* రూ.50 వేలు పూర్తి రద్దు అబద్ధమే
* స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ మెలిక
* దిక్కుతోచని అన్నదాత
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రైతు రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. రూ.50 వేలు లోపు ఉన్న రుణాలన్నీ పూర్తిగా రద్దవుతాయని ప్రభుత్వం ప్రకటన చేయగా, ఆచరణలోకి వచ్చేసరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మెలిక పెట్టి అందులోనూ కోత పెట్టారు. జిల్లాలో రుణమాఫీ ఎంత జరిగిందనేది కూడా అధికారులకు తెలియదు. లీడ్‌బ్యాంకు మేనేజర్‌ను ఏది అడిగినా తెలియదనే సమాధానమే చెబుతున్నారు. ఇతర బ్యాంకుల మేనేజర్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో సేకరించిన వివరాలను పరిశీలిస్తే...
రూ.50 వేల లోపు 20 శాతమే మాఫీ...
గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో 823 మంది రైతులు రూ.3 కోట్ల 28 లక్షల 62 వేల 856 రుణాలుగా పొందారు. అందులో 377 మందికి తాజాగా రుణమాఫీ అయినట్లు జాబితాలో వచ్చింది. అందులో 205 మాత్రం రూ.50 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. వారిలో కూడా 172 మందికి 20 శాతమే రుణమాఫీ జరగడంతో ఆందోళనకు గురవుతున్నారు.
పీఏసీఎస్‌లో రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులు 470 మంది ఉన్నారు. ఈ లెక్కన మరో 265 మందికి రూ.50 వేల లోపు రుణమాఫీ జరగాల్సి ఉంది. వారి పరిస్థితి ఏమిటనేది స్పష్టత లేదు. గుడివాడ ఎస్‌బీఐ మెయిన్‌బ్రాంచ్‌లో డిసెంబర్ 2013 వరకు రుణాలు తీసుకున్నవారి సంఖ్య 920. వారిలో మొదటి జాబితాలో అర్హులైనవారు 265 మంది. రూ.50 వేల లోపు 230 మందికి మాఫీ అవుతున్నట్లు బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మిగతా 35 మంది రైతులకు 20 శాతం చొప్పున రూ.6 లక్షల మాఫీ వచ్చింది.
నందివాడ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో 3,200 మంది వివిధ రకాల రుణాలు రూ.19కోట్లు పొందారు. మొదటి విడత జాబితాలో 725 కుటుంబాలకు మాత్రమే రుణమాఫీ వచ్చింది. బ్యాంక్ పరిధిలో రూ.50 వేలలోపు రుణాలు పొందినవారు 1500 మంది వరకు ఉన్నారు. వీరిలో 20 శాతం మందికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కాలేదు. దీంతోపాటు బంగారం రుణాలు పొందినవారిలో 90 శాతం మందికి రుణమాఫీ వర్తించలేదు.
రుణం రూ.20 వేలు.. చూపుతోంది రూ.56 వేలు
బ్యాంకులో పంట రుణం కింద తీసుకున్న రుణం రూ.20 వేలు అయితే.. రుణమాఫీ జాబితాలో రూ.56 వేలుగా చూపడం ఓ రైతు కుటుంబాన్ని విస్తుపోయేలా చేసింది. కోడూరు మండలం లింగారెడ్డిపాలేనికి చెందిన చిట్టిప్రోలు మునేశ్వరమ్మ 2011 సెప్టెంబర్ 14న కోడూరు స్టేట్‌బ్యాంకులో తన ఎకరం 40 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాన్ని కుదవపెట్టి రూ.20 వేలు పంట రుణం తీసుకున్నారు.
అప్పటి నుంచి పంటలు సరిగ్గా పండక తీసుకున్న రుణాన్ని బ్యాంకుకు జమ చేయలేకపోయారు. ఈలోపు ఎన్నికలు రావడం, చంద్రబాబు రుణమాఫీ ప్రకటన చేయడంతో రుణం చెల్లించలేదు. ప్రస్తుతం ఈ రుణం వడ్డీతో కలిపి రూ.30,500 అయింది. ఈ ఏడాది అక్టోబరులో పంట సాగు కోసం అదే బ్యాంకులో బంగారం కుదవపెట్టి మరోసారి రూ.35 వేలు రుణం పొందారు. ఈ నెల ఆరోతేదీన రూ.50 వేల లోపు ఉన్న పంట రుణాలు మొత్తం ఒక్కసారే మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటన విడుదల చేయడంతో మునేశ్వరమ్మ కుటుంబసభ్యులు ముందుగా తీసుకున్న తమ రుణం రూ.20 వేలు వడ్డీ సహా మాఫీ అయిపోతుందని భావించారు.
ఈ నెల ఎనిమిదిన ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో 2013లో తీసుకున్న రుణం రూ.56 వేలు అని, అందులో మొదటి విడత కింద రూ.5,194 మాఫీ అవుతుందని చూపించింది. దీంతో కంగుతిన్న మునేశ్వరమ్మ కుటుంబసభ్యులు స్థానిక బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించగా, ‘మీరు తీసుకున్న అప్పు మొత్తం మాఫీ కాదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద కొంత మొత్తమే వర్తిస్తుంది. గడువు మీరిన నేపథ్యంలో మిగతా సొమ్ము వెంటనే చెల్లించని పక్షంలో ఈ ఏడాది పంట రుణం కింద కుదవపెట్టిన బంగారాన్ని వేలం వేస్తాం’ అంటూ బ్యాంక్ మేనేజర్ చెప్పారని మునేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2011లో రూ.20 వేలు రుణం తీసుకోగా.. 2013లో రూ.56 వేలు రుణం తీసుకున్నట్లుగా పేర్కొనడమే పొరపాటు కాగా, ఇందులో రుణమాఫీ కింద పోగా మిగిలిన మొత్తానికి ఈ ఏడాది తీసుకున్న రుణానికి సంబంధించిన బంగారాన్ని వేలం వేసి జమ చేస్తామని చెప్పడమేమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ముందుగా తీసుకున్న రుణం వరకే నమోదై ఉంటే వడ్డీతో కలిపి రూ.30,500 సొమ్ము మాఫీ కావాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాంకు అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇది బ్యాంక్ అధికారుల పొరపాటా? లేక ప్రభుత్వం రుణమాఫీ ఎగవేతకు పన్నిన వ్యూహమా? అనేది బ్యాంకు అధికారులకు, ప్రభుత్వానికే తెలియాలి.
మాఫీ మాయలు!
Published Mon, Dec 15 2014 2:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement