‘పేదోళ్లకు అన్యాయం చేస్తున్న బ్యాంకర్లు’
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు పేదోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ ఆందోళన వ్యక్తం చేశారు. దానికి తోడు కొందరు బ్యాంకర్లు అనుసరిస్తున్న వైఖరి మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందన్నారు. మంగళవారం స్థానిక లీడ్‌బ్యాంకు మేనేజర్ (ఎల్‌డీఎం) కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో జగదీష్ పాల్గొన్నారు. అధికార పార్టీకి చెందిన నేతలతో కొందరు బ్యాంకర్లు కుమ్మక్కై రూ.50, 100 నోట్లు యథేచ్చగా సరఫరా చేస్తున్నారని జగదీష్ విమర్శించారు. బ్యాంకులు, ఏటీఎం దగ్గర క్యూలైన్లలో సంపన్నవర్గాలు కనిపించడం లేదని గుర్తు చేశారు.
నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం తన భాగస్వామ్య పార్టీలకు ముందే చేరవేయడంతో అంతా సర్దుబాటు చేసుకున్నారని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని తాను లేఖ రాసినందునే రద్దు చేశారని చెప్పిన చంద్రబాబు... ప్రజలు రోడ్ల మీదకు రావడంతో ఇలాంటి పరిస్థితిని ఎపుడూ చూడలేదంటూ ఇపుడు మాట మార్చారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా తక్షణ చర్యలు చేపట్టకపోతే బ్యాంకులను ముట్టడించి పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు జే.రాజారెడ్డి, నాయకులు ఎన్.శ్రీరాములు, నారాయణస్వామి, సుందర్రాజు, రామయ్య, పి.బాలయ్య, ఈశ్వరయ్య, వరలక్ష్మి, ఆశాబీ, ఖుర్షిదా, జయలక్ష్మి, కేశవ్, జమీర్, సంతోష్, ప్రసాద్,మున్నా తదితరులు పాల్గొన్నారు.