
రుణమాఫీలో కొత్త మాయ
* స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరిట రైతులకు టోపీ
* రుణంలో 30-40 శాతానికే మాఫీ వర్తింపు
* అందులోనూ జమయింది అతి తక్కువ
* రైతుల లబోదిబో; బ్యాంకర్ల అయోమయం
సాక్షి, విజయవాడ బ్యూరో: రుణమాఫీ కోసం ఎదురు చూసిన రైతుల్ని ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరిట దెబ్బతీసింది. రైతులు ఎంత రుణం తీసుకున్నారనేది పక్కనబెట్టి... వారికున్న భూమికి, వేసిన పంటను బట్టి బ్యాంకులు ఎంతవరకూ రుణం ఇవ్వవచ్చు? అనేది పరిగణనలోకి తీసుకుంటోంది. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో 2013 ఖరీఫ్ సీజన్‌లో వరి పంటకు ఎకరానికి 23,000 రుణం ఇవ్వాలని నిర్ధారించారు. రెండెకరాలున్న రైతు వరి కోసం రూ.70వేలు రుణం తీసుకుని ఉంటే... దాన్లో రూ.46వేల మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం మాఫీ పరిధిలోకి తీసుకుంటోంది. మిగిలింది రైతులమీదే పడుతోంది. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది పంటను బట్టి, సీజన్‌ను బట్టి, జిల్లాను బట్టి మారుతుండటం గమనార్హం. దీనిప్రకారం పలువురు రైతులకు నామమాత్రంగానే రుణాలు మాఫీ అవుతుండటంతో జాబితాల్లో చూసుకుని వారు బ్యాంకుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు.
రూ.50 వేల లోపు పూర్తి మాఫీ ఎక్కడ?
రూ.50 వేల రుణం ఒకేసారి రద్దవుతుందని చెప్పినా దానికీ అనేక మెలికలు పెట్టి ప్రభుత్వం నామమాత్రపు సొమ్ములను మాత్రమే రైతుల ఖాతాల్లో జమచేసింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను (ఎస్‌ఓఎఫ్) రూ.50 వేల రుణాలకు వర్తింపజేయబోమని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఎస్‌ఓఎఫ్ నిబంధనల మేరకే వారి రుణాన్ని లెక్కిస్తున్నారు. అలా లెక్కించినా కూడా మాఫీ మొత్తాన్ని కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడంలేదు.
ఉదాహరణకు... శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గురండికి చెందిన బోర తిమ్మన్న రెండెకరాల వరి పంటకు రూ.50 వేల రుణం తీసుకున్నాడు. ఎస్‌ఓఎఫ్ ప్రకారం ఎకరానికి రూ.13,500గా లెక్కించినా రూ.27 వేలు మాఫీ కావాలి. కానీ ఆయన ఖాతాలో కేవలం 10,249 మాత్రమే జమయింది.
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం బాలసానివారిపల్లెకు చెందిన రైతు ఎస్ బైరిశెట్టి 1.45 ఎకరాల్లో వేరుశెనగ పంట సాగుకోసం బి. కొత్తకోట ఎస్‌బీఐలో రూ.లక్ష రుణం తీసుకున్నాడు. ఆయనకు మాఫీ చేసిన మొత్తం రూ.2,888. వడ్డీతో కలిపి 3,158 మాఫీ అవుతున్నట్లు వెబ్‌సైట్లో ఉంది. దీన్లో తొలి విడత మాఫీ అయ్యేది కేవలం రూ.631. మొగిలిన మొత్తాన్ని మరో మూడు విడతల్లో మాఫీ చేస్తారట.
విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన చదరం ఆదినాయుడు యూనియన్ బ్యాంకులో బంగారం కుదువపెట్టి రూ.28 వేల క్రాప్‌లోన్ తీసుకున్నాడు. రూ.50 వేల కంటే తక్కువ ఉంది కనక పూర్తిగా రద్దవుతుందని ఆశపడ్డాడు. కానీ జాబితాలో అతని పేరే లేదు.
వీరేకాదు. చాలామంది రైతుల అనుభవాలు ఇలానే ఉన్నాయి. తొలిదశ రుణమాఫీకి అర్హత పొందిన 22.79 లక్షల కుటుంబాల్లో 40 శాతం మంది వరకూ రూ.50 వేల కంటె తక్కువ రుణాలు తీసుకున్న వారేనని బ్యాంకర్లు చెబుతున్నారు. అంటే 9 లక్షలకు పైనే. ప్రభుత్వం తీరుతో వారికీ న్యాయం జరగలేదు. కాగా రుణ మాఫీ తీరును చూసి బ్యాంకర్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. రైతులపై నమ్మకంతో ఎస్‌ఓఎఫ్ నిబంధనల కంటే ఎక్కువ రుణాలిచ్చిన బ్యాంకర్లు ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకులకు వస్తున్న రైతులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. కొన్ని బ్యాంకుల వద్ద జాబితాలు ఓపెన్ కాకపోవటంతో రైతులు మీ సేవా కేంద్రాల వద్ద నిరీక్షించటం కనిపించింది.