
నామమాత్రంగానే భూమి పూజ
అక్టోబర్‌లో శంకుస్థాపన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
తుళ్లూరు: నూతన రాజధాని భూమి పూజ వచ్చే నెల 6వ తేదీన నామమాత్రంగానే జరగనున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో కలిసి మంత్రి గురువారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో భూమి పూజ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. అనంతరం తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమం కేవలం పదివేల మందితో నామమాత్రంగానే జరగనున్నదని తెలిపారు. అక్టోబరులో రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని, దీనికి ప్రధాన మంత్రి హాజరయ్యే అవకాశం ఉందన్నారు.
లక్షలాది మందితో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు వచ్చే నెల 5, 6, 8 తేదీల్లో జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొం టారన్నారు. 5వ తేదీన గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ విశ్వవిద్యాలయం భూమి పూజ, 6న తుళ్లూరు మండలం మందడంలో జరిగే రాజధాని నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి చెప్పారు. జూన్ 8వ తేదీనటీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంగళగిరి సమీప ప్రాంతంలో జరిగే కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారని పుల్లారావు వివరించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతులు గురువారం నాటికి 17,840 ఎకరాలకు భూస్వాధీన ఒప్పంద పత్రాలు అందజేశారన్నారు.