అప్పుల ఆత్మహత్యలని తేలితేనే పరిహారం | Suicide debt compensation says ap cm chandra babu | Sakshi
Sakshi News home page

అప్పుల ఆత్మహత్యలని తేలితేనే పరిహారం

Published Wed, Dec 24 2014 1:34 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

అప్పుల ఆత్మహత్యలని తేలితేనే పరిహారం - Sakshi

అప్పుల ఆత్మహత్యలని తేలితేనే పరిహారం

అన్నదాతల ఆత్మహత్యలపై సీఎం చంద్రబాబు ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 93 శాతం మంది రైతులు రుణగ్రస్తులు
 
గత ప్రభుత్వాల విధానాలే రైతుల అప్పులకు కారణం
రూ. 50 వేల లోపు రుణం ఉన్న వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించదు
ఆ పైన ఉన్న రుణాలను ఐదు విడతలలో మాఫీ చేస్తాం
ఈ లోగా రీషెడ్యూల్ చేసుకుంటే 4 శాతం వడ్డీనే పడుతుంది
రుణ మాఫీ, కరువు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడే ప్రతిపక్షం..
ఎర్రచందనం, బెరైటీస్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
శాసనసభలో చర్చకు సీఎం సమాధాన ప్రసంగంలో వ్యాఖ్యలు

 
హైదరాబాద్: ఏపీలో 92.9 శాతం మంది రైతులు అప్పుల్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం చేసిన శాంపిల్ సర్వేలో తేలిందని.. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే రైతుల అప్పులకు కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు  విశ్లేషించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందిస్తామంటూనే.. అప్పుల బాధతోనే ఆత్మహత్యలకు పాల్పడినట్లు తేలితేనే సాయం అందిస్తామని షరతు విధించారు. కుటుంబ కలహాలు, ప్రేమ, మానసిక ఆందోళన.. తదితర కారణాలతో ఆత్మహత్యలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. రుణ మాఫీ, కరువు, రైతుల ఆత్మహత్యల మీద 344 నిబంధన కింద రాష్ట్ర శాసనసభలో రెండు రోజుల పాటు జరిగిన చర్చకు మంగళవారం ఆయన సమాధానం ఇచ్చారు. రుణ మాఫీలో.. రూ. 50 వేల వరకు రుణం తీసుకున్న వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించదని, ఈ రుణాలను ఒకే దఫా మాఫీ చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేసిన తర్వాత రుణ మాఫీకి అర్హత మొత్తం రూ. 50 వేల లోపు ఉంటే ఒకే దఫా చెల్లించడానికి (వన్ టైం సెటిల్‌మెంట్) ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మిగతా రుణాలను ఐదు విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. ఈలోగా రుణాలను రీషెడ్యూలు చేసుకుంటే 4 శాతం వడ్డీనే పడుతుందని, తాను 10 శాతం ఇస్తాను కాబట్టి 6 శాతం లాభం రైతులకు మిగులుతుందని లెక్కలు చెప్పారు. బీమా పరిహారాన్ని రుణ మాఫీ కింద జమ చేసుకోవడం లేదని, రైతుల ఖాతాలకే ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు రూ. 1.5 లక్షల వరకు మాఫీ చేస్తున్నామన్నారు.  

అనంతపురానికి హంద్రీ-నీవా నీళ్లు..

అనంతపురం జిల్లాలో 10 ఎకరాల వరకు బిం దు, తుంపర సేద్యానికి 90 శాతం రాయితీ ఇస్తున్నామని సీఎం చెప్పారు. గోదావరి మెట్ట ప్రాం తాల రైతులకూ ఈ రాయితీ వర్తింపజేయనున్నట్లు తెలిపారు. హంద్రీ-నీనా సుజల స్రవంతి ద్వారా ఈ ఏడాది తాను 12 టీఎంసీల నీటిని అనంతపురం జిల్లాకు తరలించానన్నారు. తుంగభద్ర హైలెవల్ కెనాల్‌కు సమాంతరంగా కొత్తగా కాలువ తవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదించానని, ఆ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు దీన్ని అప్పగించిందన్నారు. ఇది సాకారమైతే అనంతపురం జిల్లాకు నీళ్లు వస్తాయన్నారు. విద్యుత్ విషయంలో గత ప్రభుత్వాలు ఏం చేశాయనే విషయాన్ని చెప్పడానికి ఏమీ లేదని, తాను పదేళ్లకు భవిష్యత్ ప్రణాళికలు తయారు చేశానని ఘనంగా ప్రకటించారు.

తోటపల్లికి, వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే..: గోదావరిలో ఏటా 3,000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని, ఆ నీటిలో 70 టీఎంసీలను పోలవరం కుడి కాల్వ కు లిఫ్ట్ చేయడం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని చెప్పారు. ఈమేరకు కృష్ణలో మిగిలే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు విని యోగించుకుంటామన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసింది తానేనంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు తీసుకుందని విమర్శిం చారు. రుణ మాఫీ, కరవు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్షం.. ఎర్రచందనం, బెరైటీస్ గురించి ఎందుకు మా ట్లాడటం లేదని సీఎం ప్రశ్నించారు. ఆదర్శ రైతులకు వ్యవసాయం అంటే తెలీదని, అందు కే తొలగించామని బాబు పేర్కొన్నారు.
 
అక్కడ పంటలు వేయకపోతే నీళ్లు మిగులుతాయి  రాజధాని ప్రాంతంపై మండలిలో చంద్రబాబు వ్యాఖ్యలు
 
రాష్ట్ర రాజధానిని ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో అభివృద్ధి కుంటుపడుతుందనే ఉద్దేశంతో విజయవాడ - గుంటూరు మధ్యన అనువైన ప్రాంతంగా నిర్ణయించి ఎంపిక చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగు పంటలు వచ్చే భూములను తీసుకుంటే ఎలా అంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు మాట్లాడుతున్నారంటూ.. అక్కడ పంటలు వేయకపోతే నీళ్లు మిగులుతాయని, వాటిని రాయలసీమకు తరలిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఏపీ రాజ ధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లు-2014ను మంగళవారం మండలిలో ప్రవేశపెట్టారు. బిల్లులో ఉన్న అనుమానాలు, లోటుపాట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో భవిష్యత్తులో భూకంపం వస్తుందని ప్రజల్లో భ యాందోళనలు కలిగించే రీతిలో మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయ పార్టీల ప్రతిని ధుల అభిప్రాయాలు తీసుకోకుండా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారనే ఆరోపణల్లో అర్థం లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement