అయోమయం | confusion in farmers loan waivers | Sakshi
Sakshi News home page

అయోమయం

Published Mon, Dec 1 2014 4:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అయోమయం - Sakshi

అయోమయం

- రైతు రుణమాఫీలో గందరగోళం
- ఖాతాలకు సొమ్ములు ఉత్తిదే
- ధ్రువీకరించని 3.08 లక్షల ఖాతాలలో 70వేలే పరిశీలన

కడప అగ్రికల్చర్ : రుణమాఫీ విషయంలో  ప్రభుత్వం అంతా రహస్యంగానే ఉంచుతుండటంతో రైతుల్లో అయోమయం నెలకొంది.  అర్హుల జాబితా  చేరిందని చెప్పడంతో మండల కేంద్రాల్లోని బ్యాంకుల వద్దకు రైతులు పరుగులు తీశారు.  తుది జాబితా రాలేదని బ్యాంకర్లు చెబుతుండటంతో  ఉసూరుమన్నారు.  ఆర్థిక శాఖ అధికారులు జిల్లాలో 3,08,380 మంది ఖాతాలకు సంబంధించిన వివరాలలో తేడాలు ఉన్నాయని మండల రెవిన్యూ అధికారులకు నేరుగా ఆన్‌లైన్‌లో జాబితాను పంపించినా ఇంత వరకు 70 వేల మంది ఖాతాలను మాత్రమే పరిశీలించి సరిచేశారు.

జపాన్ పర్యటన నుంచి సీఎం  తిరిగిరాగానే ఖాతాలలో మాఫీ సొమ్ములు పడతాయని చెప్పినా ఇంకా తుది రూపం రాకపోవడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా మండలాల్లో  రుణమాఫీకి సంబంధించిన పరిశీలన పూర్తి కాలేదు.  ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ చేసి తీరుతామని ఢంకా బజాయించి చెబుతున్నా  క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేదు. కేవలం మసిపూసి మారేడు కాయచేసేందుకే ఈ హంగామా అంతా అని రైతు సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి.
 
స్కేల్ ఆప్ ఫైనాన్స్ అంటూ  కొత్త బాణీ ..
ఏదో ఒక వంక  పెట్టి రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తే రైతులు  బ్యాంకులకు రుణాలు  చెల్లిస్తారనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి. రుణమాఫీపై ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా గట్టిగానే పట్టుపడుతుండటంతో పంటల సాగులో జిల్లా బ్యాంకర్ల కమిటీ ప్రతిపాదించిన స్కేల్ ఆప్ ఫైనాన్స్ ప్రాతిపదికన  రుణమాఫీ చేయాలనే నిర్ణయానికి  ప్రభుత్వం వచ్చి కుట్రపన్నుతున్నట్లు సమాచారం. అదే నిజమైతే రైతులకు రుణమాఫీలో భారీగా గండిపడే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా పంటల సాగు కోసం భూములు, బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి 5,50,513 మంది రైతులు రుణాన్ని తీసుకున్నారు.

ఇందులో ఆధార్, రేషన్‌కార్డులకు ముడిపెట్టి 3,08,377 ఖాతాలను ప్రభుత్వం తిరస్కరించింది. జిల్లాలో రేషన్‌కార్డులు లేని రైతులు 41,365 మంది, ఆధార్‌కార్డులు లేనివారు  14,291 మంది, ఆధార్, రేషన్ కార్డులు లేని 85,104 ఖాతాలు, ఆధార్ ఉండి కూడా ఆన్‌లైన్ ధుృవీకరించనివి 1,67,617  ఖాతాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం జిల్లాలోని ఏపీజీబీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఇతర బ్యాంకులు కలిపి  3,08,377 ఖాతాలకుగాను ఇప్పటి వరకు 70,452 ఖాతాలను మాత్రమే సరిచేశారు.
 
ప్రాధమిక సహకార పరపతి సంఘ బ్యాంకులకు జాబితా...
జిల్లాలోని ప్రాధమిక సహకార పరపతి సంఘాల బ్యాంకులకు  మాత్రం పరిశీలన జాబితా వచ్చిందని, ఇది తుది జాబితా కాదని ఆ బ్యాంకు ఇన్ చార్జ్ ఛీప్ మేనేజరు విజయ భాస్కరరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో పంట రుణం తీసుకున్నవారు 72828 మంది కాగా ఇందులో ఆధార్,రేషన్‌కార్డు సమర్పించిన వారు 58127 మంది ఉన్నారు. ఈ ఖాతాలలో మొదటి జాబితాలో 43200 మంది పేర్లు వచ్చాయి. మిగిలిన వారి పేర్లు కూడా వస్తాయని చెబుతున్నా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.  అర్హుల జాబితా వస్తే ఆ తరువాతి ఖాతాల సంగతేమిటని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. బ్యాంకులకు తుది జాబితా పంపామని ఒక పక్క ప్రభుత్వం చెబుతున్నా  అలాంటిదేమీ లేదని  బ్యాంకర్లు చెబుతుండడంతో రైతులు  అయోమయానికి గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement