కరీంనగర్ అగ్రికల్చర్: జిల్లాలో ప్రధానంగా ఖరీఫ్ సీజన్‌లో రైతులు అధికంగా పంట రుణాలు తీసుకుంటారు. వ్యవసాయ పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు పంట రుణాల లక్ష్యాన్ని పెంచుతోంది. ప్రతి సంవత్సరం భారీ లక్ష్యాలు పెట్టుకోవడం, ఆ తర్వాత వాటిని అందుకోలేక చేతులెత్తేయడం రివాజుగా మారింది. కానీ గత ఏడేళ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఒక్క 2012-13లో మాత్రమే రుణ లక్ష్యాన్ని చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. జూన్ నుంచి సెప్టెంబర్ 30 వరకు గల ఖరీఫ్ సీజన్‌లో సగటున 60 శాతం మంది రైతులు పంట రుణాలు పొందుతున్నారు.
కానీ.. ఈసారి టీఆర్‌ఎస్ సర్కారు రుణమాఫీ విషయంలో తీవ్ర జాప్యం చేయడంతో రైతులకు బ్యాంకు రుణాలు పుట్టలేదు. రుణమాఫీ నిబంధనలపై స్పష్టత లేకపోవడం వల్ల ఆగస్టు వరకు కూడా బ్యాంకర్లు కొత్తగా పంట రుణాలు ఇవ్వలేకపోయారు. ఎట్టకేలకు గత నెలలో రాష్ట్ర సర్కారు రుణమాఫీపై ఒక అడుగు ముందుకు వేసినప్పటికీ అప్పటికే పుణ్యకాలం కాస్తా పూర్తయింది. రుణమాఫీ డబ్బులను నాలుగు విడతలుగా బ్యాంకర్లకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ కింద జిల్లాకు మొత్తం రూ.1656.856 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, తొలి విడతగా 25 శాతం అంటే రూ.41.25 కోట్లను 3,73,876 మంది రైతులకు విడుదల చేసింది.
రుణమాఫీ నిధులు విడుదల కావడంతో రైతులకు పంట రుణాలను ఇవ్వాలని, మాఫీ పొందిన వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. సెప్టెంబర్ 30కి ఖరీఫ్ గడువు ముగిస్తుండగటంతో ఈ నెల 15 వరకు గడువు పెంచింది. ఈ గడువు ముగిసే దశలో జిల్లా యంత్రాంగం కేవలం ఒక్క రోజులో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి రూ.500 కోట్ల పంట రుణాలు అందించేలా బ్యాంకర్లను ప్రోత్సహించింది. అయితే రుణమాఫీ పొందిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు తిప్పలు పెట్టారు. 1బీ రికార్డులు, పహణీ నకలు, 2పాస్‌పోర్టు సైజు ఫొటోలతో రుణమాఫీ హామీ పత్రంపై సంతకం చేసిన రైతులకు కొత్త రుణాలు అందించారు.
సమయం తక్కువ కావడం, 1బీ రికార్డు, పహణీ నకలు కోసం రెవెన్యూ అధికారులు తిప్పుకోవడం, మరోవైపు ఆహారభ ద్రత కార్డు, పెన్షన్లు, ఇతర సర్టిఫికెట్లకు దరఖాస్తులు స్వీకరించడంలో అధికారులు బిజీగా మారడంతో ఖరీఫ్ పంట రుణం గడువు కాస్తా పూర్తయ్యింది. బ్యాంకర్ల మెలికలు, రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా రైతులు పంట రుణాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. అలాగే రుణమాఫీ పొందిన రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి ఇవ్వాలన్న ఆదేశాలను బ్యాంకర్లు పట్టించుకోలేదు.
ఉదాహరణకు బ్యాంకులో రూ.81 వేల అప్పు ఉంటే.. ఇందులో 25 శాతం తొలివిడతగా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. రూ.81 వేలలో నాలుగో వంతు అంటే రూ.20,250 రుణమాఫీ కింద ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు రైతుకు రూ.60 వేల రుణం ఇవ్వాల్సి ఉండగా, చాలా మందికి రూ.10 నుంచి రూ.20 వేలు మాత్రమే ఇచ్చారు. రబీలోనూ బ్యాంకర్లు ఇదే పంథా కొనసాగిస్తే.. ఇప్పటికే పెట్టుబడుల భారంతో అప్పులపాలైన అన్నదాతల పరిస్థితి మరింత దా‘రుణం’ కానుంది. రబీలో పంట రుణం లక్ష్యం రూ.650 కోట్లు నిర్దేశించినా.. ఏ మేరకు ఇస్తారో చూడాల్సిందే.
దారుణం
Published Fri, Oct 17 2014 2:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement