
రుణ మాఫీ వడ్డీకే సరిపోయింది
► నకిలీ విత్తనాలు అరికట్టాలి
► టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత
ఆదిలాబాద్‌టౌన్ : ప్రభుత్వం మూడో విడతలో విడుదల చేసిన 25 శాతం రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత విమర్శించారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయూలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ తీవ్రఇబ్బందులు పడుతున్నారన్నారు.
గతేడాది నకిలీ విత్తనాలు వేసి రైతులు మోసపోయారని, ఈ ఏడాది అలా కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై పీడీ యాక్టు పెట్టాలన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. ప్రైవేటు వ్యాపారుల ఆగడాలను ఆరికట్టేందుకు టాస్క్‌ఫోర్సు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. తమ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతరెడ్డి, రాజేశ్వర్, కల్చప్‌రెడ్డి, నాగన్న, సంతోష్, వసంత్ ఉన్నారు.