అనంతపురం అగ్రికల్చర్ : రుణమాఫీ మాయాజాలంలో రైతులు ఇరుక్కుపోయారు. పంట, బంగారు రుణాలు కొండంత ఉండగా ప్రభుత్వం గోరంత స్థాయిలో మాఫీ చేయడంతో ఏమి చేయాలో రైతులకు అర్థం కావడం లేదు. దక్కిన రుణమాఫీ కనీసం వడ్డీకైనా సరిపోతుందా అనే సందేహం చాలా మంది రైతుల్లో వ్యక్తమవుతోంది. నెలల తరబడి ఊరించి ఊరించి చివరకు ఊసురుమనిపించేలా వ్యవహరించడడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది.
అటు పంట రుణాలు అందక, ఇటు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ పరిహారం లభించక మొదటికే మోసపోయామా... అనే భావన కనిపిస్తోంది. తొలివిడత ప్రకటించిన జాబితాను చూసి రైతులు ఖంగుతిన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ లక్షల మంది రైతుల పేర్లు రెండో జాబితాలో చేర్చి మరోసారి సరిచేసుకోవాలని సూచించారు. వాటిని ఎక్కడ సరిచేసుకోవాలో ఎవరు చేస్తారో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
ఎక్కడో ఏదో మూల మిణుకుమిణుకుగా కనిపిస్తున్న ఆశలపై నమ్మకం పెట్టుకున్న రైతులకు ఎంత వరకు ప్రయోజనం చేకూరుస్తారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. జిల్లాలో 2013 డిసెంబర్ 31న గణాంకాల ప్రకారం పంట రుణాలు రూ.6,08,874 అకౌంట్ల పరిధిలో రూ.3,093.06 కోట్లు, 2,12,057 అకౌంట్ల పరిధిలో రూ.1,851.18 కోట్లు బంగారు రుణాలు ఉన్నాయి.
అంటే 8,20,931 అకౌంట్ల పరిధిలో ఉన్న రూ.4,944.24 కోట్లు రుణమాఫీకి అర్హత ఉన్నట్లు తేల్చారు. రుణమాఫీకి వీలుగా జిల్లా యంత్రాంగం, బ్యాంకర్లు రైతుల నుంచి ఆధార్, రేషన్‌కార్డు నెంబర్, బ్యాంకు అకౌంట్ తదితర అన్ని వివరాలు సేకరించి ఏకంగా 9,78,222 అకౌంట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. దీంతో కొంత ఆలస్యమైనా మాఫీ చేస్తారని ఆశ పెట్టుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4న ప్రకటించిన రుణమాఫీ జాబితా షాక్ ఇచ్చింది. కమిటీల పేరుతో నెలల తరబడి కాలయాపన చేసిన రాష్ట్ర సర్కారు చివరకు సవాలక్ష నిబంధనలు అమలులోకి తేవడంతో లక్షల మంది రైతులకు రిక్తహస్తం చూపించారు. భూ విస్తీర్ణం, పంట ఎంపిక, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, ఆధార్, రేషన్‌కార్డు నెంబర్ అనుసంధానం లాంటి అడ్డగోలు షరతులు పెట్టడంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి.
రూ.50 వేల లోపున్న అందరి రుణాలు ఒకేసారి మాఫీ చేశామని చెబుతున్నా జిల్లాలో సగం మందికి మాఫీ కాని పరిస్థితి నెలకొంది. రూ.50 వేల పైబడి ఉన్న రుణాలను ఈ ఏడాది 20 శాతం మాఫీ చేసి వచ్చే ఐదేళ్లలో రూ.లక్షన్నర వరకు మాఫీ చేస్తామని ప్రకటించినా అది కూడా అమలు కాక చాల మందికి నిరాశను కలిగించింది. చివరకు ఈనెల 4న ప్రకటించిన తొలిజాబితా ప్రకారం అటు రూ.50 వేలు లోపు ఇటు 20 శాతం మాఫీకి సంబంధించి 6,62,182 అకౌంట్ల పరిధిలో కేవలం రూ.780.16 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ప్రటించిన విధంగా 20 శాతం మరో నాలుగేళ్లు పూర్తిగా అమలు చేస్తే మొత్తమ్మీద రూ.2,234.57 కోట్లు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. అంటే ఇంకా రూ.2,709.67 కోట్లు మాఫీ కావాల్సివుంటుంది.
లక్షల మందికి నిరాశ
రెండో విడత ప్రకటించిన జాబితాలో 2,30,421 అకౌంట్లు మిస్ మ్యాచింగ్‌లో చేరిపోయాయి. అధికారులు, బ్యాంకర్లు ఇష్టారాజ్యంగా వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో ఫీడ్ చేయడంతో లక్షల మంది రైతులకు తొలివిడతలో పేర్లు కనిపించలేదు. అలాంటి వారందరూ మీ-సేవలో చూసుకుని మరోసారి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు, ఇతరత్రా డాక్యుమెంట్లు సమర్పించాలని చెప్పడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. రుణమాఫీకి ఎందుకు అర్హత రాలేదో తెలియజేస్తూ మరో జాబితా విడుదల చేయడంతో రైతులు మీ-సేవా కేంద్రాలు, తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు, బ్యాంకుల వద్దకు పరుగులు తీశారు.
అన్నీ సక్రమంగా సమర్పించినా ఎందుకు ఇలా అయిందని నిలదీసినా ఎవరి నుంచి కూడా సరైన సమాధానం లేదు. కనీసం ఇపుడు ఎక్కడ ఫిర్యాదు చేసుకోవాలి, ఏఏ డాక్యుమెంట్లు సమర్పించాలనే విషయంపై ఎవరి దగ్గర స్పష్టత లేకపోవడంతో రైతులు నానాపాట్లు పడుతున్నారు. రుణమాఫీ నేపథ్యంలో ఇటీవల జిల్లా యంత్రాంగం గ్రామ గ్రామాన రైతు సాధికార సదస్సులు గొప్పగా నిర్వహించి రుణవిముక్తి పత్రాలు అందజేసింది. అందులో రైతుల నుంచి దాదాపు 10 వేల వరకు ఫిర్యాదులు అందాయి. వ్యవసాయ శాఖ అధికారుల సెల్ నెంబర్లు పత్రికల్లో రావడంతో రోజూ ఒక్కో నెంబర్‌కు 500 పైచిలుకు ఫోన్లు రావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అంటే రుణమాఫీ జాబితా, ఫిర్యాదులు ఎలా చేయాలి, ఎవరికి ఇవ్వాలనే గందరగోళం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అనంతరూరల్‌లో మిస్‌మ్యాచింగ్ అధికం
రుణమాఫీ జాబితాలో లేని అకౌంట్లు అనంతపురం రూరల్ మండలంలో ఎక్కువగా ఉన్నాయి. 23,188 అకౌంట్లు మిస్ మ్యాచింగ్ జాబితాలో ఉన్నాయి. కదిరి మండలంలో 14,472, ధర్మవరంలో 11,971 అకౌంట్లు, కనేకల్లులో 11,381 అకౌంట్లు, మడకశిరలో 7,979 అకౌంట్లు, ఉరవకొండలో 6,883 అకౌంట్లు, గార్లదిన్నెలో 6,828 అకౌంట్లు, గోరంట్లలో 6,437 అకౌంట్లు, వజ్రకరూరులో 5,200 అకౌంట్లు, కనగానపల్లి మండలంలో 4,542 అకౌంట్లు... ఇలా ప్రతి మండలంలోనూ వేల మంది అర్హులైన రైతులకు తొలివిడత జాబితాలో మాఫీ కాని పరిస్థితి నెలకొంది. వీరందరూ మీ-సేవా కేంద్రాల్లో చూసుకుని అందులో ‘రిమార్క్’ను బట్టి తక్కిన డాక్యుమెంట్లు, ఇతరత్రా వివరాలు అందజేయాల్సి వుంది. అయితే ఎక్కడ ఇస్తే పని అవుతుందనేది మాత్రం స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గోరంత మాఫీతో కొండంత కష్టం!
Published Sun, Dec 28 2014 3:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement