ్యాపారే దిక్కయ్యారు..
 మాది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. నాకు రెండెకరాల పొలం ఉంది. గంట్యాడలో ఉన్న గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో నాకు రూ.20 వేలు రుణం ఉంది. ప్రతీ ఏటా డబ్బులు కట్టి తిరిగి తీసుకుంటూ ఉంటాను. గత ఏడాది పంట దెబ్బతిన్న కారణంగా రుణం కట్టలేకపోయాను. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పడంతో రుణం మాఫీ అవుతుందని ఎంతో ఆశపెట్టుకున్నాను. కాని  మాఫీ అవ్వలేదు. బ్యాంకుకు వెళ్తే పాత రుణం కట్టి కొత్త రుణం తీసుకోవాలని తెలిపారు. పాత రుణం కట్టే పరిస్థితి లేకపోవడంతో వడ్డీ వ్యాపారి వద్ద రూ. 3 వడ్డీకి రూ.20 వేలు అప్పు తీసుకున్నాను.
 - సిరపురపు ఎర్నాయుడు, రైతు
 
 రుణమాఫీ ప్రకటనే మిగిలింది...
 ఒకప్పుడు సేద్యం దండగ అన్న చంద్రబాబు ఎన్నికల ముందు రైతు రుణమాఫీ అన్నాడు. రకరకాల ప్రకటనలతో చంద్రబాబు  మోసం చేశాడు. వ్యవసాయం చేయడానికి అప్పు పుట్టక నానా ఇబ్బంది పడ్డాం. బ్యాంకులలో రీషెడ్యూల్ అన్నారు. లక్షా 50వేల రూపాయల మాఫీ అన్నారు. ఇంతవరకు ఏదీ వర్తించలేదు సరికదా... అప్పు పుట్టక ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి ఈ ఏడాది వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టాం. మా చెల్లి పెళ్లికి ప్రైవేటుగా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.  
 -అల్లు కిషోర్‌కుమార్, రైతు,
 
 రాజుపేట, బొబ్బిలి మండలం
 కన్నెత్తి చూడని బాబు...
 చంద్రబాబు పాలనలో ఒకనాడు ఎంతో కరువు, కాటకం వచ్చిం ది. రైతుల పక్క కనీసం కన్నెత్తి చూడని చంద్రబాబు ఇప్పుడు తాను రైతు పక్షపాతినని, రైతురాజ్యం తనతోనే వస్తుందంటున్నాడు. రుణమాఫీ అమలు ప్రకటనకే మూడు నెలలు తిన్న బాబు అది అమలు ఎప్పుడు చేస్తాడో ఆయనకే తెలియాలి. ఉన్న అప్పులు తీర్చలేక.. కొత్త అప్పు పుట్టక రైతు లోకం ఎంతో ఇబ్బంది పడుతోంది. బ్యాంకర్లు రుణాలు చెల్లించాలని నోటీసులు పంపారు. ఈ ప్రాంతంలో నెలకు 5 రూపాయలు, 10 రూపాయల వడ్డీకి అప్పులు చేసి మేం ఇబ్బంది పడుతున్నాం.
 - పెంట ఇసుమునాయుడు,
 రైతు, రాజుపేట, బొబ్బిలి మండలం
 
 రైతుకు ఆర్థిక ఇబ్బంది వచ్చింది...
 చంద్రబాబు రుణమాఫీ ప్రకటనతో ముందు ధైర్యం వచ్చిన రైతులు రాను రాను పాతరుణం తీరక, కొత్త రుణం పుట్టక ఆర్థిక ఇబ్బంది పడే దుస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో చెరుకు బకాయిలు అదనం. మేం బంగారాన్ని ప్రైవేటు వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి తీసుకువచ్చారు. చిన్న రైతులు అయితే వ్యవసాయం చేయలేక కౌలుకు ఇవ్వడం, ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం చేస్తున్నారు. మాకు అలవాటైంది కాబట్టి వ్యవసాయాన్ని వదలలేక పిల్లల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేయాల్సి వస్తోంది.
 -చింతల రామారావు, రైతు, దిబ్బగుడ్డివలస
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement