రుణమాయేనా? | Scale of Finance as the loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాయేనా?

Published Tue, Dec 9 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

Scale of Finance as the loan waiver

స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమాఫీ
రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చి అనేక మెలికలు
విస్తుపోతున్న రైతాంగం

 
మచిలీపట్నం : రైతు రుణాల మాఫీ ప్రక్రియలో ప్రభుత్వం అనేక గిమ్మిక్కులు చేస్తోంది. తాజాగా ఆన్‌లైన్‌లో ఉంచిన రుణమాఫీ జాబితాల్లో వివరాలను చూసిన రైతులు విస్తుపోతున్నారు. జాబితాల్లో ఆయా బ్యాంకులు, రైతుల ఖాతా నంబర్ల వారీగా ఆన్‌లైన్‌లో ఉంచారు. బ్యాంకులోని ఖాతాదారుల నంబరు, బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు నమోదు చేస్తేనే ఈ ఖాతాకు సంబంధించిన వివరాలు వెల్లడవుతున్నాయి. రూ.50 వేలకు పైబడి రుణం తీసుకుంటే సంబంధిత రైతు కుటుంబ సభ్యులు తీసుకున్న రుణం వివరాలు, వడ్డీ ఎంత అయ్యింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఎంత రుణమాఫీ జరిగే అవకాశం ఉంది వంటి వివరాలను చూపారు. ఎంత నగదు రుణమాఫీ అయ్యిందన్న కాలం వద్ద ఎలాంటి వివరాలూ చూపలేదు. దీంతో రైతుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 వివరాలు అందుబాటులో లేవు

ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రుణమాఫీ జాబితాలకు సంబంధించి స్పష్టమైన వివరాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. జిల్లాలో ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది.. ఎంత నగదు జమ చేశారు.. తదితర వివరాలు తమ వద్ద లేవని అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుతో పాటు కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ  సెంటర్ డీఐవోను, లీడ్‌బ్యాంకు మేనేజరును, వ్యవసాయశాఖ జేడీ, కేడీసీసీ బ్యాంకు సీఈవోను, ఆయా బ్యాంకు మేనేజర్లను రుణమాఫీపై వివరాలు అడిగినా తమ వద్ద లేవని చెప్పడం గమనార్హం.
 
కొలమానంతో కోత

ప్రభుత్వం 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి 2013 డిసెంబరు 31 వరకు తీసుకున్న రుణాలను రుణమాఫీ కింద పరిగణిస్తామని ప్రకటించింది. గుట్టుచప్పుడు కాకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (కొలమానం) అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ లెక్కన 2007-08లో పంట రుణం తీసుకుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఆ బకాయికి ఎకరానికి రూ.14 వేలు మాత్రమే వర్తింపజేసింది. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో 2007-08 సంవత్సరానికి సంబంధించి ఎకరానికి రూ. 14 వేలు మాత్రమే రుణమాఫీ జరుగుతుందని చూపింది. 2012-13లో తీసుకున్న రుణాలకు ఎకరానికి రూ.19 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌గా నిర్ణయించింది. వాస్తవానికి ఆ ఏడాది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.23 వేలుగా ఉంది. రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రైతుల ఆశలను వమ్ము చేస్తూ స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం రుణమాఫీ చేయడం నిలువునా మోసం చేయడమేనని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నాటి నుంచే రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని, కోటయ్య కమిటీ ఏర్పాటు దీనికి ఉదాహరణని రైతులు ఆవేదన చెందుతున్నారు.

గుండెపగిలిన అన్నదాత...

రుణమాఫీకి సంబంధించి ఆన్‌లైన్‌లో ఉంచిన జాబితాలో తన పేరు లేదనే బెంగతో గుడ్లవల్లేరు మండలం కట్టవానిచెరువుకు చెందిన అబ్ధుల్ బారీ అనే రైతు సోమవారం గుండెపోటుకు గురై మరణించడం గమనార్హం. రుణమాఫీ ద్వారా ఎంతో కొంత వెసులుబాటు లభిస్తుందని గత కొన్నిరోజులుగా పీఏసీఎస్, ఇంటర్‌నెట్ సెంటర్‌ల చుట్టూ తిరిగాడు. రుణమాఫీ జాబితాలో అతని పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పొలానికి వెళుతూ కుప్పకూలి మరణించాడు.
 .
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement