Minister prattipati pull Rao
-
నవ్యాంధ్ర నిర్మాణంలో అందరి భాగస్వామ్యం
రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు ఈస్ట్ : నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నవనిర్మాణ దీక్ష చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు నిచ్చారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువారం జిల్లా స్థాయిలో నవనిర్మాణ దీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో చేయించే ప్రతిజ్ఞను ఎల్ఈడీ స్క్రీన్‌పై చూస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. తొలుత ఎన్టీఆర్ స్టేడియం నుంచి నవనిర్మాణ దీక్ష ర్యాలీని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో పుల్లారావు మాట్లాడుతూ 2018 నాటికి రాజధాని, పోలవరం పూర్తి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే మాట్లాడుతూ ఇంకుడుగుంతల నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి , ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్.రామకృష్ణ ,ై మెనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి.హిదాయత్ ,’సంయుక్త కలెక్టర్ -2 వెంకటేశ్వరావు, 20 సూత్రాల కమిటీ చైర్మన్ శ్రీనివాసశేష సాయిబాబా, జీడీసీసీ చైర్మన్ ఎమ్.వెంకటసుబ్బయ్య, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ తదితరులున్నారు. -
రుణాలు రద్దుచేయకుంటే ఆందోళన ఉధృతం
► మంత్రి ప్రత్తిపాటి ఇల్లు ముట్టడించిన కౌలు రైతులు ► ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ► ఫోన్లో మంత్రి హామీతో విరమణ చిలకలూరిపేటటౌన్: రెండేళ్లుగా మాటలకే పరిమితమవుతున్న కౌలు రైతు రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాసాన్ని శనివారం రైతులు ముట్టడి చేశారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన రైతులు పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ నుంచి ప్రదర్శనగా మంత్రి నివాసం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. మంత్రి అప్పటికే విజయవాడకు బయలుదేరి వెళ్లిపోవడంతో ఆయన ఇంటిముందు బైఠాయించారు. ఈ సందర్భంగా నాగబోయిన రంగారావు మాట్లాడుతూ నిజమైన సాగుదారులైన కౌలురైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. పలు దఫాలుగా జరిగిన నామమాత్రపు రుణమాఫీలో కౌలురైతులకు ఒరిగింది ఏమీలేదని, దీంతో కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు దుబారా చేస్తున్నారు.. ఇది ఒక లెక్కా... రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న కౌలురైతులకు రూ.450 కోట్లు రుణమాఫీ కావాల్సి ఉందని, ప్రతి రోజూ ఆర్భాటాల కోసం వందల కోట్లు దుబారా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తం రద్దుచేయడం పెద్ద విషయం కాదన్నారు. కౌలురైతుల వ్యక్తిగత రుణాలు రూ.50 వేల లోపు మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వం ఇచ్చిన జీవో 74 ప్రకారం వాటిని ఒకే దఫాలో మాఫీచేయవచ్చని తెలిపారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కౌలు రైతుల రుణమాఫీతో పాటు ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల నుంచి రుణాలు, భీమాసౌకర్యం కల్పించాలని కోరారు. ఈ డిమాండ్లను జూన్‌మొదటి వారంలోగా అమలు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకొన్న పోలీసులు పెద్దఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని రైతులను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం ఫోన్ ద్వారా తెలుసుకొన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతుసంఘ నాయకులతో ఫోన్లో మాట్లాడారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు నరసింహ, వినోద్, శ్రీకాంత్, పోపూరి సుబ్బారావు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రలోభాలతోనే పార్టీలు మారుతున్నారు
♦ ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపుపై మంత్రి ప్రత్తిపాటి ♦ సీఎం బాబు పడుతున్న కష్టం చూసి అంటూ మాట మార్పు మంగళగిరి: ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వస్తున్నారో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. తెలంగాణలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రలోభాల కారణంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళుతున్నారని, ఇక్కడా కూడా అంతేనని ఆయన వెల్లడించారు. తర్వాత నాలుక్కరుచుకుని ఇక్కడ రాష్ట్రాభివృద్ధికి తమ ముఖ్యమంత్రి 66 ఏళ్ల వయసులో పడుతున్న కష్టాన్ని చూసి.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారంటూ మాట మార్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం ఓ క్లినిక్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి.. ఆ సందర్భంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఆయనపై విధంగా స్పందించారు. ప్రలోభాల కారణంగానే ఎక్కడైనా ఎమ్మెల్యేలు పార్టీలు మారతారని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై గవర్నర్‌తో పాటు ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండదన్నారు. -
ప్రత్తిపాటి నోట... ఓటి మాట
రోజురోజుకో నిబంధన జిల్లాలో బంగారం తాకట్టు రుణాల రైతులు 2,60,737 మంది రుణాలు రూ. 3,276 కోట్లు కొలమానంతో కోత మచిలీపట్నం : ‘బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులెవరూ తిరిగి చెల్లించవద్దు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తరహా రుణాలన్నీ మాఫీ చేసి అక్కచెల్లెమ్మల బంగారు పుస్తెల తాళ్లను ఇంటికే తీసుకువచ్చి ఇస్తా’మంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు హామీలతో ఊదరగొట్టారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో కొర్రీలు పెట్టారు. నగల వేలానికి నోటీసులిచ్చారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ బంగారు రుణాలు పొందినవారెవరికీ నోటీసులు పంపలేదంటూ చెప్పుకొచ్చారు. అవన్నీ పచ్చి అబద్ధాలంటూ పలువురు జిల్లా రైతులు ధ్వజమెత్తారు. కానీ పంట రుణాలు పూర్తిస్థాయిలో రద్దు కాలేదు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణా లకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స (కొల మానం)ను అమలు చేశారు. రైతులు తీసుకున్న రుణానికి, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి భారీ వ్యత్యాసం ఉండడంతో ప్రభుత్వం ఇచ్చిన నగదు బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న పం ట రుణాలు వడ్డీకే చాలీచాలని పరిస్థితి నెలకొంది. జిల్లాలో బంగారం తాకట్టు పెట్టి రూ.3,276 కోట్లను 2,60,737 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. అధికారం చేపట్టిన తరువాత తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేయటంలో ప్రభుత్వం తన పంథాను మార్చడంతో వడ్డీ కొండలా పెరిగింది. దీంతో బ్యాంకు అధికారులు నగలను వేలం పాటలను కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతుల బంగారు నగలు వేలం వేయడం లేదని ప్రకటించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా రైతు బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకుంటే మొదటి సంవత్సరంలో పావలా వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఈ వడ్డీని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వమే చెల్లించింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీతో రైతులు రుణాలు చెల్లించకపోవటంతో ఏడాది దాటిన తరువాత 7 శాతం వడ్డీ అనంతరం 14 శాతం వడ్డీ పెరిగింది. 2013 నుంచి ఇప్పటి వరకు మూడేళ్లు కావటంతో రుణమాఫీలో రూ.50వేల కన్నా పైబడి పంట రుణం తీసుకున్న వారికి 20 వేలు మాత్రమే ప్రభుత్వం జమ చేయడంతో ఈ నగదు వడ్డీకే చాలని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో మూడు విడతల్లో రుణమాఫీ చేశారు. జిల్లాలో అన్ని రకాల వ్యవసాయ రుణాలకు 4,04 ,402 మంది రైతులకు రూ.1490 కోట్లు మాఫీ జరిగినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఇప్పటి వరకు రూ. 573 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తాకట్టు పెట్టి రుణం తీసుకుని ఏడాది గడిస్తే గడువు మీరిందనే కారణంతో బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యువల్ చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. రుణం అధికంగా ఉం టే అధికారులు బంగారు నగలు వేలం వేస్తున్నామని పత్రికల్లో ప్రకటనలు ఇస్తుండటంతో పరువు బజారున పడుతోందని రైతులు వాపోతున్నారు. ఏడాది గడవకముందే నోటీసు సంవత్సరం కిందట బ్యాంక్‌లో రూ.35 వేలు రుణం తీసుకున్నాను. ఏడాది కూడా గడవక ముందే బ్యాంక్ అధికారులు అప్పు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. -ఎన్ శివనాగేంద్రం, కొలకలూరు, గుంటూరు జిల్లా -
ప్రత్తిపాటి బుకాయింపు హాస్యాస్పదం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి ఆనందపేట (గుంటూరు): అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా అమ్మటానికి వీలులేని భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసి పైగా పరువు నష్టం దావా వేస్తానని బుకాయించడం హాస్యాస్పందంగా ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. గుంటూరు అరండల్‌పేటలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థపై పోలీసుల విచారణ కొనసాగుతున్నా ప్రభుత్వం అండదండలతో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. కంచే చేను మేసిన విధంగా బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తే ఇలా చేయడం తగదన్నారు. ప్రైవేటు వ్యక్తి ద్వారా భూములు కొనుగోలు చేశానని చెబుతున్న మంత్రి పుల్లారావు ఆ ప్రైవేటు వ్యక్తి ఎవరో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 2015లో అగ్రిగోల్డ్ సంస్థల డెరైక్టర్ అయిన ఉదయదినకర్ నుంచి భూములు కొనుగోలు చేశారని ఆయన వెల్లడించారు. పరువు నష్టం దావా వేస్తే ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ద్వారానే దీనిపై విచారణకు ఆదేశించాలని, తాము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకులు కొత్తా చిన్నప్పరెడ్డి, సయ్యద్ మాబు, నర్సిరెడ్డి, బండారు సాయిబాబు, రాచకొండ ముత్యాలరాజు, మురళి, మధు, రత్నబాబు, కంభా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
నామమాత్రంగానే భూమి పూజ
అక్టోబర్‌లో శంకుస్థాపన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తుళ్లూరు: నూతన రాజధాని భూమి పూజ వచ్చే నెల 6వ తేదీన నామమాత్రంగానే జరగనున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో కలిసి మంత్రి గురువారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో భూమి పూజ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. అనంతరం తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమం కేవలం పదివేల మందితో నామమాత్రంగానే జరగనున్నదని తెలిపారు. అక్టోబరులో రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని, దీనికి ప్రధాన మంత్రి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. లక్షలాది మందితో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు వచ్చే నెల 5, 6, 8 తేదీల్లో జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొం టారన్నారు. 5వ తేదీన గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ విశ్వవిద్యాలయం భూమి పూజ, 6న తుళ్లూరు మండలం మందడంలో జరిగే రాజధాని నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి చెప్పారు. జూన్ 8వ తేదీనటీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంగళగిరి సమీప ప్రాంతంలో జరిగే కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారని పుల్లారావు వివరించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతులు గురువారం నాటికి 17,840 ఎకరాలకు భూస్వాధీన ఒప్పంద పత్రాలు అందజేశారన్నారు.