► మంత్రి ప్రత్తిపాటి ఇల్లు ముట్టడించిన కౌలు రైతులు
► ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన
► ఫోన్‌లో మంత్రి హామీతో విరమణ
చిలకలూరిపేటటౌన్: రెండేళ్లుగా మాటలకే పరిమితమవుతున్న కౌలు రైతు రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాసాన్ని శనివారం రైతులు ముట్టడి చేశారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన రైతులు పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ సెంటర్ నుంచి ప్రదర్శనగా మంత్రి నివాసం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. మంత్రి అప్పటికే విజయవాడకు బయలుదేరి వెళ్లిపోవడంతో ఆయన ఇంటిముందు బైఠాయించారు. ఈ సందర్భంగా నాగబోయిన రంగారావు మాట్లాడుతూ నిజమైన సాగుదారులైన కౌలురైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. పలు దఫాలుగా జరిగిన నామమాత్రపు రుణమాఫీలో కౌలురైతులకు ఒరిగింది ఏమీలేదని, దీంతో కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కోట్లు దుబారా చేస్తున్నారు..
ఇది ఒక లెక్కా...
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న కౌలురైతులకు రూ.450 కోట్లు రుణమాఫీ కావాల్సి ఉందని, ప్రతి రోజూ ఆర్భాటాల కోసం వందల కోట్లు దుబారా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తం రద్దుచేయడం పెద్ద విషయం కాదన్నారు. కౌలురైతుల వ్యక్తిగత రుణాలు రూ.50 వేల లోపు మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వం ఇచ్చిన జీవో 74 ప్రకారం వాటిని ఒకే దఫాలో మాఫీచేయవచ్చని తెలిపారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కౌలు రైతుల రుణమాఫీతో పాటు ఖరీఫ్ సీజన్‌లో బ్యాంకుల నుంచి రుణాలు, భీమాసౌకర్యం కల్పించాలని కోరారు. ఈ డిమాండ్లను జూన్‌మొదటి వారంలోగా అమలు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు.
రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకొన్న పోలీసులు పెద్దఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని రైతులను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం ఫోన్ ద్వారా తెలుసుకొన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతుసంఘ నాయకులతో ఫోన్లో మాట్లాడారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు నరసింహ, వినోద్, శ్రీకాంత్, పోపూరి సుబ్బారావు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
రుణాలు రద్దుచేయకుంటే ఆందోళన ఉధృతం
Published Sun, May 22 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM
Advertisement
Advertisement