వడ్డీలకే సరిపోని బాబు కేటాయింపులు | Launches inadequate allocation of interest | Sakshi
Sakshi News home page

వడ్డీలకే సరిపోని బాబు కేటాయింపులు

Published Tue, Mar 24 2015 2:31 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

వడ్డీలకే సరిపోని బాబు కేటాయింపులు - Sakshi

వడ్డీలకే సరిపోని బాబు కేటాయింపులు

బాబు లెక్కలన్నీ  మాయాజాలమే  వడ్డీలకే రూ.13,937 కోట్లు కావాలి
చంద్రబాబు రెండు దశల్లోనూ ఇచ్చేది రూ.6,840 కోట్లు
 ఏటికేడాది అపరాధ వడ్డీల భారంతో రైతులు మరింత అప్పుల ఊబిలోకి
నాలుగేళ్లలో అసలు తీరకపోగా వడ్డీల భారం పెరుగుతుంది

 
హైదరాబాద్: రైతుల రుణాల మాఫీ సంగతి దేవుడెరుగు.. చంద్రబాబునాయుడు నిర్వాకం కారణంగా రైతులు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. తొలి దశ, రెండో దశ మాఫీ పేరుతో చంద్రబాబునాయుడు మాయాజాలం చేశారు. రుణమాఫీకి ఆయన చెల్లిస్తున్న డబ్బుతో రైతులపై ఇప్పటికే పడిన వడ్డీలో సగం కూడా మాఫీ కావడంలేదు. తొలిదశ, రెండోదశ రుణమాఫీపై సోమవారం అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రకటనే ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రెండుదశల్లో రుణమాఫీకి కేటాయించినట్లు చంద్రబాబు చెప్పిన రూ.6,840 కోట్లు.. రైతుల రుణాలపై పడిన వడ్డీ భారంలో సగం కూడా లేకపోవడం విడ్డూ రం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన అధ్యక్షతన జరిగిన 184వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలోనే 31 మార్చి 2014 నాటికి వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లని తేలింది. చంద్రబాబు రుణమాఫీ చేయని కారణంగా అసలుకు తోడు.. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ, పంటల బీమా వంటి సౌకర్యాలు పోయి రైతులపై 14 శాతం మేర అపరాధ వడ్డీ పడింది. రూ.87,612 కోట్ల మీద అపరాధ వడ్డీ కింద రూ.12,265 కోట్ల భారం పడింది. అయినా సరే గత ఏడాది సెప్టెంబర్ నాటికి కూడా చంద్రబాబు రుణమాఫీ చేయని కారణంగా ఆ వడ్డీల భారం రైతులపై మరింత పెరిగింది.

వడ్డీలతో కలిపి రుణాల మొత్తం రూ.99,555 కోట్లు

గత ఏడాది డిసెంబర్ నెలాఖరున జరిగిన 188వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రైతుల వ్యవసాయ రుణాలు ఏకంగా రూ.99,555 కోట్లకు పెరిగినట్లు బ్యాంకర్లు చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారు. అంటే 99,555 కోట్ల రూపాయలు కొత్తగా రుణాలు ఇవ్వడం వల్ల కాకుండా వడ్డీల భారంతో మొత్తం పెరిగింది. రూ.99,555 కోట్ల మీద 14 శాతం వడ్డీ లెక్కకడితే రూ.13,937 కోట్లను వడ్డీల కిందే రైతుల చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మాఫీ పేరుతో చంద్రబాబు స్వయంగా అసెంబ్లీ వేదికగా చెప్పిన లెక్కల ప్రకారం రెండు విడుతల్లో చెల్లిస్తున్నది కేవలం రూ.6,840 కోట్లు మాత్రమే. అంటే వడ్డీలో సగం కూడా నిధులు కేటాయించకుండా చంద్రబాబు రైతులను రుణ విముక్తులను చేస్తామంటూ గంభీరంగా ప్రసంగం చేశారు. ఇలా ఏడాదికోసారి అరకొర నిధులను వడ్డీలకే సరిపోకుండా ఇస్తూ నాలుగేళ్ల పాటు రుణమాఫీని సాగతీయడం వల్ల రైతులు వచ్చే నాలుగేళ్ల పాటు వడ్డీ లేని రుణాలను, పావలా వడ్డీని, పంటల బీమాను కోల్పోనున్నారు. ఇప్పటికే గత ఖరీఫ్, రబీలో వడ్డీ లేని రుణాలను, పావలా వడ్డీ రుణాలను కోల్పోయి ఏకంగా అపరాధ వడ్డీతో 14 శాతం వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. చంద్రబాబు సర్కారు వడ్డీలకు సరిపడ మాఫీ కూడా చేయకపోవడంతో వడ్డీల భారం ఏటా పెరుగుతూ రైతుల్ని మరింత అప్పులు ఊబిలోకి నెట్టేసే పరిస్థితి నెలకొంది. రైతుల రుణాలను ప్రభుత్వం పూర్తిగా తీరిస్తే లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం, మూడు లక్షల రూపాయల వరకు పావలా వడ్డీకి రుణం పుట్టేది. అయితే చంద్రబాబు నిర్వాకం కారణంగా గడిచిన  ఖరీఫ్, రబీయే కాదు.. వచ్చే నాలుగేళ్ల పాటు బ్యాంకుల నుంచి రుణం పుట్టే అవకాశం లేదు. ప్రస్తుతం రైతులను వడ్డీ వ్యాపారుల బారిన పడేసిన బాబు వచ్చే నాలుగేళ్ల పాటు కూడా వారు ఆ వ్యాపారుల కబంధహస్తాల్లో నలిగిపోయే పరిస్థితి కల్పించారు.
 
