పాపం.. మట్టిజన్మ | Refusal to take the data with bankers | Sakshi
Sakshi News home page

పాపం.. మట్టిజన్మ

Published Thu, Dec 25 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

పాపం.. మట్టిజన్మ

పాపం.. మట్టిజన్మ

అన్నదాతలంటే అందరికీ లోకువే..
డేటా తీసుకునేందుకు నిరాకరిస్తున్న బ్యాంకర్లు
ముఖం చాటేస్తున్న తహశీల్దార్లు
మొరాయిస్తున్న టోల్‌ఫ్రీ నంబర్లు
రుణమాఫీ సందేహాలు నివృత్తి చేసేదెవరు?

 
మసిపూసి మారేడు కాయ చేస్తూ రుణమాఫీ అయిందనిపించేందుకు సర్కార్ ఎత్తుగడలు రైతుల పాలిటశాపంగా పరిణమిస్తున్నాయి. బేషరతుగా రుణమాఫీ చేస్తానని నమ్మబలికి అన్నదాతలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.  ముప్పుతిప్పలు పెడుతూ  మూడుచెరువుల నీళ్లు తాగిస్తున్నారు. 50వేల లోపు రుణాలున్న వారితో పాటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలోకి వచ్చే రైతుల పేర్లతో రెండు జాబితాలను విడుదల చేసిన సర్కార్ పలు కొర్రీలతో జాబితాను కుదించేందుకు కుట్రలు పన్నుతోంది. అన్నదాతల
జీవితాలతో చెలగాటమాడుతోంది.
 
విశాఖఫట్నం: జిల్లాలో 3.87 లక్షల ఖాతాల్లో లక్షా 30వేల 979 ఖాతాలతో రుణమాఫీతొలి  అర్హత జాబితాను ఈ నెల 6వతేదీన ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 349.34 కోట్ల మాఫీ చేస్తున్నట్టుగా ప్రకటించిన సర్కార్ తొలివిడతలో రూ.157.17కోట్లు సర్దుబాటవు తుందని చెప్పినప్పిటకీ చివరికి కేవలం రూ.20.43కోట్లు మాత్రమే అయింది. తొలి జాబితాలో చోటుదక్కని అర్హులైన 2.57లక్షల మంది రైతులు రెండో జాబితాలో ఉంటారని కలెక్టర్ ఎన్.యువరాజ్ ప్రకటించారు. కానీ ఎంతమందికి చోటు దక్కతుందనేదానిపై నేటికి స్పష్టత లేదు. మూడోవంతు మంది పేర్లు లేవని చెబుతున్నారు. రికార్డులన్ని సక్రమంగా ఉన్న వారికే తొలి జాబితాలో చోటుదక్కగా, రెండో జాబితాలో చోటు దక్కిన వారి నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తహశీల్దార్, బ్యాంకుమేనేజర్‌లతో పాటు మీసేవా కేంద్రాల్లో సమర్పించుకునే వీలు కల్పించింది. ఏ బ్యాంకులో ఎంత రుణం ఏ అవసరం కోసం తీసుకున్నదో తెలియడంతో పాటు ఆధార్,రేషన్, ఓటరు ఐడీ కార్డులతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు అకౌంట్  జెరాక్స్ కాఫీలను సమర్పించాల్సి ఉంది. ఇలా జిల్లాలో ఏఒక్క బ్యాంకు మేనేజర్ వీరి గోడు వినేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. సందేహాల నివృత్తి కోసం వచ్చే రైతులను ఈసడించుకుంటున్నారు. మాకు సమయం లేదు..మీ తహశీల్దార్‌ను అడిగి తెలుసుకోండి..మీ పత్రాలు అక్కడే ఇవ్వండంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. తహశీల్దార్ వద్దకు వెళ్తే ఆయన నుంచి కూడా ఇదేరీతిలో సమాధానం వస్తోందని రైతులు వాపోతున్నారు. వీఆర్వోల వద్దకు వెళ్లండి వాళ్లు చెబుతారు..మీ రికార్డులన్నీ ఆయనకు సమర్పించండి అని తప్పించుకుంటున్నారు.

కనీసం మీ- సేవా కేంద్రానికి వెళ్లి అప్‌లోడ్ చేసుకుందామంటే మీ డేటా లేదు..ప్రొసెస్‌లో ఉందంటూ సమాధానం వస్తోంది. రెండో జాబితా పరిధిలోకి వచ్చే 2.57లక్షల మందిలో కనీసం పది శాతం మంది రైతులు తమ వివరాలను అప్‌లోడ్ చేసుకోలేకపోయారు. దీంతో మిగిలిన వారిలో గుబులు మొదలైంది. పేర్లున్న వార్ని పరిస్థితి ఇలా ఉంటే ఇక పేర్లు లేని వారి పరిస్థితి మరీ అగమ్యగోచరంగా తయారైంది. మరొక పక్క జాబితాలో చోటు దక్కి చనిపోయిన వారికి చెందిన రుణమాఫీ వారి వారసులకు వర్తించాల్సి ఉంది. మాఫీకి విధిగా ఆధార్ అనే నిబంధన పెట్టడం..ఆ చనిపోయిన వ్యక్తికి ఆధార్ లేక పోవడంతో మాఫీ ఆ కుటుంబానికి వర్తించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటివారు జిల్లాలో కనీసం రెండువేల మందికిపైగా ఉంటారని అంచనా.
 
రూపాయి మాఫీ కాలేదు..


నాది నక్కపల్లి మండలం కాగిత. నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. మదుపుల కోసం వేంపాడు సొసైటీలో రూ.20వేలు, నక్కపల్లి ఐవోబీలో బంగారం కుదువ పెట్టి రూ.30వేలు రుణం తీసుకున్నాను. రుణమాఫీ వర్తిస్తుందని ఆశతో ఎదురు చూశాను. అన్ని సక్రమంగా ఉన్నా  రూపాయి కూడా మాఫీ కాలేదు. బ్యాంకులకు వెళితే మీ-సేవలో ఫిర్యాదు చేసుకోమంటున్నారు. అక్కడ ఎటువంటి డేటా లేదని చెబుతున్నారు.-కొప్పిశెట్టి పామురాజు, రైతు, కాగిత,నక్కపల్లి మండలం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement