కర్నూలు(అగ్రికల్చర్): ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. ప్రజాదర్బార్‌కు వివిధ సమస్యలతో ప్రజలు బారులు తీరుతున్నా.. అధిక శాతం నిరాశే ఎదురవుతోంది. జిల్లా కేంద్రానికి వస్తే ఊరట కలుగుతుందనే భావన కాస్తా నీరుగారుతోంది. అధికారుల మనసు కరగదని తెలిసీ.. ఆశ చంపుకోలేక అదే వినతులతో పదేపదే ప్రదక్షిణ చేస్తున్నారు. ఎప్పటిలానే భారీగా తరలివచ్చిన బాధితులతో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ పోటెత్తింది.
కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, జేసీ కన్నబాబు, అదనపు జేసీ రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌లు వినతులు స్వీకరించారు. కలెక్టర్ చిత్తశుద్ధి చూపుతున్నా.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కారణంగా ప్రజాదర్బార్ రోజురోజుకు ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది. వచ్చిన వనతులపై జిల్లా అధికారులు కిందిస్థాయి సిబ్బందిపైకి తోసేయడం.. అక్కడేమో వినతులకు బూజుపట్టడం పరిపాటిగా మారింది.
సార్.. పింఛన్ ఇవ్వండి
అనారోగ్యంతో కాలు సగం తొలగించారు. నిరుపేద కుటుంబం కావడంతో జీవనం భారంగా మారింది. పింఛను మంజూరు చేయాలని కోరుతున్నా మండల స్థాయిలో అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదు. మీరైనా న్యాయం చేయండి.
- అన్సర్, ఆదోని
పింఛన్ తొలగించారయ్యా
రెండు కళ్లు పూర్తిగా కనిపించవు. 100 శాతం వికలత్వం ఉంది. సర్వే పేరిట నా పింఛను తొలగించారు. ఎలాంటి ఆధారం లేని నాకు.. ఉన్న ఒక్క ఆసరానూ తొలగించారు. దయతలిచి పింఛను పునరుద్ధరించండి.
- మాలిక్, నాగులదిన్నె
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో అన్యాయం
సార్. నాకు 5.30 ఎకరాల భూమి ఉంది. మిరప సాగుకు బ్యాంకు నుంచి లక్ష రూపాయల రుణం తీసుకున్నా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.30 వేలు ఉండగా, రూ.12 వేలు మాత్రమే చూపారు. ఈ కారణంగా పూర్తి రుణమాఫీకి నోచుకోలేదు. ఓర్వకల్లు మండలంతో పాటు పలు గ్రామాల్లో మిరపకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.30 వేలుగా తీసుకున్నా.. ఉయ్యాలవాడలో మాత్రమే తగ్గించడం సరికాదు. పూర్తి రుణమాఫీకి ఆదేశించండి.
- నారాయణ, రైతు, ఉయ్యాలవాడ గ్రామం
మనసు కరగదు..ఆశ చావదు
Published Tue, Dec 30 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement
Advertisement