సాక్షిప్రతినిధి, అనంతపురం : రుణ మాఫీపై ఇన్నాళ్లూ రోజుకో ప్రకటన చేస్తూ రైతులను మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం తీరా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసే ముందు మరో పన్నాగం పన్నింది. సీఎం చేసిన విధాన ప్రకటనలా కాకుండా ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారం మాఫీ చేసేందుకు సిద్ధమైంది. దీంతో చాలామంది రైతులు కచ్చితంగా బ్యాంకులకు నగదు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాల నుంచి రూ.6,817 కోట్ల రుణాలను ‘అనంత’ రైతులు తీసుకున్నారు.
రుణమాఫీ అమలుకు సర్కారు విధించిన నిబంధనల ప్రకారం అధికారులు జల్లెడ పట్టి 8.68 లక్షల ఖాతాలు అర్హమైనవిగా తేల్చి నివేదికలు పంపారు. ప్రస్తుతం రుణమాఫీ జాబితా ఎన్నో చిక్కుముళ్ల మధ్య ‘ఆన్‌లైన్’లో రైతులకు అందుబాటులోకి వచ్చింది. బ్యాంకుల వారీగా జాబితాలు వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో రైతులకు అందుబాటులో జాబితాలను బ్యాంకర్లు ఇంకా డిస్‌ప్లే చేయలేదు. అయితే ఇప్పుడు బ్యాంకర్ల నుంచి కొత్త మాట వినిపిస్తోంది. రైతులు తీసుకున్న మొత్తాన్ని పరిగణలోకి తీసుకోకుండా ‘స్కేల్ ఆఫ్ పైనాన్స్’ ప్రకారం రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను బ్యాంకర్లకు సూచించినట్లు తెలుస్తోంది.
రైతులకు తెలీకుండానే వారి నుంచి నగదును రాబట్టే మోసపూరిత ప్రక్రియ ఇది. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారం రుణమాఫీ జరిగితే జిల్లాలోని రైతులకు మరింత అన్యాయం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఖాతాలు అర్హమైనవిగా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే, అందులో 22.79 లక్షల మాత్రమే అర్హత సాధించాయని తెలిపారు. అంటే ప్రతిపాదిత ఖాతాల్లో దాదాపు 50 శాతం ఖాతాలు తొలివిడత మాఫీ జాబితాలోకి చేరలేదు. ఈ లెక్కన ‘అనంత’ నుంచి అధికారులు పంపిన 8.68 లక్షల్లో కూడా దాదాపు సగం ఖాతాలు జాబితాలో ఉండవకపోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు.
ఈ లెక్కన 4-5లక్షల ఖాతాలు జాబితాలో ఉండొచ్చు. వీరిలో 50 వేల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య 1.60 లక్షల నుంచి 2లక్షల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మొత్తానికి ఏడాదిన్నరగా వడ్డీ డబ్బును ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై స్పష్టత రాలేదు. దీంతో పాటు స్కేల్‌ఆఫ్‌ఫైనాన్స్ ప్రకారం అమలు చేస్తే తక్కిన డబ్బును రైతులు చెల్లిస్తేనే రుణవిముక్తులై కొత్త రుణాలు తీసుకునేందుకు అర్హత సాధిస్తారు? లేదంటే బకాయిదారుల జాబితాలోనే ఉంటారు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే :
శివశంకర్ అనే రైతుకు మూడెకరాల పొలం ఉంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు రూ.12 వేల రుణాన్ని బ్యాంకర్లు ఇవ్వాలి. అయితే బ్యాంకుకు, తనకూ ఉన్న సత్సంంబంధాలు, లావాదేవీలను బట్టి మూడెకరాలకు రూ.50 వేల రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల ప్రకారం రూ.50 వేల రుణం మాఫీ కావాలి. అయితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం శివ శంకర్ 3 ఎకరాలకు 36 వేల రూపాయలు మాత్రమే రుణానికి అర్హుడు. దీంతో ప్రభుత్వం 36 వేల రూపాయలను మాత్రమే మాఫీ చేయనుంది. తక్కిన 14 వేల రూపాయలను బ్యాంకుకు చెల్లించి తీరాల్సిందే! పైగా మొత్తం 50 వేల రూ పాయలకు ఏడాదిన్నరగా 14 శాతం వడ్డీ పడుతుంది. దీన్ని అదనంగా చెల్లించాలి.
బంగారు రుణాలదీ మరీ చిత్రమైన సమస్య
మూడో ప్రాధాన్యత కింద బంగారు రుణాలను మాఫీ చేస్తానని సీఎం ప్రకటించారు. బంగారు తాకట్టుపెట్టి రైతులు రుణాలు తీసుకున్నపుడు 5 ఎకరాలుంటే 3-6 లక్షల రూపాయల అప్పు కూడా తెచ్చుకున్నారు. కానీ వీరికి స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 60 వేల రూపాయలు మాత్రమే అర్హత వస్తుంది. 50 వేల రూపాయల పైన ఉన్న రుణాలకు ఇప్పుడు 20 శాతం చెల్లించి, తక్కిన మొత్తాన్ని 4 విడత్లో చెల్లిస్తామన్నారు.
ఈ లెక్కన కూడా ప్రభుత్వం ఇచ్చే పత్రాల్లో విధాన ప్రకటన చేసిన సమయంలో ప్రకటించిన విధంగా అప్పును పొందుపరుస్తారా? లేదంటే స్కేల్‌ఆఫ్‌ఫైనాన్స్ ప్రకారం అప్పలపట్టీ చూపుతారా? అనేది తేలాల్సి ఉంది. ఇదే జరిగితే ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధమైన విధానాలతో రైతులు, బ్యాంకర్లకు మధ్య కొత్త చిక్కులు తలెత్తి వారి మధ్య వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. ‘మేమే కచ్చితంగానే చేశాం. బ్యాంకర్లే లేనిపోని సాకులు చెబుతున్నారు’ అని రైతుల ముందు బ్యాంకర్లను దోషులుగా చేసే ప్రక్రియకు ప్రభుత్వం ఉపక్రమిస్తున్నట్లు చర్యలను చూస్తే స్పష్టమవుతోంది.
మరో పన్నాగం!
Published Tue, Dec 9 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement
Advertisement