పచ్చ మోసం
రుణమాఫీ అమలులో రైతన్నలను మోసం చేసిన సర్కారు
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో రూ.50 వేల లోపు రుణాల్లోనూ కోత
ఖాతాలో పడుతున్న డబ్బులు చూసి బోరుమంటున్న రైతులు
అనంతపురం : జిల్లా వ్యాప్తంగా లక్షల మంది రైతులు రుణమాఫీ ఉచ్చులో పడి నిలువునా మోసపోయారు. రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి.. ఆర్థిక పరిస్థితి బాగోలేదు 1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని ఇపుడు చెబుతున్నారు. చివరకు 50వేల రూపాయల లోపు ఒకేసారి మాఫీ చేస్తానని, అంతకంటే ఎక్కువ బకాయిలు ఉంటే నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని మీడియా సాక్షిగా ఈ నెల 4న చంద్రబాబు ప్రకటించారు. కానీ ఈ మాటపై కూడా చంద్రబాబు నిలబడలేకపోయారు. ‘నోరొకటి చెబుతుంది...చేయ్యి మరొకటి చేస్తుంది.. దేనిదోవ దానిదే’ అనే తరహాలో వ్యవహరించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో రైతన్నల నడ్డి విరిచారు.
ఆన్‌లైన్‌లో 6.62 లక్షల ఖాతాలు
జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాలున్నాయి. ఇందులో 9.86 లక్షల ఖాతాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి పంపారు. ఇందులో 8.83 లక్షల ఖాతాలు అర్హమైనవిగా ప్రకటించారు. అయితే తీరా జాబితా వచ్చిన తర్వాత చూస్తే 6.62,663 ఖాతాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ లెక్కన 2,21,144 ఖాతాలు గల్లంతయ్యాయి. సరే! ఈ ఖాతాలకైనా ఈ నెల 4న చెప్పిన ప్రకారం రుణమాఫీని అమలు చేశారా? అంటే అదీ లేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూపంలో అరకొర చిల్లర విధిల్చి చేతులు దులుపుకున్నారు.
ఇదీ బాబు మాఫీ మాయ
జిల్లాలో సన్నకారు రైతులు 50 వేల లోపు రుణాలు తీసుకున్నారు. బాబు చెప్పిన ప్రకారం ఈ రుణాలన్నీ ఒకే విడతలో మాఫీ కావాలి. కానీ రైతులు బ్యాంకులో తనఖాపెట్టిన పాస్‌పుస్తకాల్లోని పొలానికి నిబంధనల ప్రకారం ఎంత రుణం ఇవ్వచ్చో.. ఆమేరకే మాఫీ చేస్తున్నారు. అంటే ఉదాహరణకు ఆంజనేయులు 2.50 ఎకరాలకు రూ.46 వేల రుణం తీసుకున్నారనుకుందాం. ఇతనికి వడ్డీ కలిపి 52 వేల రూపాయల బకాయి ఉంది. ఇందులో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు బ్యాంకర్లు 12 వేలు ఇవ్వాలి. ఈ లెక్కన 2.50 ఎకరాలకు 30వేల అవుతుంది. ఈ 30వేల రూపాయలను మాఫీ చేస్తారు. అది కూడా 50 వేలు దాటింది కాబట్టి, 30 వేలకు 20 శాతం డబ్బులు ఖాతాలో వేసి తక్కిన డబ్బులను నాలుగేళ్లలో నాలుగు విడతల్లో మాఫీ అవుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీపై చంకలు గుద్దుకున్న టీడీపీ నేతలు, డబ్బులు వారి ఖాతాల్లో పడ్డాక వారు కూడా బహిరంగంగా బాబును విమర్శిస్తున్నారంటే ‘బాబు మాఫీ మాయ’పై రైతన్నలు ఏస్థాయిలో మండిపడుతున్నారో ఇట్టే తెలుస్తోంది.
బ్యాంకుల్లో పూర్తిగా వెల్లడికాని రుణాల వివరాలు
రుణమాఫీ జాబితాల వివరాలు తెలుసుకునేందుకు మంగళవారం జిల్లాలోని బ్యాంకులు, మీసేవా కేంద్రాలు రైతులతో కిటకిటలాడాయి. మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున బ్యాంకులకు తరలివెళ్లారు. తీరా ఖాతాలోని వివరాలు చూసి భరించలేని కోపంతో ప్రభుత్వంపై తిట్లపురాణం అందుకుంటూ ఇంటిబాట పట్టారు. జాబితాలు మంగళవారం కూడా బ్యాంకులకు పూర్తి స్థాయిలో చేరలేదు. ఈ నెల 10న ప్రభుత్వం నుంచి బ్యాంకులకే ప్రత్యేకంగా హార్డ్‌కాపీ జాబితా వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో నేడు మాఫీ జాబితా వివరాలు పూర్తిగా తెలియనున్నాయి. ఏడీసీసీ బ్యాంకుకు సంబంధించి 350 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇందులో 77 కోట్ల రూపాయలు మాఫీ అవుతున్నాయి. ఇందులో 50 వేల రూపాయల లోపు ఉన్న ఖాతాలకు సంబంధించి రూ.50 కోట్లు మాఫీ అవుతున్నాయి. అలాగే రూ.50 వేలుపైబడి రుణాలున్న ఖాతాల్లో 20 శాతం చొప్పున రూ. 27 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి.
శింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన బాల నాగన్న పేరుతో 1.65, భార్య పేరుపై 0.84 ఎకరాల భూమి ఉంది. నాలుగేళ్ల కిందట శింగనమల సిండికేట్ బ్యాంకులో 18 వేల రూపాయలు పంట రుణం తీసుకున్నారు. వడ్డీతో కలిపి 19,968 రూపాయలైంది. అప్పటి నుంచి రీషెడ్యూలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం భార్యాభర్తలకు కలిపి 40,535 రూపాయల రుణం ఉంది. స్కేల్ ఆప్ పైనాన్స్ ప్రకారం వీరికి రూ. 33,447లు మాత్రమే రుణం మాఫీ అయినట్లు వచ్చింది. 50 వేల రూపాయల వరకూ రుణమాఫీ అవుతుందని చంద్రబాబు ప్రకటించారు.. కానీ తనకు రూ.40 వేలు అప్పు ఉంటే అది కూడా పూర్తిగా మాఫీ కాలేదని నాగన్న వాపోతున్నారు.
పుట్లూరు మండలం పి.చింతలపల్లికి చెందిన రామిరెడ్డికి 2.68 ఎకరాల పొలం ఉంది. తాడిపత్రి ఎస్‌బీఐలో రూ.15 వేల రుణాన్ని మూడేళ్ల కిందట తీసుకున్నాడు. అప్పటి నుంచి ఏటా వడ్డీ చెల్లిస్తూ రుణాన్ని రెన్యూవల్ చేసుకుంటున్నాడు. ఇతని ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌తో సహా అన్ని పత్రాలను సమర్పించారు. బ్యాంకర్లు కూడా రుణమాఫీకి అర్హత సాధించావన్నారు. అయితే రుణమాఫీ జాబితా రావడంతో మాఫీ అవుతుందని సంతోషంగా బ్యాంకుకు వెళ్లాడు. కానీ ఇతని పేరు జాబితాలో లేదు.