మాఫీ జాబితా ఎక్కడ? | Where is the list waived? | Sakshi
Sakshi News home page

మాఫీ జాబితా ఎక్కడ?

Published Sun, Dec 7 2014 4:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

మాఫీ జాబితా ఎక్కడ? - Sakshi

మాఫీ జాబితా ఎక్కడ?

  • తొలి దశ రుణ మాఫీ జాబితా 6వ తేదీన ప్రకటిస్తామన్న సీఎం
  • శనివారం రోజు బ్యాంకుల దగ్గర క్యూ కట్టిన రైతులు
  • ఆన్‌లైన్‌లో, బ్యాంకుల దగ్గరజాబితా లేక నిరాశ
  • ఆన్‌లైన్‌లో హ్యాక్ చేస్తారన్న ప్రణాళికా శాఖ అధికారి
  • రేపు బ్యాంకులకునేరుగా పంపుతామని వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన రుణ మాఫీ మాట ఎలాగూ నెరవేరలేదు. కనీసం రుణ మాఫీ జాబితా ప్రకటనైనా ముఖ్యమంత్రి  చెప్పిన మేరకు వస్తుందనుకుంటే అదీ నెరవేరలేదు. తొలి దశ రుణ మాఫీ అర్హుల జాబితాను శనివారం ప్రచురిస్తామని, ఆన్‌లైన్‌లో పెడతామని, అందరూ చూసుకోవచ్చునని ఈ నెల 4వ తేదీన విలేకరుల సమావేశంలో చంద్రబాబు తెలిపారు.

    దీంతో శనివారం రైతులు రుణ మాఫీ జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూ కట్టారు. అయితే బ్యాంకులకు శనివారం రాత్రి వరకు రుణమాఫీ అర్హుల జాబితా చేరలేదు. కనీసం ఆన్‌లైన్‌లోనూ ఎన్‌ఐసీ వెబ్‌సైట్లో కూడా తొలి దశ జాబితాను ఉంచలేదు. ఇంకా ప్రభుత్వం నుంచి జాబితా రాలేదని బ్యాంకులు చెప్పడంతో రైతులు నిరాశతో వెనుతిరిగారు.
     
    ఇదిలావుంటే.. ఆన్‌లైన్‌లో రుణ మాఫీ అర్హుల జాబితాను ఉంచితే హ్యాక్ చేస్తారని, తద్వారా అదనంగా మరికొన్ని పేర్లను చేర్చుతారని ప్రణాళికాశాఖ పెద్ద ఒకరు పేర్కొన్నారు. కాబట్టి ఆన్‌లైన్‌లో జాబితా ఉంచబోమని, బ్యాంకులకు మాత్రమే జాబితాలను పంపిస్తామని, అది కూడా 8వ తేదీ నాడు పంపిస్తామని చెప్పారు.

    ఆ జాబితాలను బ్యాంకు బ్రాంచీల వారీగా రైతు సాధికారిత కార్పొరేషన్‌కు పంపించాల్సి ఉందని, అప్పుడు రైతు సాధికారిత కార్పొరేషన్ ఆ జాబితాల మేరకు నగదు మొత్తాన్ని ఆయా బ్రాంచీలకు విడుదల చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

    ఆంక్షలు, ఏరివేతలు, షరతులతో రుణ మాఫీ మొత్తాన్ని తగ్గించడంతో ఇప్పటికే బడ్జెట్‌లో కేటాయించిన రూ. 5,000 కోట్లు 20 శాతం రుణ మాఫీకి సరిపోతాయని అధికారులు పేర్కొన్నారు. 30 వేల రూపాయల లోపు, 50 వేల రూపాయల లోపు రుణాలు చెల్లించడానికి 2,250 కోట్ల రూపాయలైతే సరిపోతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement