వైఎస్‌ఆర్ సీపీ పోరుబాట
రుణమాఫీపై చంద్రబాబు కప్పదాటు వైఖరికి
నిరసనగా మూడు రోజుల పాటు ఆందోళన
నరకాసుర వధ పేరుతో దిష్టిబొమ్మల దహనం
వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులకు
పిలుపునిచ్చిన పెనుమత్స
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కప్పదాటు వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మరోసారి ఆందోళనకు సిద్ధమైంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా గురువారం నుంచి మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలపనున్నాయి. అన్ని పంచాయతీ, మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో నరకాసుర వధ కార్యక్రమం పేరిట భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు... ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల పార్టీ కన్వీనర్లకు సమాచార అందించి మార్గ నిర్దేశం చేశారు. పూర్తిస్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించి వైఎస్‌ఆర్ సీపీ రైతులు పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందన్న సందేశం ఇవ్వాలని స్పష్టం చేశారు.
పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పెనుమత్స
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రుణమాఫీపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఒకరోజు, మండల కేంద్రాల్లో ఒకరోజు, జిల్లా కేంద్రంలో ఒకరోజు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.