దా'రుణం' | Naidu announces massive loan waiver scheme | Sakshi
Sakshi News home page

దా'రుణం'

Published Fri, Jul 25 2014 4:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Naidu announces massive loan waiver scheme

  • స్పష్టం చేస్తున్న బ్యాంకర్లు
  • ఖరీఫ్‌కు రుణాలు కష్టమే
  • రీషెడ్యూల్ అయితే 12 శాతం వడ్డీ భారం
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణమాఫీ ప్రకటన టీడీపీ అసమర్థ పాలనకు అద్దం పడుతోంది. హామీని నమ్ముకొని కట్టాల్సిన రుణం చెల్లించకుండా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వేలాది మంది కర్షకుల్లో అయోమయ పరిస్థితి నెలకుంది. పూర్తిగా రద్దు చేస్తాం ... రుణాలు కట్టవద్దంటూ పిలుపు ఇచ్చిన చంద్రబాబు.. నెల తిరక్కుండానే మాట మార్చి కుటుంబానికి లక్షన్నర రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పంట రుణం అయినా, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలైనా లక్షన్నర దాటితే మిగిలిన మొత్తం రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుందని తేల్చేయడంతో వడ్డీ భారం తలచుకొని రైతులు మరింత గందరగోళానికి గురవుతున్నారు.  
     
    సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: రైతు రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి లీడ్‌బ్యాంక్‌కు ఇప్పటి వరకూ ఆదేశాలు రాలేదు. ఎప్పుడు వస్తాయన్న అంశంపై తమకు స్పష్టత లేదని చెబుతున్నారు. రుణమాఫీ, రీషెడ్యూల్ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని అప్పటి వరకూ కొత్త రుణాలు ఇచ్చే అవకాశాలు కనపడటం లేదంటున్నారు. లక్షన్నర రుణం మాఫీకి సంబంధించి ఇప్పటి వరకూ  రిజర్వు బ్యాంకు నుంచి  బ్యాంకర్లకు సమాచారం లేదు. రుణాలు చెల్లించాల్సిన కాలపరిమితి దాటిపోతే 12.5 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం రాలేదు. లక్ష రూపాయల వరకూ రుణ మాఫీ అవుతుందని చెబుతున్నారు. దీనిపై కూడా స్పష్టత లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.
     
    అయోమయం...
    జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా... ఇందులో కౌలురైతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరిలో 5 లక్షల మంది రైతులు  బ్యాంకు అకౌంట్లు కలిగి.. వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో  దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంటరుణాలు తీసుకున్నారు. గత ఏడాది ప్రకాశం జిల్లాలో రైతులకు 5,800 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది రూ.4,100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా పంపిణీ చేయలేదు. బ్యాంకులలో వ్యవసాయ రుణాలురూ. 6,900 కోట్ల వరకూ ఉన్నాయి. ఇందులో రుణమాఫీ కింద ఎంత వరకు మాఫీ అవుతాయి, ఇంకా ఎంత చెల్లించాలనే దానిపై స్పష్టత లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.
     
    పెదవి విరుపు
    డ్వాక్రా సంఘాల రుణాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి నెలకుంది. డ్వాక్రా రుణాలు కూడా ఎక్కువ శాతం వ్యవసాయ రుణాలుగానే తీసుకున్నారు. లక్ష రూపాయలు, 50 వేల రూపాయల రుణం తీసుకున్న గ్రూపులకు ఈ నిర్ణయం ఊరట కలిగించినా, లక్షకు మించి రుణం తీసుకున్న గ్రూపులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సక్రమంగా రుణాలు చెల్లిస్తూ రావడం వల్లే తమకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ రుణం తీసుకునే అవకాశం వచ్చిందని ఆయా గ్రూపులు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ కచ్చితంగా చెల్లిస్తూ వచ్చిన తమకు ఈ నిర్ణయం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ పునరాలోచించాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement