‘రుణం’తీర్చుకోండి | complete your's homies first | Sakshi
Sakshi News home page

‘రుణం’తీర్చుకోండి

Published Fri, May 30 2014 1:49 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

‘రుణం’తీర్చుకోండి - Sakshi

‘రుణం’తీర్చుకోండి

 సాక్షి, ఒంగోలు : రుణమాఫీ అమలు కోసం రైతులు ఆవురావురమంటున్నారు. బకాయిలు వీలైనంత త్వరగా మాఫీ చేయాలని వేనోళ్ల కోరుతున్నారు. ఒకవైపు తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకర్ల ఒత్తిడి... మరో వైపు ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు అవసరమవుతున్న సమయంలో... నవ్యాంధ్రప్రదేశ్‌లో త్వరగా ప్రభుత్వం ఏర్పడితే కొత్త రుణాలు తీసుకుని సాగుకు ఉపక్రమించవచ్చనేది రైతుల ఆలోచన.

 రైతులు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ఊరూవాడ ఊదొరగొట్టారు. ఆయన మాటలు నమ్మిన రైతులు రుణాలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకర్లు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతవి మాఫీ అయితే, కొత్త రుణాలతో పెట్టుబడులకు ఢోకా ఉండదని కలలుగన్న రైతులకు ఏ విషయమూ తెలియకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బ్యాంకర్లు పంపుతున్న బకాయి నోటీసులకు సమాధానాలివ్వలేకపోతున్నారు. చాలామంది రైతులు ఇప్పటికే బకాయిలకు సంబంధించి వడ్డీలకు వడ్డీలు కడుతూ ఆర్థిక భారంతో కుంగిపోతున్నారు.
 
3 లక్షల మంది ఎదురుచూపులు
జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా.. ఇందులో కౌలు రైతులు 1.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో 3 లక్షల మంది వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు. మొత్తమ్మీద వాయిదాలపై బకాయిలు రూ.3వేల కోట్లు ఉండగా, కిందటేడాది ఖరీఫ్ రుణాల కింద రూ.2,600 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. అంటే, మొత్తం రూ.5,600 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది.
 
సహకార బ్యాంకుల బకాయిల్లోకొస్తే..
జిల్లాలో పీడీసీసీబీ పరిధిలోని 29 శాఖల్లో రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తిస్తే రూ. 488.67 కోట్లు మేరకు లబ్ధి చేకూరుతోంది. మార్చి ఆఖరు వరకు ఉన్న గణాంకాల ప్రకారం బ్యాంకుల పరిధిలో స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు తీసుకున్న 85,198 మంది రైతులు మొత్తం రూ.426.48 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో గడువు మీరిన బకాయిలు రూ.93.16 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా దీర్ఘకాలిక, భూమి తనఖా, ఈపీఏడీబీ కింద మరో 15,427 మంది రైతులు రూ.63.19 కోట్లు చెల్లించాలి. పీడీసీసీబీ పరిధిలో మొత్తం రుణాల మాఫీ జరిగితే మొత్తం 1,00,625 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
 
 ఆర్‌బీఐ మార్గదర్శకాల మేర కే రుణమాఫీ

 లీడ్ బ్యాంక్ మేనేజర్ జేవీఎస్ ప్రసాద్
 ప్రభుత్వం పంట రుణాల మాఫీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. ఆర్‌బీఐ ద్వారా బ్యాంకర్లకు ఉత్తర్వులు వస్తాయి. సాధారణంగా రైతు రుణ మాఫీ అనేది గడువు మీరిన బకాయిలకే వర్తిస్తుంది. రెగ్యులర్ ఖాతాలకు వర్తించదు. బ్యాంకర్లు బకాయిల రికవరీలకు నోటీసులు జారీ చేయడం నిత్యకృత్యమే. ప్రస్తుతం బంగారంపై తీసుకున్న రుణాల రికవరీలపై దృష్టిపెట్టారు. కిందటేడాది తీసుకున్న రుణాలు చెల్లిస్తేనే ఈ ఏడాది ఖరీఫ్‌కు కొత్త రుణం పుడుతుంది.
 
 రుణాలు మాఫీ చేయాల్సిందే: తుమ్మా వెంకటరెడ్డి, గొట్టిపడియ
 అధికారంలోకి రాగానే రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తానని ప్రకటించాడు. ఇచ్చిన మాట చంద్రబాబు నిలబెట్టుకోవాల్సిందే. పశ్చిమ ప్రకాశంలో చాలామంది రైతులు రుణాలు తీసుకుని పంటలు సాగు చేశారు.
 
 హామీలు నెరవేర్చాలి: ఆంజనేయరెడ్డి, జమ్మనపల్లి
 టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రుణాలు కచ్చితంగా మాఫీ చేయాలి. రైతులందరూ రుణ మాఫీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌లోనే పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇస్తే రైతులు పంటలు సాగుచేసుకునే పరిస్థితి ఉంటుంది. ఏవో కారణాలు చూపి రుణాలు మాఫీ చేయకుంటే టీడీపీకి ఇబ్బంది తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement