Lead Bank
-
కొత్త జిల్లాలకు లీడ్ బ్యాంకుల కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లీడ్ బ్యాంకులను కేటాయించింది. వీటికి లీడ్ జిల్లా మేనేజర్లను నియమించాల్సిందిగా ఆర్బీఐ ఆదేశించింది. జిల్లాల వారీగా ఆయా లీడ్ జిల్లా మేనేజర్లకు ప్రత్యేకంగా కార్యాలయాలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరింది. ఈ మేనేజర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, కార్యక్రమాల అమలు, వాటి సమన్వయ బాధ్యతను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ కార్యాలయాలకు అవసరమైన నైపుణ్య సిబ్బందితో పాటు కంప్యూటర్లను ఏర్పాటుచేయాలని ఇటీవల బ్యాంకర్ల సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆయా బ్యాంకులకు సూచించింది. నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని లీడ్ జిల్లా మేనేజర్లుగా నియమించాలని కోరింది. నైపుణ్య సిబ్బంది కొరత ఉంటే ఆ సేవలను బయట నుంచి పొందడానికి అనుమతిస్తున్నట్లు కమిటీ పేర్కొంది. జిల్లాల్లో వివిధ బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాలపై అవగాహన నిమిత్తం సమావేశాలు నిర్వహించేందుకు, వాటికి హాజరయ్యేందుకు వీలుగా లీడ్ జిల్లా మేనేజర్లకు ప్రత్యేకంగా వాహనాలూ సమకూర్చాల్సిందిగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సూచించింది. -
‘పేదోళ్లకు అన్యాయం చేస్తున్న బ్యాంకర్లు’
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు పేదోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ ఆందోళన వ్యక్తం చేశారు. దానికి తోడు కొందరు బ్యాంకర్లు అనుసరిస్తున్న వైఖరి మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందన్నారు. మంగళవారం స్థానిక లీడ్‌బ్యాంకు మేనేజర్ (ఎల్డీఎం) కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో జగదీష్ పాల్గొన్నారు. అధికార పార్టీకి చెందిన నేతలతో కొందరు బ్యాంకర్లు కుమ్మక్కై రూ.50, 100 నోట్లు యథేచ్చగా సరఫరా చేస్తున్నారని జగదీష్ విమర్శించారు. బ్యాంకులు, ఏటీఎం దగ్గర క్యూలైన్లలో సంపన్నవర్గాలు కనిపించడం లేదని గుర్తు చేశారు. నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం తన భాగస్వామ్య పార్టీలకు ముందే చేరవేయడంతో అంతా సర్దుబాటు చేసుకున్నారని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని తాను లేఖ రాసినందునే రద్దు చేశారని చెప్పిన చంద్రబాబు... ప్రజలు రోడ్ల మీదకు రావడంతో ఇలాంటి పరిస్థితిని ఎపుడూ చూడలేదంటూ ఇపుడు మాట మార్చారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా తక్షణ చర్యలు చేపట్టకపోతే బ్యాంకులను ముట్టడించి పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు జే.రాజారెడ్డి, నాయకులు ఎన్.శ్రీరాములు, నారాయణస్వామి, సుందర్రాజు, రామయ్య, పి.బాలయ్య, ఈశ్వరయ్య, వరలక్ష్మి, ఆశాబీ, ఖుర్షిదా, జయలక్ష్మి, కేశవ్, జమీర్, సంతోష్, ప్రసాద్,మున్నా తదితరులు పాల్గొన్నారు. -
ఆర్బీఐ నుంచి శ్రీకాకుళంకు రూ. 200 కోట్లు
శ్రీకాకుళం టౌన్: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి శ్రీకాకుళం జిల్లాకు 200 కోట్ల రూపాయలు శుక్రవారం విడుదల అయ్యాయని జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ మేనేజరు రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బ్యాంకుల్లో డబ్బుల్లేక 15 రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆర్బీఐ నుంచి రూ. 200 కోట్లు విడుదల కావడంతో సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంకుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 281 వివిధ బ్యాంకుశాఖలతోపాటు 240 ఏటీఎం సెంటర్లకు నగదు బదిలీ చేస్తున్నట్టు చెప్పారు. -
మాఫీ మాయలు!
* రూ.50 వేలు పూర్తి రద్దు అబద్ధమే * స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ మెలిక * దిక్కుతోచని అన్నదాత సాక్షి ప్రతినిధి, విజయవాడ : రైతు రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. రూ.50 వేలు లోపు ఉన్న రుణాలన్నీ పూర్తిగా రద్దవుతాయని ప్రభుత్వం ప్రకటన చేయగా, ఆచరణలోకి వచ్చేసరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మెలిక పెట్టి అందులోనూ కోత పెట్టారు. జిల్లాలో రుణమాఫీ ఎంత జరిగిందనేది కూడా అధికారులకు తెలియదు. లీడ్‌బ్యాంకు మేనేజర్‌ను ఏది అడిగినా తెలియదనే సమాధానమే చెబుతున్నారు. ఇతర బ్యాంకుల మేనేజర్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో సేకరించిన వివరాలను పరిశీలిస్తే... రూ.50 వేల లోపు 20 శాతమే మాఫీ... గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో 823 మంది రైతులు రూ.3 కోట్ల 28 లక్షల 62 వేల 856 రుణాలుగా పొందారు. అందులో 377 మందికి తాజాగా రుణమాఫీ అయినట్లు జాబితాలో వచ్చింది. అందులో 205 మాత్రం రూ.50 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. వారిలో కూడా 172 మందికి 20 శాతమే రుణమాఫీ జరగడంతో ఆందోళనకు గురవుతున్నారు. పీఏసీఎస్‌లో రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులు 470 మంది ఉన్నారు. ఈ లెక్కన మరో 265 మందికి రూ.50 వేల లోపు రుణమాఫీ జరగాల్సి ఉంది. వారి పరిస్థితి ఏమిటనేది స్పష్టత లేదు. గుడివాడ ఎస్బీఐ మెయిన్‌బ్రాంచ్‌లో డిసెంబర్ 2013 వరకు రుణాలు తీసుకున్నవారి సంఖ్య 920. వారిలో మొదటి జాబితాలో అర్హులైనవారు 265 మంది. రూ.50 వేల లోపు 230 మందికి మాఫీ అవుతున్నట్లు బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మిగతా 35 మంది రైతులకు 20 శాతం చొప్పున రూ.6 లక్షల మాఫీ వచ్చింది. నందివాడ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో 3,200 మంది వివిధ రకాల రుణాలు రూ.19కోట్లు పొందారు. మొదటి విడత జాబితాలో 725 కుటుంబాలకు మాత్రమే రుణమాఫీ వచ్చింది. బ్యాంక్ పరిధిలో రూ.50 వేలలోపు రుణాలు పొందినవారు 1500 మంది వరకు ఉన్నారు. వీరిలో 20 శాతం మందికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కాలేదు. దీంతోపాటు బంగారం రుణాలు పొందినవారిలో 90 శాతం మందికి రుణమాఫీ వర్తించలేదు. రుణం రూ.20 వేలు.. చూపుతోంది రూ.56 వేలు బ్యాంకులో పంట రుణం కింద తీసుకున్న రుణం రూ.20 వేలు అయితే.. రుణమాఫీ జాబితాలో రూ.56 వేలుగా చూపడం ఓ రైతు కుటుంబాన్ని విస్తుపోయేలా చేసింది. కోడూరు మండలం లింగారెడ్డిపాలేనికి చెందిన చిట్టిప్రోలు మునేశ్వరమ్మ 2011 సెప్టెంబర్ 14న కోడూరు స్టేట్‌బ్యాంకులో తన ఎకరం 40 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాన్ని కుదవపెట్టి రూ.20 వేలు పంట రుణం తీసుకున్నారు. అప్పటి నుంచి పంటలు సరిగ్గా పండక తీసుకున్న రుణాన్ని బ్యాంకుకు జమ చేయలేకపోయారు. ఈలోపు ఎన్నికలు రావడం, చంద్రబాబు రుణమాఫీ ప్రకటన చేయడంతో రుణం చెల్లించలేదు. ప్రస్తుతం ఈ రుణం వడ్డీతో కలిపి రూ.30,500 అయింది. ఈ ఏడాది అక్టోబరులో పంట సాగు కోసం అదే బ్యాంకులో బంగారం కుదవపెట్టి మరోసారి రూ.35 వేలు రుణం పొందారు. ఈ నెల ఆరోతేదీన రూ.50 వేల లోపు ఉన్న పంట రుణాలు మొత్తం ఒక్కసారే మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటన విడుదల చేయడంతో మునేశ్వరమ్మ కుటుంబసభ్యులు ముందుగా తీసుకున్న తమ రుణం రూ.20 వేలు వడ్డీ సహా మాఫీ అయిపోతుందని భావించారు. ఈ నెల ఎనిమిదిన ఆన్లైన్లో విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో 2013లో తీసుకున్న రుణం రూ.56 వేలు అని, అందులో మొదటి విడత కింద రూ.5,194 మాఫీ అవుతుందని చూపించింది. దీంతో కంగుతిన్న మునేశ్వరమ్మ కుటుంబసభ్యులు స్థానిక బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించగా, ‘మీరు తీసుకున్న అప్పు మొత్తం మాఫీ కాదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద కొంత మొత్తమే వర్తిస్తుంది. గడువు మీరిన నేపథ్యంలో మిగతా సొమ్ము వెంటనే చెల్లించని పక్షంలో ఈ ఏడాది పంట రుణం కింద కుదవపెట్టిన బంగారాన్ని వేలం వేస్తాం’ అంటూ బ్యాంక్ మేనేజర్ చెప్పారని మునేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011లో రూ.20 వేలు రుణం తీసుకోగా.. 2013లో రూ.56 వేలు రుణం తీసుకున్నట్లుగా పేర్కొనడమే పొరపాటు కాగా, ఇందులో రుణమాఫీ కింద పోగా మిగిలిన మొత్తానికి ఈ ఏడాది తీసుకున్న రుణానికి సంబంధించిన బంగారాన్ని వేలం వేసి జమ చేస్తామని చెప్పడమేమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ముందుగా తీసుకున్న రుణం వరకే నమోదై ఉంటే వడ్డీతో కలిపి రూ.30,500 సొమ్ము మాఫీ కావాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాంకు అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇది బ్యాంక్ అధికారుల పొరపాటా? లేక ప్రభుత్వం రుణమాఫీ ఎగవేతకు పన్నిన వ్యూహమా? అనేది బ్యాంకు అధికారులకు, ప్రభుత్వానికే తెలియాలి. -
దా'రుణం'
స్పష్టం చేస్తున్న బ్యాంకర్లు ఖరీఫ్‌కు రుణాలు కష్టమే రీషెడ్యూల్ అయితే 12 శాతం వడ్డీ భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణమాఫీ ప్రకటన టీడీపీ అసమర్థ పాలనకు అద్దం పడుతోంది. హామీని నమ్ముకొని కట్టాల్సిన రుణం చెల్లించకుండా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వేలాది మంది కర్షకుల్లో అయోమయ పరిస్థితి నెలకుంది. పూర్తిగా రద్దు చేస్తాం ... రుణాలు కట్టవద్దంటూ పిలుపు ఇచ్చిన చంద్రబాబు.. నెల తిరక్కుండానే మాట మార్చి కుటుంబానికి లక్షన్నర రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పంట రుణం అయినా, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలైనా లక్షన్నర దాటితే మిగిలిన మొత్తం రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుందని తేల్చేయడంతో వడ్డీ భారం తలచుకొని రైతులు మరింత గందరగోళానికి గురవుతున్నారు. సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: రైతు రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి లీడ్‌బ్యాంక్‌కు ఇప్పటి వరకూ ఆదేశాలు రాలేదు. ఎప్పుడు వస్తాయన్న అంశంపై తమకు స్పష్టత లేదని చెబుతున్నారు. రుణమాఫీ, రీషెడ్యూల్ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని అప్పటి వరకూ కొత్త రుణాలు ఇచ్చే అవకాశాలు కనపడటం లేదంటున్నారు. లక్షన్నర రుణం మాఫీకి సంబంధించి ఇప్పటి వరకూ రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకర్లకు సమాచారం లేదు. రుణాలు చెల్లించాల్సిన కాలపరిమితి దాటిపోతే 12.5 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం రాలేదు. లక్ష రూపాయల వరకూ రుణ మాఫీ అవుతుందని చెబుతున్నారు. దీనిపై కూడా స్పష్టత లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. అయోమయం... జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా... ఇందులో కౌలురైతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరిలో 5 లక్షల మంది రైతులు బ్యాంకు అకౌంట్లు కలిగి.. వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంటరుణాలు తీసుకున్నారు. గత ఏడాది ప్రకాశం జిల్లాలో రైతులకు 5,800 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది రూ.4,100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా పంపిణీ చేయలేదు. బ్యాంకులలో వ్యవసాయ రుణాలురూ. 6,900 కోట్ల వరకూ ఉన్నాయి. ఇందులో రుణమాఫీ కింద ఎంత వరకు మాఫీ అవుతాయి, ఇంకా ఎంత చెల్లించాలనే దానిపై స్పష్టత లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పెదవి విరుపు డ్వాక్రా సంఘాల రుణాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి నెలకుంది. డ్వాక్రా రుణాలు కూడా ఎక్కువ శాతం వ్యవసాయ రుణాలుగానే తీసుకున్నారు. లక్ష రూపాయలు, 50 వేల రూపాయల రుణం తీసుకున్న గ్రూపులకు ఈ నిర్ణయం ఊరట కలిగించినా, లక్షకు మించి రుణం తీసుకున్న గ్రూపులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సక్రమంగా రుణాలు చెల్లిస్తూ రావడం వల్లే తమకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ రుణం తీసుకునే అవకాశం వచ్చిందని ఆయా గ్రూపులు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ కచ్చితంగా చెల్లిస్తూ వచ్చిన తమకు ఈ నిర్ణయం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ పునరాలోచించాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. -
‘రుణం’తీర్చుకోండి
సాక్షి, ఒంగోలు : రుణమాఫీ అమలు కోసం రైతులు ఆవురావురమంటున్నారు. బకాయిలు వీలైనంత త్వరగా మాఫీ చేయాలని వేనోళ్ల కోరుతున్నారు. ఒకవైపు తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకర్ల ఒత్తిడి... మరో వైపు ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు అవసరమవుతున్న సమయంలో... నవ్యాంధ్రప్రదేశ్‌లో త్వరగా ప్రభుత్వం ఏర్పడితే కొత్త రుణాలు తీసుకుని సాగుకు ఉపక్రమించవచ్చనేది రైతుల ఆలోచన. రైతులు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ఊరూవాడ ఊదొరగొట్టారు. ఆయన మాటలు నమ్మిన రైతులు రుణాలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకర్లు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతవి మాఫీ అయితే, కొత్త రుణాలతో పెట్టుబడులకు ఢోకా ఉండదని కలలుగన్న రైతులకు ఏ విషయమూ తెలియకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బ్యాంకర్లు పంపుతున్న బకాయి నోటీసులకు సమాధానాలివ్వలేకపోతున్నారు. చాలామంది రైతులు ఇప్పటికే బకాయిలకు సంబంధించి వడ్డీలకు వడ్డీలు కడుతూ ఆర్థిక భారంతో కుంగిపోతున్నారు. 3 లక్షల మంది ఎదురుచూపులు జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా.. ఇందులో కౌలు రైతులు 1.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో 3 లక్షల మంది వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు. మొత్తమ్మీద వాయిదాలపై బకాయిలు రూ.3వేల కోట్లు ఉండగా, కిందటేడాది ఖరీఫ్ రుణాల కింద రూ.2,600 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. అంటే, మొత్తం రూ.5,600 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. సహకార బ్యాంకుల బకాయిల్లోకొస్తే.. జిల్లాలో పీడీసీసీబీ పరిధిలోని 29 శాఖల్లో రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తిస్తే రూ. 488.67 కోట్లు మేరకు లబ్ధి చేకూరుతోంది. మార్చి ఆఖరు వరకు ఉన్న గణాంకాల ప్రకారం బ్యాంకుల పరిధిలో స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు తీసుకున్న 85,198 మంది రైతులు మొత్తం రూ.426.48 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో గడువు మీరిన బకాయిలు రూ.93.16 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా దీర్ఘకాలిక, భూమి తనఖా, ఈపీఏడీబీ కింద మరో 15,427 మంది రైతులు రూ.63.19 కోట్లు చెల్లించాలి. పీడీసీసీబీ పరిధిలో మొత్తం రుణాల మాఫీ జరిగితే మొత్తం 1,00,625 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల మేర కే రుణమాఫీ లీడ్ బ్యాంక్ మేనేజర్ జేవీఎస్ ప్రసాద్ ప్రభుత్వం పంట రుణాల మాఫీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. ఆర్బీఐ ద్వారా బ్యాంకర్లకు ఉత్తర్వులు వస్తాయి. సాధారణంగా రైతు రుణ మాఫీ అనేది గడువు మీరిన బకాయిలకే వర్తిస్తుంది. రెగ్యులర్ ఖాతాలకు వర్తించదు. బ్యాంకర్లు బకాయిల రికవరీలకు నోటీసులు జారీ చేయడం నిత్యకృత్యమే. ప్రస్తుతం బంగారంపై తీసుకున్న రుణాల రికవరీలపై దృష్టిపెట్టారు. కిందటేడాది తీసుకున్న రుణాలు చెల్లిస్తేనే ఈ ఏడాది ఖరీఫ్‌కు కొత్త రుణం పుడుతుంది. రుణాలు మాఫీ చేయాల్సిందే: తుమ్మా వెంకటరెడ్డి, గొట్టిపడియ అధికారంలోకి రాగానే రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తానని ప్రకటించాడు. ఇచ్చిన మాట చంద్రబాబు నిలబెట్టుకోవాల్సిందే. పశ్చిమ ప్రకాశంలో చాలామంది రైతులు రుణాలు తీసుకుని పంటలు సాగు చేశారు. హామీలు నెరవేర్చాలి: ఆంజనేయరెడ్డి, జమ్మనపల్లి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రుణాలు కచ్చితంగా మాఫీ చేయాలి. రైతులందరూ రుణ మాఫీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్లోనే పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇస్తే రైతులు పంటలు సాగుచేసుకునే పరిస్థితి ఉంటుంది. ఏవో కారణాలు చూపి రుణాలు మాఫీ చేయకుంటే టీడీపీకి ఇబ్బంది తప్పదు. -
వార్షిక రుణ ప్రణాళిక రూ. 4,112 కోట్లు
- గతేడాదితో పోలిస్తే 24.69 శాతం వృద్ధి - పంట రుణ వితరణ లక్ష్యం రూ. 1,758 కోట్లు - ఖరీఫ్‌లో రూ.1,185 కోట్లు.. రబీలో రూ. 573 కోట్లు - తాజా లక్ష్యాలపై రైతుల ఆశలు సాక్షి, సంగారెడ్డి : వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. గతేడా ది వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.3,097 కోట్లు కాగా.. 24.69 శాతం పెంపుదలతో ఈ ఆర్థిక సం వత్సరంలో రూ. 4,112 కోట్ల రుణాలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి లక్ష్యం లో రూ.1,015 కోట్ల రుణ వితరణను పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,134 కోట్ల పంట రుణాలను పంపిణీ చేయాలనే టార్గెట్‌ను పెట్టుకోగా..ఈ ఏడాది లక్ష్యాన్ని రూ.1,758 కోట్లకు పెంచింది. ఖరీఫ్‌లో రూ.1,185 కోట్లు, రబీలో రూ. 573 కోట్ల రుణాలను అన్నదాతలకు పంపిణీ చేయాలని బ్యాంకర్లకు నిర్దేశించారు. ఈ మేరకు లక్ష్యాలను నిర్దేశిస్తూ లీడ్ బ్యాంక్ రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను సోమవారం కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆవిష్కరించారు. లక్ష్యాలు పెంపు.. తాజా వార్షిక ప్రణాళికలో అన్ని రంగాల రుణ లక్ష్యాల్లో భారీ వృద్ధి కనిపించింది. ప్రాధాన్యత రంగాలకు రూ. 2,737 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని గతేడాది లక్ష్యాన్ని విధించుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యాన్ని రూ.3,680 కోట్లకు పెంచారు. అంశాల వారీగా పెరిగిన లక్ష్యాలను పరిశీలిస్తే.. గతేడాది ప్రణాళికలో వ్యవసాయ కాలపరిమితి రుణ లక్ష్యం రూ.198 కోట్లు కాగా ఈ ఏడాది రూ.237 కోట్లకు పెంచారు. అదే విధంగా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రుణ లక్ష్యాన్ని రూ.126 కోట్ల నుంచి రూ.151 కోట్లకు పెంచారు. వ్యవసాయేతర రుణ లక్ష్యాన్ని రూ.252 కోట్ల నుంచి రూ.302 కోట్లకు పెంచారు. ఇతర ప్రాధాన్యత రంగాల రుణ లక్ష్యాన్ని రూ.271 కోట్ల నుంచి రూ.525 కోట్లకు పెంచారు. స్వ యం సహాక సంఘాల రుణ లక్ష్యాన్ని రూ.486 కోట్ల నుంచి రూ.583 కోట్లకు పెంచారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహ కమతాలకు రుణ లక్ష్యాన్ని రూ.270 కోట్ల నుంచి రూ.324 కోట్లకు పెంచారు. అదే విధంగా ప్రా ధాన్య యేతర రంగాల్లో గతేడాది రూ.360 కోట్ల రుణ లక్ష్యాన్ని పెట్టుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 432 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. గతేడాది లక్ష్యాలు అసంపూర్తి గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,097 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నప్పటికీ కేవలం 86 శాతం లక్ష్య ఛేదనతో 2,667 కోట్ల రుణాలను మాత్రమే పంపిణీ చేయగలిగారు. వ్యవసాయ, ఎస్‌హెచ్‌జీ రంగాలు మినహాయిస్తే ఇతర రంగాల లక్ష్యాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వరుసగా ఎన్నికలు రావడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ప్రభుత్వ ప్రోత్సాహాక పథకాలకు రుణాల పంపిణీని నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఏడాది బ్యాంకర్లు లబ్ధిదారులకు ఉదారంగా రుణాలు పంపిణీ చేయాల్సిన అవసరముంది. ప్రణాళికను విడుదల చేసిన కలెక్టర్ కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు చెందిన 2014-15 వార్షిక రుణప్రణాళికను సోమవారం కలెక్టర్ స్మితాసబర్వాల్ తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణ ప్రణాళిక ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాల్సి ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈనెల 28 లోపు ఆవిష్కరించాల్సిందిగా ఎస్ఎల్ బీసీ ఆదేశించిందన్నారు. ఈ ప్రణాళికలో పంట రుణాలను గత ఎడాది లక్ష్యంపై 50 శాతం పెంచి రూ. 1,758 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇతర రుణాల కోసం రూ.4,112 కోట్లు నిర్ణయించామన్నారు. ఆవిష్కరణలో లీడ్ బ్యాంక్ మెనేజర్ వెంకటయ్య, ఏఎల్డీఎం రఘురామ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.