ఖాతాల ఏరివేతే లక్ష్యంగా..

తొలిదశలోను, రెండో దశలోను ఆంక్షల పేరుతో వీలైనన్ని రైతుల రుణ ఖాతాలను ఏరివేయడమే లక్ష్యంగా సర్కారు పనిచేసింది. బ్యాంకర్లు రైతుల రుణాలకు సంబంధించి మొత్తం 82.66 లక్షల ఖాతాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగా తొలిదశ, రెండోదశలో కలిపి వడపోత తరువాత కేవలం 51.45 లక్షల ఖాతాలనే పరిగణనలోకి తీసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మిగిలిన 31.21 లక్షల రైతుల ఖాతాలను రుణమాఫీకి అనర్హమైనవని తిరస్కరించారు. అంతేకాకుండా రెండోదశలో బాబు సర్కారు చేసిన మాయ అంతా ఇంతా కాదు. రెండో దశలో మొత్తం 42.23 లక్షల ఖాతాలను వడపోసి కేవలం 11.02 లక్షల ఖాతాలనే పరిగణనలోకి తీసుకున్నారు. అంటే 31.21 లక్షల ఖాతాలను తిరస్కరించారు. 11.02 లక్షల ఖాతాలకు చెందిన రైతులను కుటుంబాల యూనిట్‌గా చేసి 6.42 లక్షల కుటుంబాలే అర్హమైనవిగా తేల్చారు. తొలిదశలో 26.77 లక్షల కుటుంబాలకు, రెండోదశలో 6.42 లక్షల కుటుంబాలు కలిపి 33.19 లక్షల కుటుంబాల ఖాతాలకే అరకొర రుణమాఫీని పరిమితం చేశారు. తద్వారా రైతులు తీసుకున్న రుణాల్లో రుణమాఫీని ఒక వంతుకన్నా తక్కువకే చంద్రబాబు సర్కారు పరిమితం చేసినట్లయింది. రెండోదశలో రుణమాఫీ కింద 20 శాతం కోసం కేవలం 2,176 కోట్ల రూపాయలు సరిపోతాయని లెక్కగట్టారు. రుణమాఫీ ఖాతాల సంఖ్య ఏ విధంగా తగ్గించారో ఒకసారి పరిశీలిస్తే బాబు మాయాజాలం అర్థం అవుతుంది.
 
రుణమాఫీలో చంద్రబాబు మాయాజాలం

 
తొలిదశలో మాఫీ పేరుతో మాయచేసిన చంద్రబాబు ఇప్పుడు రెండోదశ పేరుతో మొత్తం రుణమాఫీలో తిమ్మినిబమ్మిని చేస్తూ లెక్కల మాయాజాలం చేశారు. ఫలితంగా రైతులు అప్పులు, అపరాధ వడ్డీల భారంతో కుంగిపోవడం తప్ప చేసేదేమీ లేదని అసెంబ్లీలో చేసిన ప్రకటన ద్వారా సీఎం పరోక్షంగా స్పష్టం చేశారు. వచ్చే నాలుగేళ్లలో వడ్డీలతో కలిపి రైతుల రుణాల కింద రూ.18,480 కోట్లు చెల్లించనున్నట్లు ఆయన చెప్పారు. రూ.99,555 కోట్లలో వచ్చే నాలుగేళ్లలో చంద్రబాబు వడ్డీలతో కలిపి చెల్లిస్తానన్న రూ.18,480 కోట్లు పోగా ఇంకా రైతుల పేరుమీద ఇప్పటి వరకు చూస్తే రూ.81,075 కోట్ల రుణాలుంటాయి. రూ.81,075 కోట్లను ఇకనుంచి పడే అపరాధ వడ్డీలతో సహా ఆయా రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడంతో రైతులు రుణ విముక్తికి బదులు రుణాల ఉచ్చులో కూరుకుపోయారు.
 
బ్యాంకులు నమోదు చేసిన రైతుల ఖాతాల సంఖ్య 82.66 లక్షలు
తొలిదశలో రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాలు 40.43 లక్షలు
తొలిదశలో కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 26.77 లక్షలు
రెండోదశలో ప్రాసెస్ చేసిన ఖాతాల సంఖ్య 42.23 లక్షలు
{పాసెస్ అనంతరం అర్హత పొందిన ఖాతాల సంఖ్య 11.02 లక్షలు
రెండోదశలో కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 6.42 లక్షలు
రెండు దశల్లో రైతుల రుణమాఫీకి ఆమోదించిన ఖాతాల సంఖ్య 51.45 లక్షలు
రెండు దశల్లో రుణమాఫీ వర్తించిన రైతుల సంఖ్య 33.19 లక్షలు
  గత ఏడాది సెప్టెంబర్ నాటికి రైతుల పేరు మీద ఉన్న వ్యవసాయ రుణాలు రూ.99,555 కోట్లు
  రెండు దశల్లో కలిపి నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే సొమ్ము రూ.18,480 కోట్లే
  మిగతా రూ.81,075 కోట్లు రైతుల పేరుమీదే అప్పుగా కొనసాగుతాయి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement