అప్పుశయ్యపై అన్నదాత! | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

అప్పుశయ్యపై అన్నదాత!

Published Wed, Jun 18 2014 1:39 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

అప్పుశయ్యపై అన్నదాత! - Sakshi

అప్పుశయ్యపై అన్నదాత!

సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రకృతి వైపరీత్యాల కారణంగా వరుసగా నాలుగేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న అన్నదాతలు చేసిన అప్పులు తీరక కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఏటా కష్టాల సాగు-కన్నీటి సేద్యమే మిగులుతోంది. అలాగని వ్యవసాయాన్ని వదులుకోలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీతో కాసింత ఊరట చెందారు. పేరుకుపోయిన బ్యాంకు అప్పులన్నీ మాఫీ అవుతాయని, కొత్తగా ఇచ్చే రుణాలతో సాగు చేసుకోవచ్చని భావించారు. కానీ వారి ఆశలు ఆవిరైపోతున్నాయి. రుణమాఫీ అమలుకు చంద్రబాబు పెట్టిన మెలికతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కమిటీతో కాలయాపన చేయడం వల్లబ్యాంకుల వద్దకెళ్లి రుణాలు అడిగేందుకు సాహసించలేకపోతున్నారు.
 
 నాలుగేళ్లలో రూ.60 కోట్ల నష్టం ...
 ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అనావృష్టితో కొంత, వరుస తుపానులతో ఇంకొంత పంట తుడిచిపెట్టుకుపోయింది. ఒక తుఫాన్ నుంచి తేరుకోకముందే మరో తుఫాన్ ముంచుకురావడంతో రైతన్నకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. ప్రతి ఏటా పంట చేతికొచ్చే సమయంలో తుపానులు సంభవించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. 2010లో అప్పటికే పండిన వరిపంట జల్ తుఫాన్ కారణంగా రంగు మారిపోయి, ముక్కిపోవడంతో ప్రభుత్వం, వ్యాపారులు కొనగోలు చేయక జిల్లాలో రైతన్నలు రూ.13.5 కోట్లు నష్టపోయారు. అదే ఏడాది డిసెంబర్‌లో వచ్చిన తుఫాన్‌కు రూ.21 కోట్ల నష్టం సంభవించింది. 2011లో కరువు రక్కసి కాటేసింది.
 
 చాలావరకు భూమి సాగుకు నోచుకోలేదు. 2012లో నీలం తుఫాన్ ముంచేసింది. అధికారిక లెక్కల ప్రకారం రూ.4.33 కోట్లు నీటిపాలైంది. అనధికారిక లెక్కలైతే రూ.10 కోట్లకు పైమాటే. ఇక, గత ఏడాది సంభవించిన పై-లీన్, లెహెర్, అక్టోబర్‌లో వాయుగుండం, హెలెన్ తుఫాన్‌ల ధాటికి రైతాంగం కుదేలైపోయింది. అధికారిక లెక్కల ప్రకారం రూ.20 కోట్ల మేర నష్టపోయింది. ఈ విధంగా గత నాలుగేళ్లలో సుమారు రూ.60 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లింది. ఆ పంటల మదుపు కోసం తీసుకున్న కోట్లాది రూపాయల అప్పులు పేరుకుపోయాయి. అటు బ్యాంకుల్లో వడ్డీ పెరిగిపోగా, ఇటు ప్రైవేటు వ్యక్తుల వద్ద వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. ప్రతి ఏటా నష్టాలు వస్తుండడంతో అప్పుల నుంచి గట్టెక్కలేకపోతున్నారు. కొందరైతే తిండి గింజలకు కూడా నోచుకోలేకపోతున్నారు.
 
  రుణమాఫీపై ఎన్నో ఆశలు..
 వరుస నష్టాలతో కుదేలైన రైతన్నలు చంద్రబాబు ప్రకటించిన రుణ మాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చారంటే రుణ మాఫీయే కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొంతైనా ఉపశమనం పొందుతామన్న ఆలోచనతో రైతన్నలు అధికారాన్ని కట్టబెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తప్పించుకునే ధోరణి ప్రదర్శించడంపై ఆందోళన చెందుతున్నారు. మాఫీ చేయలేదు సరికదా కొత్తగా రుణాలు అడిగేందుకు వెళ్తే పాత వాటిని చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామంటూ బ్యాంకర్లు చెప్పడంతో మరింత దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2లక్షల 67వేల మంది రైతులు రూ.1462 కోట్ల మేరకు బ్యాంకులకు బకాయి పడి ఉన్నారు. అందులో లక్షా 82 వేల మంది రైతులు సుమారు రూ.730 కోట్ల మేరకు నేరుగా వ్యవసాయ రుణాలు తీసుకోగా, 55 వేల మంది బంగారు ఆభరణాలు కుదవబెట్టి రూ.432 కోట్లు తీసుకున్నారు. మరో 30 వేల మంది రూ.300 కోట్ల వ్యవసాయ సంబంధిత రుణాలు తీసుకున్నారు.ఇవన్నీ మాఫీ చేస్తేనే బ్యాంకులు కొత్తగా రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే, రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి గాని, ఆర్‌బీఐ నుంచి గాని ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో బ్యాంకర్లు రైతు రుణాల ఊసే ఎత్తడం లేదు.
 
 వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతన్నలు..
 అటు ప్రభుత్వం స్పందించక, ఇటు బ్యాంకర్లు ఆసక్తి చూపక రైతన్నల పరిస్థితి దయనీయంగా తయారైంది. సాగుకు సన్నద్ధం కావాల్సిన సమయంలో మదుపులు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తప్పని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చెప్పినంత వడ్డీకి రుణాలు తీసుకుని వ్యవసాయ మదుపులు పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. రూ.3 నుంచి రూ.10 వరకు వడ్డీకి తీసుకుంటున్నారు. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటే  ఆ సంతకం రైతుకు మరణశాసనం అవుతుంది. ఈ సంగతి తెలిసినా వేరే గంత్యరం లేక రైతులు ఆ ఊబిలోకి దిగుతున్నారు. రుణమాఫీ తమ పాలిట శాపంగా మారిందని, అటు రుణం మాపీకాకపోగా, ఇటు బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వక తమ పరిస్థితి దుర్భంగా మారిందని రైతులు వాపోతున్నారు.   
 
 అప్పులు చేయడం తప్పలేదు
 నాకు రెండు ఎకరాల పొలం ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు బ్యాంక్‌లు ఇంతవరకు రుణం ఇవ్వలేదు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పంటల మదుపులకు ప్రైవేటు వ్యక్తుల వద్ద వడ్డీకి అప్పులు వాడాల్సి వస్తోంది.  నూటికి రెండు రూపాయల చొప్పున రూ.మూడు వేలను వడ్డీకి తీసుకున్నాను. ప్రభుత్వం పాత రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఎంతో సంతోషించాం. కానీ పాత రుణాలు మాఫీ చేయలేదు. ఇంతవరకు బ్యాంక్‌ల నుంచి కొత్త రుణాలు ఇప్పించలేదు. దీంతో పంటల మదుపులకు అప్పులు చేయాల్సి వస్తోంది.
   -   పాతినవలస సూర్యారావు,
 రైతు, రంగప్పవలస, తెర్లాం మండలం
 
 అప్పుల బాధ తప్పలేదు
 నాకు మూడు ఎకరాలుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసే సమయం వచ్చింది. బ్యాంకులు ఇంతవరకు ఖరీఫ్ రుణాలు ఇవ్వలేదు. దీంతో పంట మదుపుల కోసం నూటికి మూడు రూపాయలు చొప్పున వడ్డీకి అప్పు తెచ్చుకుంటున్నాను. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని ప్రకటించినా ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో వడ్డీలకు అప్పులు తెచ్చుకోక తప్పడంలేదు.
 - బూరాడ తవిటినాయుడు,
  రైతు, లింగాపురం, తెర్లాం మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement