► వికారాబాద్ జిల్లా ‘దోమ’కు చెందిన రైతు బాయిని వెంకటయ్య ఆరు నెలల క్రితం పంట రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఇతర బ్యాంకుల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తేవాలన్నారు. వెంకటయ్య ఇతర బ్యాంకుల చుట్టూ తిరిగి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకువచ్చి దరఖాస్తు చేసుకున్నారు. యాసంగి సాగు మొదలైనా ఇంకా రుణం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు.
► సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన సావిత్రమ్మ.. యాసంగిలో పంట రుణం కోసం బ్యాంకును ఆశ్రయించారు. కానీ బ్యాంకు అధికారులు కొర్రీలు పెట్టారు. ఇతర బ్యాంకుల్లో పంట రుణం తీసుకోనట్టు/ఎలాంటి బాకీ లేనట్టుగా ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలని.. లేకుంటే రుణం ఇచ్చే మాటే లేదని చెప్పారు. దీనితో ఆమె ఆ మండలంలోని ప్రధాన బ్యాంకుల చుట్టూ తిరిగి నో డ్యూస్ సర్టిఫికెట్‌పై సంతకాలు చేయించుకొచ్చారు. ఆ తర్వాతే పంట రుణం అందింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంట రుణాల కోసం రైతులు గోసపడుతున్నారు. బ్యాంకర్లు ఏదో ఓ కొర్రీ పెడుతూ రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సదరు మండలంలోని ఇతర బ్యాంకులకు వెళ్లి నోడ్యూస్ సర్టిఫికెట్లు తేవాలని ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇప్పటికే ఉన్న పంట రుణాలు మాఫీ కాకపోవడంతో కొత్తగా రుణాలు ఇవ్వబోమని తేల్చి చెప్తున్నారు. దీనితో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థ పడుతున్నారు. చివరికి పంట పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
లక్ష్యం ఘనం.. ఇచ్చేది కొంచెం..
పంటరుణాల మంజూరుకు బ్యాంకులు, ప్రభుత్వం ఘనంగానే లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు మాత్రం పంట రుణాల కోసం వస్తున్న రైతులకు చుక్కలు చూపుతున్నారు. ఏదో ఒక కొర్రీ పెడుతూ తిప్పుకొంటున్నారు. ఈ విషయంలో రైతులకు బాసటగా నిలవాల్సిన వ్యవసాయ శాఖ ఏమీపట్టనట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. యాసంగి మొదలై రెండు నెలలైనా రైతులకు ఇప్పటివరకు అరకొరగానే రుణాలు అందుతున్నాయి.
2022–23 వానాకాలం సీజన్‌లో పంటరుణాల మంజూరు లక్ష్యం రూ.40,718 కోట్లుకాగా.. సీజన్ పూర్తయ్యే నాటికి బ్యాంకులు రూ. 21,272 కోట్లు మాత్రమే ఇచ్చాయి. అంటే లక్ష్యంలో 52 శాతమే రుణాలు అందించాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌కు లక్ష్యం రూ.27,146 కోట్లుకాగా.. ఇప్పటివరకు ఇచ్చింది రూ.5వేల కోట్లలోపేనని వ్యవసాయ వర్గాలు చెప్తుండటం గమనార్హం. ధరణితో సాంకేతిక సమస్యలంటూ..
గతంలో రైతుల పట్టాదారు పాస్‌బుక్కులు తనఖాగా పెట్టుకుని బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త విధానం తీసుకువచ్చారు. ప్రతి జాతీయ బ్యాంకుకు ధరణి పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. బ్యాంకర్లు ధరణి పోర్టల్‌లోకి లాగిన్ అయి సర్వే నంబర్లు, ఇతర వివరాలు సరిచూసుకుని పంట రుణాలు ఇస్తున్నారు. కానీ ధరణిలో సాంకేతిక సమస్యలతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటీవల నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖతో జరిగిన సమావేశాల్లో బ్యాంకర్లు ధరణి సమస్యల వల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పినట్టు తెలిసింది.
ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యల వల్ల రైతుల సర్వే నంబర్లు నమోదు కావడం లేదు. పాస్‌బుక్‌లు ఉన్నా బ్యాంకర్ల లాగిన్‌లో కనిపించడం లేదు. కొన్నింట్లో బ్యాంకర్లు ఎంట్రీ చేయడానికి ప్రయత్నించినా నమోదు కావడం లేదు. పలు గ్రామాలు ఇంకా ధరణిలో నమోదుగాకపోవడం, కొన్ని గ్రామాల్లో సర్వే నంబర్లలో ఉన్న భూమికి, ధరణిలో నమోదైన భూమికి తేడాలు ఉండటం వంటి సమస్యలు నెలకొన్నాయి. ఇలాంటి ఇబ్బందులున్న రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీనితో లక్షల మంది రైతులకు పంట రుణం అందకుండా పోతోంది.
రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగక..
రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతోనూ రైతులకు రుణాలు అందని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.37 వేల వరకు బకాయిలున్న రైతులకే రుణమాఫీ చేసింది. ఆపై రుణాలున్న వారికి మాఫీ కావాల్సి ఉంది. రైతులు బ్యాంకు రుణాలను రెన్యువల్ చేసుకోవాలని, ప్రభుత్వం తర్వాత చెల్లిస్తుందని మంత్రులు ప్రకటించినా.. కొందరే అలా రెన్యువల్ చేసుకున్నారు.
చాలా మంది రైతులు ప్రభుత్వం నుంచి రుణమాఫీ సొమ్ము వచ్చిన తర్వాతే రెన్యువల్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. వారికి బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. మరోవైపు 2018నాటికి ఉన్న బకాయిలపై వడ్డీ, చక్రవడ్డీ కలిసి తడిసి మోపెడవుతోంది. కొన్నిచోట్ల బ్యాంకు అధికారులు రైతుబంధు సొమ్మును బకాయిల కింద జమ చేసుకుంటున్నారని.. అలా చేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా బ్యాంకర్ల తీరు మారడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నోడ్యూస్ సర్టిఫికెట్ తెస్తేనే..
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రాజు పంటరుణం కోసం ఏపీజీవీబీని సంప్రదించారు. కానీ బ్యాంకు అధికారులు ఆయనను దొమ్మాట, చేగుంట, నార్లాపూర్‌లలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి ‘నోడ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఆయన పది రోజులు తిరిగి అన్ని బ్యాంకుల్లో సంతకాలు తీసుకొచ్చిన తర్వాతే రుణం మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment