రికవరీ ఏల? | farmers confusion on loan waiver | Sakshi
Sakshi News home page

రికవరీ ఏల?

Published Wed, Sep 10 2014 11:02 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

farmers confusion on  loan waiver

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణమాఫీ అంశం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. మాఫీ తప్పక చేస్తామ ని ప్రభుత్వం అంటుండగా.. ముందు బ్యాంకు రుణాలు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు అంటున్నారు. దీంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. మాఫీతో సంబ ంధంలేకుండా రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తేవడంతో యాచారం మండలంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

రుణమాఫీపై ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. ఈక్రమంలో మాఫీ అయ్యే రుణాల వివరాలను తేల్చి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. రుణాల కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించినప్పటికీ.. జిల్లాలోని బ్యాంకు అధికారులు ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవడంలేదు. బుధవారం యాచారం మండలం తమ్మలోనిగూడ, చింతపట్ల,  కొత్తపల్లి, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల్లో పర్యటించి రుణాలను చెల్లించాలంటూ రైతులపై ఒత్తిడి తేవడంతో ఆయా గ్రామాల్లో గందరగోళం చోటుచేసుకుంది. మాఫీ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ.. తీసుకున్న రుణం చెల్లించాల్సిందేనని, మాఫీ జరిగినప్పుడు తిరిగి చెల్లిస్తామంటూ అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు తెల్లముఖం వేయాల్సివచ్చింది. అసలు రుణమాఫీ ఉంటుందా.. ఉండదా అంటూ రైతులు అయోమయం చెందుతున్నారు.

 రీషెడ్యూలూ పట్టలేదు..
 గత ఖరీఫ్‌లో పకృతి వైపరిత్యాల కారణంతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దీంతో రైతులకు ఆదుకునే క్రమంలో భాగంగా జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటిస్తూ.. రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఆర్బీఐ సైతం మార్గదర్శకాలిచ్చింది. దీంతో జిల్లాలోని 32 మండలాల్లో రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయాలి. ఈ లెక్కన రైతులు రుణాలు చెల్లించకున్నా కొత్తగా రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ బుధవారం యాచారంలోని పరిస్థితిని పరిశీలిస్తే రీషెడ్యూల్ అంశాన్ని సైతం పట్టించుకోకుండా బ్యాంకర్లు రికవరీ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement